Take a fresh look at your lifestyle.

మరణశాసనం రాస్తున్న మాదక ద్రవ్యాల దుర్వినియోగం

‘‘‌మాదకద్రవ్యాల దురలవాటును మాన్పించడం, ఉత్పత్తిని అరికట్టడం, డ్రగ్స్ ‌వాడే వారికి పునరావాసంగా వైద్య సహాయం చేయడం, డ్రగ్స్ ‌పట్ల సంపూర్ణ అవగాహన కల్పించడం, అక్రమ రవాణాను నిలువరించడం, డ్రగ్స్ ‌సప్లై చైన్ను ఛేదించి కఠిన చర్యలు తీసుకోవడం, మాదకద్రవ్యాల నిరోధ చట్టాన్ని అమలు చేయడం లాంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. అంతర్జాతీయ స్థాయి నుంచి పాఠశాలల ఆవరణల వరకు విస్తరించిన మాదకద్రవ్యాల విషకోరలను పీకడానికి అంతర్జాతీయ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పటిష్ట చర్యలు తక్షణమే తీసుకోవాలి.’’

26 జూన్‌ ‘అం‌తర్జాతీయ మాదకద్రవ్యాల దురలవాటు, అక్రమ రవాణ వ్యతిరేక దినం’

చైనాలో ‘ప్రథమ ఓపియమ్‌ ‌యుద్ధం (ఫస్ట్ ఓపియమ్‌ ‌వార్‌)’ ‌జరుగుతున్న వేళ 1839లో ‘లిన్‌ ‌గ్జీగ్జూ’ నేతృత్వంలో ప్రమాదకర ఓపియమ్‌ అ‌క్రమ వ్యాపారాన్ని ఛేదించిన సంఘటన తొలిసారి ప్రపంచ మానవాళి దృష్టిని ఆకర్షించింది. 17 – 26 జూన్‌ 1987 ‌మధ్య వియన్నాలో నిర్వహించిన మాదకద్రవ్యాల వాడకం, అక్రమ రవాణ నిరోధక సమావేశంలో మాదకద్రవ్యాల దురలవాటుతో మిలియన్ల అమాయక ప్రజలు, ముఖ్యంగా యువతీయువకులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, డ్రగ్స్ ‌వాడకాన్ని తగ్గించడానికి కఠిన చర్యలతో పాటు వాటి అక్రమ రవాణాకు తగు పటిష్ట చర్యలు తీసుకోవాలని తీర్మానించింది. ఈ సమావేశానికి గుర్తుగా 07 డిసెంబర్‌ 1987‌న ఐరాస జనరల్‌ అసెంబ్లీ తీసుకున్న తీర్మానం ప్రకారం 26 జూన్‌ 1989 ‌నుంచి ప్రతి ఏట ‘అంతర్జాతీయ మాదకద్రవ్యాల దురలవాటు, అక్రమ రవాణ వ్యతిరేక దినం’ పాటించుట ఆనవాయితీగా మారింది. ఇదే అంశం ఆధారంగా కొన్ని దేశాలు 25-31 జూన్‌ ‌వరకు ‘జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక వారం (నేషనల్‌ ఆం‌టీ-డ్రగ్‌ ‌వీక్‌)’ ‌కూడా నిర్వహిస్తున్నారు. ప్రపంచాన్ని కమ్మిన కరోనా మబ్బుల నేపథ్యంలో వైద్య ఆరోగ్య, యువజన, పోలీస్‌ ‌శాఖలు సమన్వయంతో ఆన్లైన్‌, ‌సామాజిక మాద్యమాల వేదికలుగా మాదక ద్రవ్యాల వినియోగం పట్ల అవగాహన, అక్రమ రవాణ నిరోధక చర్యలను ప్రచారం చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. 2007 వరల్డ్ ‌డ్రగ్‌ ‌రిపోర్ట్ ‌వివరాల ప్రకారం ప్రతి ఏట విశ్వవ్యాప్తంగా వి 322 బిలియన్‌ ‌డాలర్ల మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారం జరుగుతోందని అర్థం అవుతున్నది.

అంతర్జాతీయ మాదకద్రవ్యాల సమస్య :
మాదక ద్రవ్యాల దురలవాటు అంతర్జాతీయ సమస్యగా రూపొందింది. దేశాల సరిహద్దులు దాటుతూ అక్రమ రవాణ చేసే స్మగ్లర్లు, తీవ్రవాద గుంపులు తమ అక్రమ సామ్రాజ్యాలను విస్తరించడం, సప్లై చైన్ను ఏర్పాటు చేసుకోవడం యద్దేచ్చగా జరుగుతున్నది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దురలవాటు, అక్రమ రవాణ వ్యతిరేక దినం-2022 నినాదంగా ‘మాదకద్రవ్యాలతో ఆరోగ్య సవాళ్ళు, మానవీయ సంక్షోభ పరిష్కారాలు(అడ్రెసింగ్‌ ‌డ్రగ్‌ ‌ఛాలెంజెస్‌ ఇన్‌ ‌హెల్త్ అం‌డ్‌ ‌హుమానిటేరియన్‌ ‌క్రయసిస్‌)’ అనబడే నినాదాన్ని తీసుకొని పలు ప్రచార కార్యక్రమాలను నిర్వహించుట జరుగుతున్నది. ‘ఐరాస ఆఫీస్‌ ఆన్‌ ‌డ్రగ్స్ అం‌డ్‌ ‌క్రైమ్‌’ ‌వరల్డ్ ‌రిపోర్ట్ – 2020 ‌వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 269 మిలియన్ల జనులు మాదక ద్రవ్యాలను వాడుతున్నారని, వీరిలో 35 మిలియన్లు మాదకద్రవ్యాల సంబంధ రుగ్మతలతో బాధ పడుతున్నారని తెలుస్తున్నది. కరోనా అలల వల్ల ఉద్యోగ ఉపాధులు తగ్గడంతో నిరుద్యోగ యువత నిరాశకు గురికావడంతో మాదకద్రవ్యాల వాడకం యువతలో పెరిగిందని కూడా తెలుస్తున్నది. కోవిడ్‌-19 ‌విజృంభనతో ఓపియమ్‌ ‌కొరత ఏర్పడటంతో ప్రత్యామ్నాయంగా బెంజోడైజీపైన్‌, ఆల్కహాల్‌ ‌లాంటి కృత్రిమ అత్యంత ప్రమాదకర డ్రగ్స్ ‌వాడకం పెరిగింది.

భారత్లో మాదకద్రవ్యాల సమస్య :
ఇండియాలో దాదాపు 14.6 కోట్ల జనులు ఆల్కహాల్‌ ‌దురలవాటుకు లోనైనారని, 3.1 కోట్లు ప్రజలు కన్నాబిస్‌ ‌డ్రగ్స్, ‌దాదాపు 3 కోట్లు ఓపియం మరియు 8.5 లక్షల ప్రజలు మాదకద్రవ్యాలను సూది మందు రూపంలో (ఐవి) వాడుతున్నారని తేలింది. ఇలాంటి సూది మందులను వాడడం వల్ల హెచ్‌ఐవి-ఏయిడ్స్ ‌కూడా పెరిగిపోయే ప్రమాదం ఏర్పడుతున్నది. భారతదేశంలో మాదకద్రవ్యాల కేంద్రంగా సరిహద్దు రాష్ట్రం పంజాబ్‌ అ‌గ్ర భాగాన ఉన్నది. అంతర్జాతీయ సరిహద్దు రాష్ట్రాల్లో డ్రగ్స్ అ‌క్రమ రవాణ, వాడకం ఎక్కువగా కనిపిస్తున్నది. అస్సాం, ఢిల్లీ, హర్యానా, మణిపూర్‌, ‌మిజోరాం, సిక్కిం, మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఆం‌ధ్రప్రదేశ్‌, ‌గుజరాత్‌ ‌మరియు యుపీ రాష్ట్రల్లో మాదకద్రవ్యాల లభ్యత, వాడకం అధికంగా నమోదు అవుతున్నాయి. కాశ్మీర్‌ ‌సరిహద్దు ప్రాంతాల్లోంచి అక్రమ రవాణాకు తోడుగా కన్నాబిస్‌, ‌హెరాయిన్‌, ‌కొకేయిన్‌ ‌లాంటి మాదకద్రవ్యాలను ఉత్పత్తి కూడా జరుగుతున్నది. బంగ్లాదేశ్‌, ‌శ్రీలంక, నేపాల్‌ ‌దేశ సరిహద్దుల గుండా డ్రగ్స్ ‌దేశంలోకి అక్రమంగా చేరవేయడం జరుగుతున్నది.

మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు :
మాదకద్రవ్యాలు లేదా డ్రగ్స్ ‌దురలవాటుకు గురి అయిన వారు అనేక దుష్ప్రభావాలకు లోనవుతారు. మానసిక కల్లోలం, ఆందోళన, నిరాశ, చికాకు, సుఖభ్రాంతి, అతి చురుకుదనం, అతిగా కదలడం, మానవ సంబంధాలలో అసాధారణ ప్రవర్తన, ప్రేరణ కోల్పోవడం, బాధ్యతల్ని విస్మరించడం, చట్టవ్యతిరేకంగా ప్రవర్తించడం, సత్వర అలవాట్ల మార్పు, విధులకు గైర్హీజరు కావడం, శారీరకంగా బలహీణ పడడం, నిద్ర లేమి, సోమరితనం, అనవసరంగా ఆవేశ పడడం, భయం లేకపోవడం, ఉద్రేక పడడం, మానసిక ప్రవర్తనలో సమూల మార్పులు, సమాజంలో చిన్నచూపుకు గురికావడం, వ్యక్తిత్వ వినాశనం లాంటి పలు అనర్థాలు జరుగుతాయి. మాదకద్రవ్యాల దురలవాటు దుష్పరిణామాల్లో మెదడు క్రియాశీలతలో మార్పులు, అనవసరంగా గాయాల పాలుకావడం, రోగనిరోధకశక్తి పడిపోవడం, హృదయనాళ సమస్యలు, వికారం, వాంతులు, కాలేయ హాని, కడుపు నొప్పి, స్ట్రోక్స్, ‌హార్ట్ అటాక్‌, ‌నిర్ణయం శక్తి నశించడం, శాశ్వతంగా మెదడు ప్రభావితం కావడం, భావోద్వేగాల అస్థిరత్వం, వైద్య సమస్యలు, చట్ట వ్యతిరేక ముద్ర, ఆర్థిక లోటు, జైలు శిక్ష, వివాహితులైతే విడాకులకు దారి తీయడం, పిల్లల్ని తిట్టడం, గృహ హింసకు పాల్పడడం లాంటి అనేక ప్రతికూల ప్రభావాలు కలుగుతాయి.

పలు రకాల మాదకద్రవ్యాలు:
కన్నాబిస్‌ ఆధారిత చరస్‌, ‌గంజాయి, భంగ్‌ ‌లాంటి మత్తు మందులను మిలియన్ల భారతీయులు వాడుతున్నారని తేలింది. డ్రగ్స్లో ముఖ్యంగా స్టిమ్యులెంట్స్ (‌కొకేయిన్‌), ‌డిప్రెసెంట్స్ (ఆల్కహాల్‌), ఓపియ్‌-ఆధార పెయిన్‌ ‌కిల్లర్స్ (‌హెరాయిన్‌), ‌హాలుసినోజన్స్ (‌యల్యస్డి) అనబడే నాలుగు వర్గాలు ఉన్నాయి.

కట్టడి మార్గాలు:
మాదకద్రవ్యాల దురలవాటు అతి ప్రమాదకరమైందని, అంతర్జాతీయ సమాజ సమన్వయంతోనే వాటి అక్రమ రవాణ అరికట్టవచ్చనే సందేశాన్ని ఇస్తూ, డ్రగ్స్ ‌వాడకంతో దేశ యువశక్తి నిర్వీర్యం కావడం, దేశ ఆర్థిక సామాజిక సమగ్రాభివృద్ధి కుంటుపడడం జరుగుతుంది. మాదకద్రవ్యాల దురలవాటును మాన్పించడం, ఉత్పత్తిని అరికట్టడం, డ్రగ్స్ ‌వాడే వారికి పునరావాసంగా వైద్య సహాయం చేయడం, డ్రగ్స్ ‌పట్ల సంపూర్ణ అవగాహన కల్పించడం, అక్రమ రవాణాను నిలువరించడం, డ్రగ్స్ ‌సప్లై చైన్ను ఛేదించి కఠిన చర్యలు తీసుకోవడం, మాదకద్రవ్యాల నిరోధ చట్టాన్ని అమలు చేయడం లాంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. అంతర్జాతీయ స్థాయి నుంచి పాఠశాలల ఆవరణల వరకు విస్తరించిన మాదకద్రవ్యాల విషకోరలను పీకడానికి అంతర్జాతీయ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పటిష్ట చర్యలు తక్షణమే తీసుకోవాలి. మాదకద్రవ్యాల అక్రమ రవాణ అరికట్టే అంతర్జాతీయ వ్యవస్థ, స్థానిక రవాణ, సరఫరాలను నియంత్రించే చర్యలు, తీరప్రాంతాలు, సరిహద్దుల్లో కఠిన కట్టుదిట్టమైన నియంత్రణ వ్యవస్థలను చేపట్టడంతోనే డ్రగ్స్ ‌మహమ్మారిని అడ్డుకోవడం జరుగుతుందని గమనించాలి.

సినీ పరిశ్రమ, విద్యాలయాలు, మహానగరాలు, రేవ్‌ ‌పార్టీలు, పబ్లు, బార్లు, రిసార్టులు, హోటల్స్ ‌లాంటి ప్రదేశాలు మాదకద్రవ్యాల వాడక కేంద్రాలుగా నిలుస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో మాదకద్రవ్యాల వాడకం 30 శాతం పెరగడం గమనించారు.మాదకద్రవ్యాల దురలవాటు ప్రాణాంతకమని హెచ్చరిస్తూ, యువతను సన్మార్గంలో నడిపించాల్సిన కనీస బాధ్యత మనందరి మీద ఉందని గుర్తించాలి. దేశ యువత మత్తులో తూలకుండా, బాధ్యతాయుత పౌరులుగా జాతి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆశిద్దాం.

dr burra madhusudhan reddy

Leave a Reply