Take a fresh look at your lifestyle.

ఆరంభించి ఆరేండ్లు..పూర్తయ్యింది ఆరు వందల మీటర్లు..!

రోడ్డు రద్దీ కారణంగా ట్రాఫిక్‌ చిక్కులతో నిత్యం అవస్థలు పడుతున్న వాహనచోదకులకు సాంత్వన చేకూర్చేందుకు ప్రారంభించిన ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు నేటికీ నత్త నడకన సాగుతున్నాయి. ఉప్పల్‌ నుంచి నారపల్లి వరకు ఎలివేటెడ్‌ కారిడార్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి పనులు ప్రారంభించి ఆరేళ్లు గడుస్తున్నా అవి నేటికీ అరకొరగానే కొనసాగుతుండడం పట్ల పలువరి నుంచి విమర్శలు వెల్లడవుతున్నాయి. చాలా కాలంగా పనుల్లో స్తబ్ధత కొనసాగిన అనంతరం కొన్ని రోజుల నుంచి కొనసాగుతున్నా ఆశించిన పురోగతి కొరవడిరది. కారిడార్‌ పనులు వేగంగా పూర్తి చేసి తమకు ట్రాఫిక్‌ చిక్కుల నుంచి విముక్తి కల్పించాలని వాహనచోదకులు  కోరుతున్నారు.

మేడిపల్లి, ప్రజాతంత్ర, జనవరి 19 : నానాటికీ పెరిగిపోతున్న ట్రాఫిక్‌ రద్దీ నియంత్రించేందుకు సుధీర్ఘకాలంగా కొనసాగుతున్న ఉప్పల్‌`నారపల్లి మధ్య నిర్మిస్తున్న ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు నేటికీ మందకొడిగానే కొనసాగుతుండడం పట్ల వాహనదారుల్లో తీవ్ర అసహనం వెల్లడవుతుంది. హైదరాబాద్‌`చత్తీస్‌ఘడ్‌ (వరంగల్‌) జాతీయ రహదారి 163 మార్గంలో ఉప్పల్‌ నుంచి నారపల్లి వరకు నిత్యం ట్రాఫిక్‌ జామ్‌లతో రోడ్డుపై వాహనాలు నడపడమన్నది నరకాన్ని తలపిస్తుందని పలువురు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. కేవలం కిలోమీటర్ల గమ్యం చేరుకోవాలంటే గంటల తరబడి సమయం పడుతుందని ప్రజలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం 2018 సంవత్సరంలో రూ. సుమారు 670 కోట్ల అంచనా వ్యయంతో 6.26 కిలోమీటర్ల మేర పొడవైన ఉప్పల్‌`నారపల్లి ఎలివేటెడ్‌ కారిడార్‌ (స్కైవే) పనులకు అంకురార్పణ చేసింది.

కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఈ పనులు చేపట్టి రెండేళ్లలో అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా నిర్ణయించింది. అయితే ఈ భారీ ప్రాజెక్ట్‌ ప్రారంభమయ్యి ఆరేండ్లు గడుస్తున్నా నేటికీ  పూర్తి చేయకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేటికీ పనుల్లో పురోగతి లేక, ఇంకా ఉప్పల్‌లోని కొన్ని చోట్ల పిల్లర్ల పనులు కొనసాగుతుండడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా మేడిపల్లిలో సుమారు ఆరు వందల మీటర్ల దూరం మేర కారిడార్‌ నిర్మణ పనులు పూర్తి కావస్తుండడం గుడ్డిలో మెల్లలా కొంత మేర సంతృప్తి పరుస్తుంది. జీహెచ్‌ఎంసీలో అంతర్భాగమైన ఉప్పల్‌ నుంచి పీర్జాదిగూడ కార్పొరేషన్‌ పరిధిలోని మేడిపల్లి శివారు వరకు ట్రాఫిక్‌ రద్దీ అధికంగా ఉండడంతో ఈ ప్రాంతాలు దాటాలంటే గంటల సమయం పడుతుండడంతో కేంద్రం ప్రభుత్వం ఈ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి పూనుకుంది.

కాగా నిర్ధేశించిన గడువు గడిచిపోయినా నేటికీ పలు చోట్ల పిల్లర్ల నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతుండడం గమనార్హం. ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు జరుగుతుండడంతో తమ ట్రాఫిక్‌ చిక్కులు, తిప్పలు తీరతాయని ఆశించిన పలువురికీ నేటికీ అది నెరవేరలేదు. నిర్మాణం ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ప్రజలకు పనుల ఆలస్యం, ఆగడం, అడపాదడపా సాగడం నిరాశను మిగులుస్తుంది. ట్రాఫిక్‌ కష్టాలతో నిత్యం నలిగిపోతున్న తమకు ఈ పనులు పూర్తై కారిడార్‌ అందుబాటులోకి వొస్తే ఎంతో ఉపశమనం లభిస్తుందనే ఆశతో అనేక మంది ఎదురు చూస్తున్నారు. స్కైవే పనులు ప్రారంభమై ఏండ్లు గడుస్తున్నా నేటికీ చురుకుగా సాగకపోవడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఉప్పల్‌ శివారులోని పీర్జాదిగూడ, బోడుప్పల్‌, మేడిపల్లి, చెంగిచర్ల, పర్వతాపూర్‌, నారపల్లి ప్రాంతాలు దినదినం విస్తరిస్తూ జనాభా అంతకంతకు రెట్టింపవుతున్న కారణంగా రోడ్లపై వాహనాలు పెరిగిపోతున్నాయి. దీంతో ట్రాఫిక్‌ జామ్‌లతో బేజారవుతున్నామని వాహనచోదకులు వాపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన పనుల్లో వేగం పెంచి పూర్తి చేయించి ఎలివేటెడ్‌ కారిడార్‌ను త్వరలో అందుబాటులోకి తేవాలని వారు కోరుతున్నారు.

పనులు సత్వరమే పూర్తి చేయాలి..
ఉప్పల్‌`నారపల్లి ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులను సత్వరమే పూర్తిచేయాలి. ఈ మార్గంలో విపరీతమైన ట్రాఫిక్‌ రద్దీతో వాహనదారులు పడుతున్న అవస్థలు వర్ణణాతీతం. దూర ప్రాంతాల నుంచి వొచ్చే వారు గమ్యానికి సులువుగా చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ స్కైవే నిర్మాణం తలపెట్టి    ఏండ్లు గడుస్తున్నా పూర్తి కాకపోవడం శోచనీయం. అవాంతరాలు లేకుండా ప్రభుత్వాలు పనుల్లో వేగం పెంచి నిర్మాణం పూర్తి చేయాలి.
            ` బూక్యా మణిరాం నాయక్‌, మేడిపల్లి.
……..
ఏండ్లు గడుస్తున్నా ఇంకా నాన్చివేతనేనా..
ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణ పనులు రెండేళ్ళలో పూర్తి కావాల్సినా ఆరేండ్లు గడుస్తున్నా ఇంకా అవసాన దశలోనే ఉండడం విడ్డూరం. ఏటా నిర్మాణ వ్యయం పెరుగుతూ అంచనాలు మారుతున్నా ప్రభుత్వాలకు పట్టదు. ఉప్పల్‌ నుంచి నారపల్లి వరకు చేరుకోవాలంటే గంటల తరబడి సమయం పడుతూ వాహనదారులు ఎన్నో ప్రయాసలకు గురవుతున్నారు. వాహనచోదకుల తిప్పలు తీర్చేందుకు పనుల్లో మరింత వేగం పెంచాలి.
                       ` ముడి మార్టిన్‌, మేడిపల్లి. 

Leave a Reply