Take a fresh look at your lifestyle.

అసెంబ్లీ బరిలోకి ఎంపీలు

  • సొంత నియోజకవర్గాలపై రేవంత్‌ ‌రెడ్డి, బండి సంజయ్‌ ‌నజర్‌
  • ‌వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ సంకేతాలు
  • తరచూ పర్యటనలతో కార్యకర్తలలో ఉత్తేజం

ప్రజాతంత్ర. హైదరాబాద్‌ : ‌తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా ప్రధాన పార్టీల నేతలు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికార పార్టీపై విజయం సాధించడానికి అన్ని రకాలుగా సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, ‌బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయనున్నట్లు తమ పార్టీ కార్యకర్తలకు సంకేతాలు ఇస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ విజయం సాధించి అధికారంలోకి రావడం తథ్యమని బలంగా నమ్ముతున్న ఈ నేతలు తరచూ తమ సొంత నియోజకవర్గాలలో పర్యటిస్తూ కార్యకర్తలలో ఉత్తేజం నింపుతున్నారు.ప్రస్తుతం పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గం లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. గతంలో కొడంగల్‌ ‌నుంచి ఎమ్మెల్యేగా పలుమార్లు ప్రాతినిద్యం వహించిన ఆయన వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఇటీవల అక్కడ నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు. తాను మల్కాజ్‌గిరి ఎంపీ అయినప్పటికీ తన మనసంతా కొడంగల్‌ ‌నియోజకవర్గం పైనే ఉందనీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గం నుంచే ఎన్నికవుతానని పేర్కొన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికలలో తనను అధికార టీఆర్‌ఎస్‌ ‌పార్టీ కుట్రపూరితంగా ఓడించిందనీ, ఈసారి గెలుపు తనదేనని స్పష్టం చేస్తున్నారు. ఇక నుంచి కొడంగల్‌ ‌నియోజకవర్గంలో తరచూ పర్యటిస్తాననీ, పార్టీ కార్యకర్తల కష్టసుఖాలలో పాలు పంచుకుంటానని చెబుతున్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌కూడా ఇదే పంథాలో పయనిస్తున్నారు. కరీంనగర్‌ ‌లోక్‌సభ్యుడుగా ఉన్న బండి సంజయ్‌ ‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అధికార టీఆర్‌ఎస్‌ ‌పార్టీపై పోరాటం చేస్తున్నారు. కరీంనగర్‌ ‌లోక్‌సభ సభ్యునిగా ఎన్నిక కావడానికి ముందు సంజయ్‌ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓటమి చవిచూశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కరీంనగర్‌ ‌నుంచి పోటీ చేసే ఉద్దేశ్యంతో ఉన్న సంజయ్‌ ఇటీవల జాగరణ దీక్ష పేరుతో భారీ కార్యక్రమం నిర్వహించారు. దీంతో పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమనీ, ఈ దిశగా ఇప్పటి నుంచే పార్టీ కార్యకర్తలను కార్యోన్ముఖులను చేస్తున్నారు.

Leave a Reply