Take a fresh look at your lifestyle.

జయహో! స్టెతస్కోపు

మొక్కులు
తుక్కు కింద జమైయ్యాయి
మృత్యుస్పర్శతో
తెగిన గాలిపటమై ఎగుర్తున్న ప్రపంచాన్ని
పసిపిల్లలా పట్టుకొని…సేదతీర్చి…
స్టెతస్కోపు
తన నీడ కింద నిలబెట్టుకొని
చల్లని సమీరమై వీచింది
భయంమేఘాల్ని తునాతునకలు చేసింది

దుఃఖాన్ని
దూదితో తూడ్చేస్తోంది

ధమనుల్లో
ధైర్య ద్రావణాన్ని ఎక్కిస్తూ
నమ్మకం
ఆసుపత్రి మంచంలా పరిచింది

అనుభవాల డాలు ఆసరాగా
శాస్త్రశస్త్రాన్ని సంధించి
వైద్యయుద్ధమై
అదృశ్యాణువు
కరోనాను ముట్టడించి
విజయదుందుబి మ్రోగిస్తోంది

ఎవరవకాశాన్ని వారికందిస్తూ
ఈ మట్టితో
జీవనబంధాన్ని సజీవం చేస్తోంది

చిగుర్చిన ఆకుల్ని
విరిసిన పువ్వుల్ని
మధుర జీవనఫలాల్ని పంచుతోంది

చీకటి పడ్తున్న జీవితాలను
వెలుగులతో శానిటైజ్‌ ‌చేస్తూ
మృత్యువు కడ్డంగా
తన ప్రాణాయుధాన్ని నిలబెట్టింది

మృత్యుగుప్పిట్లోని
ఉచ్వాసల నిశ్వాసల ప్రపంచానికి
వొక వర్తమానాన్ని
వొక భవిష్యత్తును
నూరేళ్ళూ పోస్తోంది
ఇవ్వాళ
స్టెతస్కోపంటే
వొక దేశసైన్యం కాదు

స్టెతస్కోపులో
భూగోళం అమర్చుకున్న
ప్రపంచ సైన్యం !!

క్షమించండి
భూమ్మీద
దేవుడు తప్పి పోయాడు

 – వడ్డెబోయిన శ్రీనివాస్‌
9885756071 

Leave a Reply