Take a fresh look at your lifestyle.

హృదయమే కృష్ణమందిరం

మానవునికి సుఖశాంతులను అందించేది భగవన్నామస్మరణ ఒక్కటే.భగవంతుని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఆయన నామాన్ని అలక్ష్యం చేయరాదు. చేస్తే అధోగతి తప్పదు.ప్రతి నామంలోనూ ఒక ప్రత్యేకత వుంది. ఓం నమశివాయ అనే పంచాక్షరీ మంత్రానికి ‘మ’ కారము ప్రాణ సమానము. దానిని తొలగిస్తే అది ‘నశ్శివాయ’ అవుతుంది.  మంగళకరమైపోతుంది. అలాగే ‘ఓంనమోనారాయణాయ’ అనే అష్టాక్షరీ మంత్రానికి ‘ర’కారం ప్రాణ సమానం. ‘ర’కారం లేకపోతే అదికూడా అమంగళకరమైపోతుంది. పంచాక్షరీ మంత్రానికి ప్రాణసమానము ‘మ’కారము, అష్టాక్షరీ మంత్రానికి ప్రాణసమానము ‘ర’కారము. ఈ రెండింటి చేరికచేత ఏర్పడినదే రామనామము. దైవమే తల్లి. దైవమే తండ్రి. దైవమే గురువు. దైవమే మిత్రుడు. దైవాన్ని సర్వస్వంగా భావించుకోవాలి. దైవబలం అంటూ వుంటే, సర్వం బలాలూ మనకు వున్నట్లే. దైవంతో సహవాసం చేయగలగాలి. అలా దైవంతో స్నేహాన్ని బలపర్చుకోగలగాలి. ఇక ఈ జగత్తు అంతా హస్తగతమైనట్టే. భగవంతుడు ఎక్కడో ఏదో గుడిలోనో, ఏదో క్షేత్రంలోనో ఉన్నాడని చెప్పడం గాక, శాశ్వతమైన పుణ్యక్షేత్రం మన హృదయమే. అదే భగవాన్‌ ‌నివాసం. మీరా పరమభక్తురాలు, ఆమెను అడిగితే, ‘నా హృదయమే కృష్ణ మందిరం’ అంటుంది. భగద్గీతలో కృష్ణ భగవానుడు సెలవిచ్చినట్లుగా ‘క్షేత్రజ్ఞం చాపి మాంవిద్ది’ అన్నది భగవద్గీత.

దేహమే క్షేత్రము. భగవంతుడే క్షేత్రజ్ఞుడు. భగవంతుని సామాన్యంగా మానవులందరూ లౌకికమైన కోర్కెటే కోరుతుంటారు. అవన్నీ క్షణికాలే. ఈరోజు వుంటాయి.రేపు పోతాయి. ఈ లోకంలో మనదగ్గర లేనిదీ, భగవంతునివద్ద ఉన్నదాన్ని ఇవ్వమని కోరాలి. ఈ లోకంలో శాంతి, ఆనందం లేవు. అవి కేవలం దేవుని వద్ద మాత్రమే దొరుకుతాయి. వాటిని మనం కోరాలి. అయితే దానికి మనం చేయాల్సినది ఒకటుంది. అది ఎంతో సులభమైనది. మనహృదయంలో దయకూ, ప్రేమకూ చోటివ్వాలి. ఒక్కసారి మీ హృదయం కరణామయమై, ప్రేమభరితమైతే, ఇక మీకు ఆనందమే ఆనందం లభిస్తుంది. మన పురాణ గ్రంధాలను పరిశీలిస్తే, రామాయణంలో మంధర, శూర్పణఖలు కనిపించేది చాలా తక్కువ సమయంలోనే. అయినా ఇంత చిన్న పాత్రలైన శూర్పణఖ, మంధరల ద్వారానే రామాయణం అంతా జరిగింది. రాముడు అరణ్యానికి పోవడానికీ అరణ్యం నుండి సీత లంకకు చేరడానికీ రావణసంహారానికీ వీరిద్దరే కారకులైనారు. వాల్మీకీ మహార్షి వీరికి కొద్దిగా మాత్రమే చోటిచ్చాడు. వీరిరివురూ ఎవ్వరిని పరిశీలిస్తే మనకు శూర్పణఖ కామమునకూ, మంధర క్రోధమునకూ కార్యకర్తలుగా కనిపిస్తారు. కామమూ క్రోధమే మన జీవన రామాయణానికి ముఖ్య కారకులవుతారని తెల్సుకోగలిగాలి. వీటిని జయించడమెట్లాగు? ఎవ్వరూ నిరాశ చెందనవసరం లేదు.అన్ని విధాలైన వాంఛలనూ భగవద్భావంతో అనుభవించడంలోనే అమృతానందం కలుగుతుంది. ప్రకృతిలోనే పరమేశ్వర స్వరూపాన్ని వీక్షించాలి. ఈ రెండింటినీ వేరు చేయడంతోనే ప్రమాదాలు సంభవిస్తాయి. రామాయణంలో ఒక గొప్ప సందేశాన్ని సీత మనకు అందించింది. ఆమె కామాన్ని (కోర్కెలను) త్యాగం గావించి, సర్వ సు:ఖాలనూ భోగాలనూ త్యజించి రామునితో వెళ్ళడానికి నిర్ణయించుకుంది. ఆ అవకాశాన్ని చేజిక్కించుకుంది. కానీ తిరిగి కామం కారణంగా ఆమె రామునికి దూరం అయ్యింది. విధివశాత్తు సీతకు బంగారు లేడిపై కామం కలిగింది. అప్పుడిక రాముడు దూరమైపోయాడు. ఇట్టి పవిత్రమైన అంతరార్ధాన్ని మన పవిత్ర గ్రంధాలైన రామాయణ, భారత, భాగవతాల్లో గ్రహించగలిగాలి. ప్రతి దేహంలోనూ భగవంతుడే ఉన్నాడన్నది మన నమ్మకం. దేహమే ఒక దేవాలయం.ప్రతి అంతరంగంలోనూ ఆత్మారాముడై, ఆనందధాముడై విరాజిల్లుతూ ఉన్నాడు. ఆత్మారాముని చల్లని ఆశిస్సులే శాంతి సౌఖ్య ప్రదాలు. మానవజాతినంతటినీ సంధింపగల ఏక సూత్రమే, ప్రేమ ధర్మాల సంధీభావమే. మన పురాణ గ్రంధాలు నిస్సంగత్వాన్నీ, ప్రతి ప్రాణిలోనూ దివ్యత్వాన్ని గుర్తించాలనీ పదేపదే బోధించాయి.
– డా।। పులివర్తి కృష్ణమూర్తి

Leave a Reply