Take a fresh look at your lifestyle.

విశ్వ మానవాళికి భవిష్యత్తు హెచ్చరిక!

యుఏఈ, అరేబియన్‌ ద్వీపకల్పం ప్రాంతాలు, ముఖ్యంగా  దుబాయ్‌ నగర జనజీవనం స్థంభించింది. గత సోమవారం అర్థ రాత్రి ప్రారంభమైన అకాల విధ్వంసకర భారీ కుంభవృష్టి ఆ ప్రాంతాలను అతలాకుతలం చేస్తూ రవాణా వ్యవస్థలు ఆగిపోవడం, విమానాశ్రయాలు, ప్రధాన నగర వీధులు, ప్రధాన రహదారులు, వ్యాపార కేంద్రాలు, ఆవాస ప్రాంత గృహాలు మునిగి పోయి దయనీయ స్థితిని తలపించాయి. ఎడారి మహానగరం దుబాయ్‌లో గత 75 ఏండ్ల (1949) తర్వాత నేడు అంత కుంభవృష్టి కురవడం, ఏడాదిన్నర నమోదైన వర్షపాతం ఒక్క రోజులోనే కుండపోతగా 25 సెంమీల(10 ఇంచులు) వరకు వాన కురవడంతో కార్లు, వాహనాలు కాగితాల పడవల వలె వరదల్లో కొట్టుకుపోవడం, విమానాలు జలాశయాల్లో నిలవడం, అపార ఆస్తి నష్టం జరగడం, ప్రాణ నష్టం కళ్ల ముందే జరిగి పోయింది. వర్షాలకు పరితపించే ఎడారి ప్రజలకు ఈ అకాల అసాధారణ కుండపోత వర్షాలు నరకాన్ని పరిచయం చేసాయి. దుబాయ్‌కి 130 కిమీ దూరంలో ఉన్న ఎల్‌ ఐన్‌ అనే నగరంలో అత్యధికంగా 254 మిమీ వర్షపాతం నమోదు కావడం కుంభవృష్టి తీవ్రతను స్పష్టం చేస్తున్నది.  


అకాల కుండపోతకు ‘క్లౌడ్‌ సీడిరగ్‌’ కారణాలు
క్లౌడ్‌ సీడిరగ్‌ అనబడే కృత్రిమ వర్ష ప్రయోగాలు ఈ అకాల వర్షాలకు కారణం కావచ్చని బ్లూమ్‌బర్గ్‌ నివేదిక పేర్కొంటున్నది. తీవ్ర నీటి కొరతతో కొట్టుమిట్టాడుతున్న దుబాయ్‌, యూఏఈ ప్రాంతాల ప్రభుత్వాలు క్లౌడ్‌ సీడిరగ్‌ అనబడే శాస్త్రీయ ప్రయోగాలు తరుచుగా చేస్తున్నాయి. నీటి సమస్యలను అధిగమించడానికి రసాయనాల పూత కలిగిన చిన్న చిన్న ఖనిజ లవణ కణాలు లేదా పార్టికిల్స్‌ను విమానాల సహాయంతో మేఘాల మీద వెదజల్లడం మేఘాల నీటి బిందువులు ఘనీభవించి (కండెన్స్‌ లేదా ప్రెసిపిటేషన్‌) వర్షంగా మారడం అనే సూత్రం ఆధారంగా ‘‘క్లౌడ్‌ సీడిరగ్‌’’ ప్రయోగాలను గత కొన్ని ఏండ్లుగా యూఏఈ కొనసాగించడం చూస్తున్నాం. కుంభవృష్టికి ముందు రెండు రోజులు ఏడు క్లౌడ్‌ సీడిరగ్‌ మిషన్స్‌ నిర్వహించడం ఈ వర్షాలకు కారణం కావచ్చని అంచనా వేస్తున్నారు.


కుంభవృష్టికి వాతావరణ ప్రతికూల మార్పులు కారణమా ?
 వాతావరణ ప్రతికూల మార్పులతో భూతాపం పెరగడంతో సముద్ర, భూఉపరితల నీటి ఆవిరి వేగం పుంజుకోవడం గాలిలో నీటి తేమ పెరిగి అకాల వర్షాలు కురవడం సర్వసాధారణమని కూడా నిపుణులు తెలుపుతున్నారు. ప్రతి ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుదలకు 7 శాతం గాలిలో నీటి తేమ పెరుగుతుందని, ఈ కారణాలతో అకాల అసాధారణ వర్షాలు తరుచుగా, తీవ్ర స్థాయిలో పడతాయని గుర్తు చేస్తున్నారు. హరిత గృహ వాయువుల గాఢత వాతావరణంలో పెరగడం కూడా అకాల వర్షాలకు కారణం అవుతుందని నిపుణులు వివరిస్తున్నారు. (గ్రీన్‌ హౌజ్‌ గ్యాసెస్‌, జిహెచ్‌జీ) 1850 నుంచి నేటి వరకు వాతావరణ ఉష్ణోగ్రత 1.1 డిగ్రీలు పెరిగిందని, యూఏఈలో గత 60 ఏండ్లలో 1.5 డిగ్రీల వరకు పెరిగిందని వివరిస్తున్నారు.

ఎల్‌ నినో, లా నినా ప్రక్రియలు కూడా నేటి కుంభవృష్టికి ఊతం ఇచ్చే అవకాశం ఉందని కూడా అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత వేసవి పొడి కాలంలో యూఏఈ ప్రాంతాల ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరడం కూడా గమనించాల్సిన అంశంగా భావించాలి.   మానవ ప్రమేయ వాతావరణ మార్పులకు కారణాలైన విచక్షణారహిత శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడం, తరగని శక్తి వనరులను అభివృద్ధి చేయడం, విద్యుత్‌ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడం, అడవుల నరికివేతను కట్టడి చేయడం, చెట్లు నాటి హరిత వాతావరణాన్ని సృష్టించుకోవడం, జీవవైవిధ్య/వాతావరణ సమతుల్యతను కాపాడడం లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ సుస్థిరాభివృద్ధికి బాటలు వేస్తూ, అకాల వర్ష వడగళ్లుకు మంగళం పాడదాం.          
-డా. బుర్ర మధుసూదన్‌ రెడ్డి
కరీంనగర్‌, 9949700037

Leave a Reply