Take a fresh look at your lifestyle.

పౌర హక్కుల ఉద్యమం ప్రారంభం ..2

“పార్వతీపురం కుట్రకేసు అనబడేది ఎన్నో కేసుల, నేరారోపణల సమాహారం. అసలు ఆ కేసు నమోదయిన 1970 జనవరి నుంచి ఇటీవలి కుట్రకేసుల దాకా ఇన్వెస్టిగేటింగ్‌ ఆఫీసర్లు చేసిన పనల్లా అంతకుముందరి ఒకటి రెండు సంవత్సరాల్లో నమోదయిన ఎఫ్‌ఐఆర్‌ ‌లన్నీ చదివి వాటన్నిటినీ మళ్ళీ ఒకచోట రాయడం. ఈ పని చేసినందుకు కనీసం ఇద్దరు ఇన్వెస్టిగేటింగ్‌ ఆఫీసర్లు ప్రమోషన్లు పొంది ఐపిఎస్‌లుగా కన్ఫర్‌ అయ్యారు.”

ఆ సంవత్సరమే ఆగస్ట్‌లో జ్వాలాముఖి, నిఖిలేశ్వర్‌, ‌చెరబండరాజు లను అరెస్ట్ ‌చేసి ప్రివెంటివ్‌ ‌డిటెన్షన్‌ ఆక్ట్ ‌కింద కేసులు పెట్టారు. ఆ అరెస్టులను సవాలు చేస్తూ, అసలు ప్రివెంటివ్‌ ‌డిటెన్షన్‌ ‌చట్టమే రాజ్యాంగ విరుద్ధమని వాదించాం. జస్టిస్‌ ‌చిన్నప్ప రెడ్డి, జస్టిస్‌ ఎడివి రెడ్డిల ధర్మాసనం మా వాదనను అంగీకరించి పిడి ఆక్ట్‌లోని ఒక నిబంధనని కొట్టివేసింది. ఫలితంగా పి.డి. చట్టం పూర్తిగా రద్దయిపోయింది. ఆ చట్టం, దాని బాగోగులు, వాదనలు మరోసారి వివరిస్తాను. రావి సుబ్బారావు గారితో స్నేహం వల్ల నేను కూడా ఆయనతో పాటు ఈ కేసులు వాదించడం మొదలు పెట్టాను. ఆయన పట్ల గౌరవంతోనే నేను ఒక సిపిఐ కార్యకర్త పోషణకు నెలవారీ విరాళం కూడా ఇస్తుండేవాడ్ని.

రాష్ట్రంలో విపరీతంగా నిర్బంధం అమలవుతున్న ఆ రోజుల్లో కోర్టు కేసులు వాదించడానికి న్యాయవాదులను ప్రేరేపించవలసిన అవసరం వచ్చింది. పార్వతీపురం కుట్రకేసు, హైదరాబాదు (నాగిరెడ్డి) కుట్రకేసులతో పాటు ఎన్నో డజన్ల కేసులు విప్లవ కార్యకర్తల మీద, సానుభూతి పరుల మీద నడిచాయి. అప్పుడు కొందరు విప్లవకారులు ‘బూర్జువా కోర్టులను బహిష్కరించాలి’ అనే వైఖరి తీసుకోవడం వల్ల వాళ్ళ తరఫున వాదనలు వినిపించుకునే అవకాశం కూడ పోగొట్టుకున్నారు. ఈ స్థితిలో విప్లవకారుల కేసులు వాదించేలా న్యాయవాదులను ప్రోత్సహించడానికి కలకత్తా నుంచి సీనియర్‌ ‌న్యాయవాది భక్తి భూషణ్‌ ‌మండల్‌ ‌హైదరాబాదు వచ్చారు. భక్తి భూషణ్‌ ‌మండల్‌ ‌హైదరాబాదు పర్యటనను రావి సుబ్బారావే నిర్వహించారను కుంటాను.

ఒక సాయంకాలం హోటల్‌ ‌హరిద్వార్‌ ‌కాన్ఫరెన్స్ ‌హాలులో భక్తి భూషణ్‌ ‌మండల్‌ ఉపన్యాసం ఏర్పాటు చేశారు. ఆ సభకు నన్ను రావి సుబ్బారావు తీసుకుపోయారు. ఆ సభకు దాదాపు నలభై మంది న్యాయవాదులు హాజరయ్యారు. అది కచ్చితంగా 1971కి ముందే జరిగిన సమావేశం. ఒక రకంగా రాష్ట్రంలో పౌరహక్కుల ఉద్యమ నిర్మాణపు తొలి ప్రయత్నాలలో అది ఒకటి. ఆ సమావేశంలో భక్తి భూషణ్‌ ‌మండల్‌ ‌చాలా బాగా మాట్లాడారు. విప్లవకారుల కేసులు వాదించడానికి మమ్మల్ని ఉత్తేజపరిచారు. ఆ సమావేశం చివరిలో ఏదయినా నిర్మాణ ప్రయత్నం చేయాలనుకున్నాం.

అప్పటికే నా తల నెరవడం మొదలయింది. ‘‘మీ తల నెరుస్తోంది కాబట్టి మీకు బాధ్యత తీసుకునే అర్హత వచ్చిందన్నమాట. మీరు కన్వీనర్‌గా ఉంటే బాగుంటుంది’’ అన్నారందరూ. అట్లా నక్సలైటు ఖైదీల డిఫెన్సు కమిటీ ఏర్పడి నేను దాని కన్వీనర్‌ ‌నయ్యాను. ఆ డిఫెన్స్ ‌కమిటీ బాధ్యులుగా జీవన్‌ ‌రెడ్డి, పద్మనాభ రెడ్డి, రావి సుబ్బారావు, పత్తిపాటి వెంకటేశ్వర్లు ఉండేవారు. జీవన్‌ ‌రెడ్డి ఆ తర్వాత జడ్జి అయ్యారు. రావి సుబ్బారావు 1980లో చనిపోయారు. పద్మనాభ రెడ్డి, పత్తిపాటి వెంకటేశ్వర్లు ఇంకా న్యాయవాద వృత్తిలో ఉన్నారు.

కాని ఆ డిఫెన్స్ ‌కమిటీ వేసినప్పుడు మేమందరమూ బహుశా మా ముప్పయ్యవ పడిలోనే ఉన్నాం. రాష్ట్రంలో ఎక్కడ డిఫెన్స్ ‌వాదనలు అవసరమయినా వెళ్ళి మా శక్తియుక్తులు వెచ్చించగల వేడినెత్తురుతో ఉన్నాం. నా వరకు నాకు అప్పటికి బయటికి వెళ్ళి పనిచేసిన అనుభవం లేదు. అప్పటికి నేను సభల్లో ఉపన్యాసాలు ఇచ్చిన వాడ్ని కూడా కాదు. కేవలం న్యాయస్థానాలలో పని చేసిన అనుభవం ఉంది. ఎంతో కొంత వాదనా పటిమ సంపాదించాను. కాని ఆ హరిద్వార్‌ ‌హోటల్‌ ‌సమావేశం తర్వాత, అన్యాయంగా కేసుల పాలయి నిర్బంధం అనుభవిస్తున్న ప్రజా ఉద్యమ కార్యకర్తలకు మద్దతుగా ఒక నిర్మాణం తయారవు తున్నప్పుడు, దానికి నా శక్తి ధారపోయడం అవసరం అనిపించింది.

అంతేకాదు, ‘ఎంత చిన్నదయినా సరే నీ రంగం అంటూ ఒకటి ఎంచుకో, ఆ రంగంలో సమర్థంగా పనిచెయ్యి’ అనే నా జీవనతత్వం ఇక్కడ ఉపయోగించవచ్చు ననిపించింది. ఉద్యమ కార్యకర్తలు, ప్రజలు కోల్పోతున్న పౌర, ప్రజాస్వామిక హక్కులను పరిరక్షించడానికి పోరాడడమే నా రంగం అని నిర్ణయించుకున్నాను. నాకు గుర్తున్నంతవరకు, ఆ సమావేశం జరిగిన మర్నాడే పార్వతీపురం కుట్రకేసు ముద్దాయిల తరఫున 250 రిట్‌పిటిషన్లు దాఖలు చేశాం. అప్పటికి పార్వతీపురం కుట్రకేసు పెట్టి చాల కాలమయింది గాని విచారణ మొదలు కాలేదు. అసలు ఈ రాష్ట్రంలో కుట్రకేసుల పేరు మీద జరిగిన అక్రమాల గురించి వివరంగా చెప్పాలి. దానికి మరో అధ్యాయం కేటాయిస్తున్నాను గాని ప్రస్తుతానికి పార్వతీపురం కుట్రకేసు గురించికొన్ని విషయాలు చెప్పాలి.

పార్వతీపురం కుట్రకేసు అనబడేది ఎన్నో కేసుల, నేరారోపణల సమాహారం. అసలు ఆ కేసు నమోదయిన 1970 జనవరి నుంచి ఇటీవలి కుట్రకేసుల దాకా ఇన్వెస్టిగేటింగ్‌ ఆఫీసర్లు చేసిన పనల్లా అంతకుముందరి ఒకటి రెండు సంవత్సరాల్లో నమోదయిన ఎఫ్‌ఐఆర్‌ ‌లన్నీ చదివి వాటన్నిటినీ మళ్ళీ ఒకచోట రాయడం. ఈ పని చేసినందుకు కనీసం ఇద్దరు ఇన్వెస్టిగేటింగ్‌ ఆఫీసర్లు ప్రమోషన్లు పొంది ఐపిఎస్‌లుగా కన్ఫర్‌ అయ్యారు. పార్వతీపురం కుట్రకేసులో ముద్దాయిలు 148 మంది. ప్రాసిక్యూషన్‌ ఇచ్చిన సాక్షుల సంఖ్య వెయ్యికి పైన. వెయ్యి మంది సాక్షులు చూస్తుండగా నూటయాభై మంది చేసిన పనులు కుట్ర ఎట్లా అవుతాయని విప్లవ రచయితలు ఎద్దేవా చేస్తుండే వాళ్ళు.

-కె.జి. కన్నబిరాన్‌
ఆత్మకథాత్మక సామాజిక చిత్రం
అక్షరీకరణ :ఎన్ .వేణుగోపాల్

Leave a Reply