Take a fresh look at your lifestyle.

ఆర్టీసీ ఉచిత ప్రయాణం మహిళలకు వరం!

మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రభుత్వం డిసెంబర్‌ 9వ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం చేసే అవకాశం కల్పించింది.ఈ పథకం ద్వారా తెలంగాణకు చెందిన మహిళలు వయస్సుతో సంబంధం లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డులు చూపెట్టి రాష్ట్రమంతా ఉచితంగా ప్రయాణించే వీలు కల్పించింది.ఈ పథకం రవాణా వ్యవస్థను పటిష్టం చేయడమే కాకుండా మహిళల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుంది.ఈ పథకాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఈ పథకం అమలుతో మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.  అంతర్జాతీయంగా చాలా దేశాలలో ఉచిత రవాణా పథకం అమల్లో ఉంది.మన దేశంలో కూడా ఢల్లీి,తమిళనాడు, కర్ణాటక రాష్ట్రల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమల్లో ఉంది. ప్రజా రవాణా వ్యవస్థ అనునది వ్యాపార సంస్థ కాదు లాభనష్టాలు బేరీజు వేసుకోకూడదు.ఈ పథకం అమలుతో రాష్ట్రంలోని పేద మరియు మధ్య తరగతి మహిళలకు ఆర్థికంగా వెసులుబాటు లభిస్తున్నది. ప్రయాణ ఖర్చుల కొరకు వారు తమ కుటుంబ సభ్యులపై ఆధారపడాల్సిన అవసరం లేదు.ఈ పథకం వలన వారికి నాణ్యమైన విద్య మరియు వైద్యం అందుకునే అవకాశాలు మెరుగయ్యాయి.  ఈ పథకం ప్రారంభించిన తర్వాత అనేక ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం కొరకు వచ్చే మహిళల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆసుపత్రుల గణాంకాలు చెప్తున్నవి.మహిళలు ఆసుపత్రులకు దూర ప్రాంతాల నుంచి రావాలంటే చార్జీలకు కూడా భయపడేవారు.కానీ నేడు వారు ఎవరి సహాయం లేకుండా ఉచిత రవాణా సౌకర్యాన్ని ఉపయోగించుకుని స్వతంత్రంగా ఆసుపత్రులకు వచ్చి వైద్యం చేయించుకొని వెళుతున్నారు.మహిళల ఆరోగ్యం పైననే కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఆధారపడి ఉంటుందనేది కాదనలేని నిజం.

ఎంతోమంది పేద మరియు మధ్య తరగతి విద్యార్థులకు ఈ పథకం ఆర్థిక వెసులుబాటును కల్పిస్తూ ఎంతో ఉపయోగపడుతున్నది.వారు నాణ్యమైన విద్య కొరకు ఎంత దూరమైనా వెళ్లి చదువుకునే అవకాశాన్ని కల్పిస్తున్నది. ఈ పథకంతో పారిశ్రామిక రంగంలోని శ్రామిక మహిళల పాత్ర గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ప్రయాణ చార్జీలు లేకపోవడం వలన వారు ఎంత దూరమైన వెళ్లి మెరుగైన ఉద్యోగాలు వెతుక్కుని పని చేయగలుగుతారు.ముఖ్యంగా అసంఘటిత రంగంలోని శ్రామిక మహిళలకు ఈ పథకం ఆర్థికపరమైన వెసులుబాటును కలిగిస్తున్నది. మహిళలు ఆర్థికంగా ఎదుగుటకు ఈ పథకం ఎంతగానో దోహదపడుతున్నది.ఈ పథకం వలన మహిళల పారిశ్రామిక శక్తి ఎంతగానో పెరిగే అవకాశం ఉంది.దీనితో మహిళలకు ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా వారు ఆర్థికంగా ఎదుగుటకు అవకాశాలు పెరుగుతాయి.వేతనాలు అధికంగా లభించే పని ప్రదేశాలకు వాళ్లు సంతోషంగా వెళ్లే అవకాశం ఉంది.ఈ పథకం ద్వారా మహిళలకు ప్రయాణ ఖర్చులు మిగలడంతో ఆ డబ్బును వారు ఇతర అవసరాలకు మళ్ళించుకోవడమే కాకుండా ఎంతో కొంత పొదుపు కూడా చేసుకోగలుగుతారు. 60 రోజుల్లో 15 కోట్ల 21 లక్షల మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యం ఉపయోగించుకొని దాదాపు 535 కోట్ల ప్రయాణ చార్జీలు మహిళలు అదా చేసుకున్నారు.

ఈ పథకాన్ని ఉద్దేశించి కొంతమంది రకరకాలుగా విమర్శిస్తు వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు.మహిళలు అవసరం లేకున్నా బస్సులలో ప్రయాణం చేస్తూ టైంపాస్‌ చేస్తున్నారని అంటున్నారు.నిజానికి మహిళలు ఎవరు కూడా కాలక్షేపానికి,పని పాట లేకుండా వాళ్ల పనులను వదిలేసి బస్సులలో తిరుగరు.బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తున్న మహిళలను చిన్నచూపు చూడాల్సిన అవసరం లేదు.ముఖ్యంగా కొంతమంది బస్సు డ్రైవర్లు మరియు కండక్టర్లు కూడా బస్‌ లలో మహిళల సంఖ్య పెరగడంతో వారిపై చిరాకు పడుతూ వారిని విసుక్కుంటూ చులకన చేసి మాట్లాడుతున్నారు.వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతినేలా మాట్లాడుతున్నారు.దీనికి మహిళా కండక్టర్లు కూడా అతీతం కాదు.

మహిళలు జీరో టికెట్‌ తీసుకున్న ఆ టికెట్‌ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం రిఎంబర్స్‌ చేస్తున్నది.ఈ పథకం అమలుతో బస్సులలో అక్యూపెన్సి విపరీతంగా పెరిగినది.దాదాపు 60 శాతానికి పైగా మహిళలు ఉచిత రవాణా పథకాన్ని వినియోగించుకుంటున్నారు.ఆర్టీసీ సిబ్బంది వారిని గౌరవంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారితో వినయంగా,మర్యాదగా మసులుకోవాలి.గతంలో ఆర్టీసి మనుగడ ప్రశ్నార్ధకమైన విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి.మహిళల వళ్ళనే నేడు ఆర్టీసీ లాభాల బాట పట్టే అవకాశం ఉంది.ఈ పథకం ఆర్టిసి అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది.

ఆక్యూపెన్సి పెరగడం వలన అందుకు అనుగుణంగా అర్‌ టి సి అదనంగా బస్సులు నడపవలసి వస్తుంది. ఉచిత రవాణా వలన పెరిగిన ప్రజా రవాణా డిమాండ్‌ కు అనుగుణంగా కొత్త బస్సులను కొనడం జరుగుతుంది.కొత్త బస్సులు వచ్చినప్పుడు అదనంగా సిబ్బంది అవసరం ఏర్పడుతుంది.దీనితో సిబ్బంది నియమాకాలు కూడా పెరుగుతాయి.ఈ పథకము అమలు మొదలైన తర్వాత ఆర్టీసీలో కారుణ్య నియమకాలు కూడా ఇవ్వడం మనం చూస్తున్నాం.పెరిగిన రద్దీకి అనుగుణంగా బస్టాండ్లలో మరియు బస్‌ షెల్టర్లలో మహిళలకు కావలసిన కనీస సదుపాయాలను మెరుగుపరచాల్సిన అవసరం కలదు.

జీరో టికెట్లకు సంబంధించిన డబ్బులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆర్టీసీకి చెల్లించినచో ఆర్టీసీ లాభాల బాట పట్టే అవకాశం కలదు.దీంతో ప్రయాణికులకు అర్‌ టి సి ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించగలుగుతుంది.ఈ పథకం అమలుతో ఆర్టీసీ బలోపేతం కావాలి తప్ప నష్టాల పాలు కాకూడదు. కాబట్టి ఆర్టీసీకి మరియు సిబ్బందికి సంబంధించిన బకాయిలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లిస్తూ ఉండాలి.సిబ్బంది ఆనందంగా పనిచేస్తేనే ఆర్టీసీ మనుగడ సాఫీగా కొనసాగుతుంది.ఈ పథకం అమలు చేసే క్రమంలో ఎదురయ్యే లోటుపాట్లను ప్రభుత్వం సరిచేసుకుంటూ ముందుకు వెళితే పథకం విజయవంతం అయ్యే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం వలన విభిన్న రంగాలలోని మహిళలు  ఎవరి మీదా ఆధార పడకుండా తమ పనులు తామే స్వయంగా చేసుకునే అవకాశం మెరుగుపడుతుంది.మహిళా సాధికారత పెరగడమే కాకుండా ఆర్టీసీ కూడా లాభాల బాట పట్టే అవకాశం ఎంతగానో ఉంది.ఎక్కువ మంది ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించడం వల్ల వ్యక్తిగత వాహనాల వినియోగం కొంత మేర తగ్గి ఇంధన పొదుపు తద్వారా వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది. ‘‘ఆర్టీసీ ఉచిత రవాణా సౌకర్యంతో మహాలక్ష్మి లకు గౌరవం-అర్‌ టి సీ కి వరం’’ అని చెప్పవచ్చు.

 -పుల్లూరు  వేణుగోపాల్‌
9701047002

Leave a Reply