Take a fresh look at your lifestyle.

జన కవితాజ్వాల…

నిరాడంబరత, నిర్భీతి, నిజాయితీ, నిస్వార్థంతో సమాజమే తన జీవనరంగం అనుకున్న కవికి సహజంగానే ప్రభావితం చేయగల కవిత్వాన్ని రాసే శక్తి చేకూరుతుంది. కవి ఎవరు, ఏమిటి అతను అన్నది కాలం నిగ్గుతేల్చి చెబుతుంది. కవిత్వం అనేది అతడిలో ఉంటే ఆ కవి శాశ్వతమై బ్రతుకుతాడు, కదిలించి, ఆలోచిం పజేస్తాడు. ప్రజల స్థితిగతులను తెలుసుకొని సామాజిక కోణాలను స్పృశించి కవిత్వాన్ని సజీవ సామాజిక ప్రవాహి నిగా ఉరకలెత్తించిన కవి కాళోజీ. రాయాలనుకున్నది రాసేసి, చెప్పాలనుకున్నది కుండబద్ధలు కొట్టేసే మనస్తత్వం కలిగిన కవి.

తాడిత, పీడిత ప్రజల పక్షపాతిగా నిఖార్సైన కవిత్వాన్ని నిగ్గుటద్దంగా చూపిన ప్రజామిత్రుడు కాళోజీ. ఆవేదన, ఆలోచన, చేతనలు ఆయన కవిత్వంలోని ప్రతిపదంలో తలెత్తి కన్సిస్తాయి. నిజంగా ఆయన సిరాలోంచి ఒలికి కాగితంపై రాలిన ప్రతి అక్షరం లక్షలకు కాదు కోట్ల మెదళ్లకు పెను కదలికే. ప్రతి అక్షరాన్ని నిప్పురవ్వ అంటుకున్న బతుకు పాటగా, నిజం రాతగా మార్చిన మహనీయ, మాననీయ, మానవీయ కవి కాళోజీ.

     మన పిల్లలను చంపి మనల బంధించిన
మాన వాధములను మండలాధీశులను
మరచిపోకుండా గురుతుంచుకోవాలె
కసి ఆరిపోకుండ బుసకొట్టుచుండాలె
కాలంబు రాగానే కాటేసి తీరాలె

అంటూ రజాకార్లపై ఆయన రాసిన కవిత మొత్తం ప్రజల కోపాగ్నికి ప్రతీక. కాళోజీ అంతర్జాతీయ కవి. ఖండాం తరాలకు ఆయన కవిత్వ  జ్యోతులు ప్రసరించాయి. ఏ వెలుగులకీ ప్రస్థానం అని ప్రశ్నిం చినపుడు ప్రతి పేదవాడి గుండెల్లో కవిత్వ దీప శిఖగా తప్పనిసరిగా నిలిచి వెలిగే కవి కాళోజీ, కవిగా ఖచ్చితమైన అభిప్రాయాలను నొక్కి చెప్పిన కాళోజీ వెనకాడని కవిత్వాన్ని సామాజిక యవనికపై దర్శింపజేశారు. ప్రజలు మాట్లాడే జీవభాష వ్యవహారికమేనని అని అన్నారు. జీవధాతువు ముమ్మాటికీ మాండలికమేనని చెప్పి అదే కోవలో, కోణంలో కవిత్వాన్ని రాసి మెప్పించి ఒప్పించారు కాళోజీ.

రెండున్నర జిల్లాలదే దండి బాస  అయినప్పుడు
తక్కినోళ్ల నోళ్ల యాస
తొక్కి నొక్కబడ్డప్పుడు
ప్రత్యేకంగా రాజ్యం పాలు
కోరడం తప్పదు

అంటే  ఆంధ్రప్రాంతపు భాషావాదులను ఏనాడో హెచ్చరిం చారు కాళోజీ.  పాతివ్రత్యం అన్న పదానికి పార్టీవ్రత్యం అన్న పదబంధాన్ని కాళోజీయే రూపొందించి సమకాలీన స్వార్థ రాజీకయాలను కవిత్వ ఎజెండాతో ఎండగట్టిన ధీశాలి.

సమకాలీన సామాజిక దృక్పథం మెండుగా కలిగిన కాళోజీ కవితామూర్తిమత్వానికి ప్రతిబింబం నా గొడవ. నిజానికి సమాజంలోని అందరి గొడవను తన గొడవగా చేసుకొని ఈ కవిత్వ సంకలనాన్ని వెలకట్టలేని అమూల్య ఆధునిక కవిత్వ నిధిగా అందించారు కాళోజీ. ఎక్కడా రాజీపడని ధోరణిని నా గొడవలో కనబరిచిన కవిగా పీడిత పక్షపాతిగా కాళోజీ కనిపించారు. కులమతాతీత ప్రజాస్వామ్య వైఖరిని కనబరిచి తన ప్రగతిశీల దృక్పథమేమిటో అర్థమయ్యేలా చేశారు. బతుకే ప్రజలు, ఉద్యమాలుగా సామాజిక జీవనాన్ని కొనసాగిస్తూ కవిత్వంతో ఎంతో శక్తినిచ్చే భావప్రసారాన్ని కాళోజీ అందించడంలో సఫలీకృతులయ్యారు.

స్వేచ్ఛ, వ్యక్తిత్వం అన్న రెండు మనిషి ప్రధానాంశాలని చెప్పి కవిత్వంలో వాటిని నూటికి నూరు శాతం ఆచరించి చూపిన మానవీయ కవి కాళోజీ. నిరసన గళానికి, ఎలుగెత్తే ప్రశ్నకు నిజరూపం కాలోజీ, కవిగా, ఉద్యమకారునిగా ఆయనది వైవిధ్యమైన పాత్ర. తెలంగాణ వైతాళికునిగా కాళోజీని పేర్కొని తీరాలి. ఇక్కడి సాంస్కృతిక వాతావరణంలోంచి ఆయన క్రమంగా ఎదిగి శిఖర ప్రస్థానం చేశారు. తెలంగాణేతరుల మనసును కూడా గెలుచుకున్న విశిష్ట ప్రజాకవి కాళోజీ, ప్రజాస్వామ్యంలో ఓటు విలువను తెలియజెబుతూ ఓటు వేసేప్పుడే ఆలోచనకు పదను పెట్టమని ప్రజలను హెచ్చరించిన ప్రజాస్వామ్య సామ్యవాది కాళోజీ. నీ అభిప్రాయాల్ని స్వేచ్ఛగా ప్రకటించే నీ హక్కుల కోసం అవసరమైతే నా ప్రాణాలైనా ఇచ్చి పోరాడుతా అని చెప్పిన కాళోజీ నిరంకుశ ప్రభుత్వాలను వెనకా ముందులు చూడకుండా నిర్భీతితో ఎదిరించారనడానికి ఆయన కవిత్వమే నిదర్శనం.

జీవితం, కవిత్వం రెండింటినీ తన చివరి ఊపిరి వరకు భావితరాలకు ఆదర్శప్రాయంగా నడిపిన మహాకవి, తెలంగాణ సాహిత్యపు సిరి కాళోజీ. జీవించినంత కాలం రాసి, వెళ్లిపోయిన తరువాత కూడా తన జ్ఞాపకాలను కవిత్వంతో గుర్తు చేస్తూ పథనిర్దేశనం చేస్తున్న కవిగా సదాస్మరణీయులు కాళోజీ, పుటకనీది, చావు నీది, బ్రతుకంతా దేశానిది అన్నట్టుగా దేశం, సమాజం కోసం బ్రతికిన కవి ఆయన. తన అభిప్రాయాలకు సన్నిహిత భావాలు ఇతర భాషలలో కనపడ్డప్పుడు వాటితో తాదాత్మ్యం పొంది తెలుగు పాఠకుల కోసం అనువదించారు కాళోజీ. ఖలీల్‌ ‌జిబ్రాన్‌ ‌రాసిన దిఫ్రాఫెట్ను ఆయన తెలుగులోకి  జీవనగీతగా కాళోజీ అనువదించారు. నిర్భయంగా మాట్లాడి అదే ప్రకంపనాన్ని కవిత్వంలోనూ చూపిన ధీశాలి కాళోజీ. మహాకవి శ్రీశ్రీ కాళోజీని ఫ్రెంచ్కవి లూయీ ఆరగాన్‌ ‌తో పోల్చారు. మహా విశ్వాసాన్ని వెల్లడించిన కవిత్వాన్ని రాసిన ఖచ్ఛితమైన కవి కాళోజీ. నిరంకుశత్వంపై ఎగసిన బావుటా. అన్యాయంపై ఎగిసిపడ్డ కవితాగ్ని శిఖ. ధిక్కార స్వర సమరశీలి.

తెలంగాణ సాంస్కృతిక వారసత్వం నుండి ఎదిగి వచ్చిన అక్షర కాంతిపుంజం కాళోజీ. పోరాడేతత్వం, సామాజిక స్పృహ ఉన్నంత కాలం కాళోజీ కనిపించి, వినిపిస్తూనే వుంటారు. కవిత్వంగా, కాలాతీతుడైన ప్రజాకవిగా. కాళోజీకి తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రజలు, వాళ్ల  ప్రయోజనాలు, విలువలు బాగా తెలుసు కనుకే వర్గ దృష్టికాకుండా మానవతా దృష్టిని కనబరచి కవిత్వం రాశారు. శ్రీశ్రీని ప్రజలు ఎలా తీసుకున్నారో కాళోజీని కూడా అలాగే తీసుకున్నారు. పదవులకు, ప్రలోభాలకు, ఆస్తులకు, అంతస్తులకు లోబడని దటీజ్‌ ‌కాళోజీ అంటారొక చోట వరవరరావు. నాకు స్నేహితులూ స్ట్రేంజర్సే… కానీ పరిచయస్తులు వుండరు అని స్వయంగా తానే చెప్పుకున్న కాళోజీ కవిత్వానికి పరిచయస్తులు కాని వారుండరంటే అతిశయోక్తి కాదు. అణగారిన శ్రమజీవులు నిర్మిస్తున్న పోరాట చరిత్రను అవగతం చేసుకుని అడుగులేసిన కవి. పథికుడెవరో, పామరుడెవరో మిత్రుడెవరో, శత్రువెవరో తెలియక ఎంతో నిజాయితీగా, నిర్భయంగా సాగిన కవితాప్రయాణం కాళోజీది. ఎవరి మాట కోసమో, పొగడ్త కోసమో, సంకీర్తన కోసమో ఆయన సిరా పొంగి ప్రవహించలేదు. సహజంగా, స్వేచ్చగా జన జీవన సజీవ సత్యాల్ని ఆవిష్కరించింది.

జన ప్రవాహమే తన కవిత్వానికి పుట్టుక అన్నది గ్రహించి నడిచిన పోరాటపు అగ్నిశిఖ కాళోజీ. మాట్లాడని నోరు, కష్టం చేసి తిననోచని చేతులు, సేవచేసి ప్రేమించనోచని శరీరం, మనిషి స్పర్శనోచని మనిషి కాళోజీ స్వభావానికి సరిపడవు. కంట్లో కన్నీరును కత్తిగా మలచుకోండి అని ఒకచోట అంటారు కాళోజీ. తన బతుకంతా దేశానిదైన మనిషిగా ఆయన కన్పిస్తారు. ఎక్కడ అన్యాయం జరిగినా  అక్కడే ధిక్కార స్వరమై వినిపించారు. పోరాడే తత్వం, సామాజిక స్పృహ, మనిషి చుట్టూరా కాటేసే కాలనాగులు కదులుతూ సమస్యలు చీకట్లను పెనవేస్తున్నంత కాలం – కాళోజీ కవితా రక్షణ కవచమై  కనిపించి, విన్పిస్తూనే వుంటారు కవిత్వంగా, కాలాతీతుడైన ప్రజల కవిగా. కాళోజీ బతుకు ఆదర్శం… అది మనిషితనానికి కొలమాన సదృశం. ప్రజల కవితకు ఒరవడులు అద్ది నిప్పుసెగల వెలుతురుని పరివ్యాప్తంగా ప్రసరింపజేసిన మానవ జీవన కవితా వీచిక కాళోజీ.
( 9 సెప్టెంబర్‌ ‌కాళోజీ జయంతి…)

– డా. తిరునగరి శ్రీనివాస్‌
8466053933

Leave a Reply