Take a fresh look at your lifestyle.

అనితర సాధ్యడు ‘‘విశ్వేశ్వరయ్య’’

నేడు ఇంజనీర్ల దినోత్సవం

తమ జీవితాలను ప్రజలకు అంకితం చేసి, దేశానికి ఎనలేని సేవ చేసిన దేశభక్తుల చరిత్ర గురించి విన్నాం. ఏ రంగంలో ఉన్నప్పటికీ ప్రజల కోసమే తపించిన మహనీయుల చరిత్ర నేటి తరం రేఖామాత్రంగా నైనా స్ఫృశించడం లేదు. విద్యా,సాంస్కృతిక,రాజకీయ రంగాల్లోను,శాస్త్ర,సాంకేతిక రంగాల్లోను తమ దైన ముద్ర వేసి, ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న జాతి రత్నాలను మరిస్తే చరిత్ర మనల్ని క్షమించదు. ఏ దేశమేగినా… భారతీయ ఖ్యాతిని దశదిశలా వ్యాపింప చేయడమే నిజమైన దేశభక్తి. ప్రతీ రంగం మరొక రంగంతో ముడి పడివున్న నేపథ్యంలో అన్నిరంగాల్లోని నిపుణులను గుర్తించి,గౌరవించడం అనాదిగా వస్తున్న భారతీయ సంస్కారం. దురదృష్ట వశాత్తు అందరూ రాజకీయ రంగంపైనే తమ దృష్టిని సారించి, మిగిలిన రంగాలలోని ప్రతిభను మసకబార్చడం క్షంతవ్యం కాదు.

గాలి తర్వాత మానవాళి జీవించడానికి అత్యంత ఆవశ్యకమైనది నీరు.భారతదేశం వంటి అనేక దేశాల్లో నీటి లభ్యత పుష్కలంగా ఉంది. అయినప్పటికీ సాగునీటికి,త్రాగు నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అపారమైన జలసంపద సముద్రాల పాలవుతున్నది. కొన్ని రాష్ట్రాల మధ్య నీటి పంపకాల విషయంలోను,నీటి ప్రాజెక్టుల నిర్మాణ విషయంలోను అనేక వివాదాలు తలెత్తుతున్నాయి. అప్పట్లో అనేకమంది మేథావులు తమ ప్రతిభా సామర్ధ్యాలను వినియోగించి భారత్‌ ‌లో అనేక నీటి ప్రాజెక్టులకు నాంది పలికారు. అప్పటి వారి దూరదృష్టి ఫలితాలను నేడు మనం అనుభవిస్తున్నాం. నీటి ప్రాజెక్టుల విషయంలోను, వివిధ రకాల నీటి పథకాల విషయంలోను అద్భుతమైన ప్రతిభ కనబరిచిన భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గురించి ప్రతి ఒక్కరూ తెలుసు కోవాలి.టెక్నాలజీ అభివృద్ధి చెందిన నేటి కాలంలో కూడా నాటి తరం ప్రతిభ కానరావడం లేదు.చిత్తశుద్ది,కార్య దీక్ష వలన మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి ఇంజనీరింగ్‌ ‌నిపుణులు తరతరాలకు తరగని ఖ్యాతి గడించారు.

విశ్వేశ్వరయ్య పూర్వీకులు తెలుగు వారు. విశ్వేశ్వరయ్య కర్ణాటక లోని ఒక కుగ్రామంలో జన్మించి, విజ్ఞాన గని గా అవతరించాడు. అనితరసాధ్యమైన ఇంజనీరింగ్‌ ‌నైపుణ్యంతో ప్రపంచ వ్యాప్తంగా పేరు గడించాడు. చదువు కోవడానికి ఇప్పటిలా అనువైన పరిస్థితులు నాడు లేవు. అయినప్పటికీ మొక్కవోని దీక్షతో,స్వయంకృషితో, శ్రమించి వివిధ రంగాల్లో తమ ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శించిన విశ్వేశ్వరయ్య వంటి వారిని నేటితరం ఆదర్శంగా తీసుకోవాలి. కర్ణాటకలో కృష్ణ రాజసాగర్‌ ఆనకట్ట విషయంలో,భాగ్యనగరం లో మూసీనది వరద ప్రవాహం నుండి ప్రజలను కాపాడడానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య చేసిన కృషి అమోఘం. అనేకమైన మంచి నీటి పథకాలకు, వరద గేట్ల నిర్మాణానికి విశేషమైన కృషిచేసి, ఇంజనీరింగ్‌ ‌రంగంలో అత్యంత నైపుణ్యాన్ని కనబరచి, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన విశ్వేశ్వరయ్య నీటిపారుదల రంగం లోనే కాకుండా విద్యారంగానికి కూడా ఎనలేని సేవలందించాడు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్‌ ‌రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన్ని భారత రత్న అవార్డు తో సత్కరించి, ప్రతీ ఏటా సెప్టెంబర్‌ 15 ‌వ తేదీని ‘‘ఇంజనీర్ల దినోత్సవం’’గా ప్రకటించింది. నాటి తరం చదువుల కంటే నేటితరం చదువులు విశిష్ఠ మైనవని భావించే వారంతా నాటి కాలపు సామర్ధ్యాలను,అంకిత భావాలను అలవరచుకోవాలి.
– సుంకవల్లి సత్తిరాజు, 9704903463, సంగాయగూడెం, ప.గో.జిల్లా, ఆం.ప్ర.

Leave a Reply