Take a fresh look at your lifestyle.

బిజెపికి వోటు…రాజ్యాంగానికి, రిజర్వేషన్‌కి చేటు

 ఉమ్మడి ఖమ్మం జిల్లా వోటరు తీర్పు దేశానికి దిక్సూచి
 పదేళ్లలో రాష్ట్రాన్ని రూ.7 లక్షల కోట్ల అప్పులో ముంచిన కెసిఆర్‌
 భదాద్రి రాముడి సాక్షిగా ఆగస్టు15లోగా రైతులకు రుణమాఫీ

 కొత్తగూడెం బహిరంగ సభలో సీఎం రేవంత్‌ రెడ్డి
కొత్తగూడెం, ప్రజాతంత్ర, మే 04 : పార్లమెంట్‌ ఎన్నికల్లో బిజెపికి వోటు వేస్తే మన నెత్తిన మనమే దుమ్ముపోసుకున్నట్టేనని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. ఖమ్మం, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థులు, రామసాయం రఘురామ్‌ రెడ్డి, పోరిక బలరామ్‌ నాయక్‌ గెలుపును కాంక్షిస్తూ కొత్తగూడెం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ…దేశంలో 10 ఏళ్లపాటు మతపరమైన పాలన కొనసాగించిన బిజెపి నేడు మరోసారి అధికారంలోకి రాగానే ఆనాడు కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజ్యాంగం ద్వారా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి కోసం కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేయడంతో పాటు రాజ్యాంగాన్ని సైతం మార్చాలని ఏకైక లక్ష్యంతో మూడోసారి అధికారంలోకి వొచ్చేందుకు ప్రయత్నిస్తుందన్నారు.
దీన్ని అడ్డుకోకుంటే ఈ దేశంలో కేవలం కొన్ని వర్గాల ప్రజలు మాత్రమే జీవించి అభివృద్ధి చెంది అవకాశముంటుందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వోటర్లు దేశంలోని చైతన్యవంతం కలిగిన వోటర్లన్నారు. గతంలో జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ అయినా బిఆర్‌ఎస్‌కు కేవలం ఒకే ఒక సీటు వొచ్చేలా తీర్పునివ్వడంతోపాటు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం టిఆర్‌ఎస్‌కి ఒకే సీటు ఇచ్చి దేశ ప్రజలంతా ఉమ్మడి ఖమ్మం జిల్లా వైపు చూసేలా చేసిన ఘనత ఉమ్మడి ఖమ్మం జిల్లా వోటర్లది అన్నారు. విలక్షణ తీర్పుకు పెట్టింది పేరుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నిలిచిపోతుందని, త్వరలో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో సైతం బిజెపి దిమ్మతిరిగేలా ఖమ్మం జిల్లా వోటర్లు కాంగ్రెస్‌కు పట్టం కట్టి దేశానికి దిక్సూచిగా మారనుందన్నారు. ఖమ్మం జిల్లాకి మరో ప్రత్యేకత ఉందని వాటి దివంగత ముఖ్య మంత్రి రాజశేఖర్‌ రెడ్డి సైతం ఖమ్మం జిల్లా ప్రజల తీర్పుని కాంగ్రెస్‌ నాయకులను కార్యకర్తలను ఒక సీఎంల చూసేవాడని ఇక్కడ ప్రజలు సమస్యల కోసం ఎవరికి వారే పోరాటం చేసే సాధించుకుంటారని ఇది కాంగ్రెస్‌ అధిష్టానమే గుర్తించిందని అంతటి మహా నాయకుడు సైతం ఖమ్మం జిల్లా వోటర్లు నాయకులు కార్యకర్తలు అంటే వనికిపోయేవారన్నారు.
image.png
రాష్ట్రానికి విషయానికి వస్తే పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్‌ రాష్ట్ర ఖజానాను ఏడున్నర లక్షల కోట్ల అప్పుల ఊబిలో ముంచిపో యాడన్నారు. తమ అధికారంలోకి వచ్చి బాధ్యతలు చేపట్టిన నాటికి రాష్ట్ర ఖజానాలో రూ 7వేల కోట్లు మాత్రమే ఉన్నాయని, వీటితో తామిచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించి ముందుకు సాగుతున్నామన్నారు. దీన్ని గుర్తించని కెసిఆర్‌ రైతు రుణమాఫీ ఎన్నికల హామీలపై తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటు అన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి కేంద్రం నుండి నిధులు అభివృద్ధి పథకాలు తెప్పించుకోలేని చేతగాని వ్యక్తి పదేళ్లు మన రాష్ట్రాన్ని పాలించారని మండిపడ్డారు. విభజన హామీలు అమలు చేయడంలో బిజెపి, వాటిని సాధించుకోవడంలో బిఆర్‌ ఎస్‌ రెండు విఫలం చెందని ఆరోపించారు.
అంతర్గత ఒప్పందంతో నేడు పార్లమెంట్లో గెలిచి కేంద్రపాంత్రి పదవులను పొందేం దుకు బీఆర్‌ఎస్‌ బిజెపితో కలిసి మరోసారి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. దీన్ని తెలంగాణ ఓటర్లు గుర్తించి తిప్పి కొట్టాలని, ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లా వోటర్ల నుండే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు జిల్లా అధ్యక్షులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు నాయకులు, సిపిఐ, సిపిఎం జన సమితి, పాల్గొన్నారు.

Leave a Reply