Take a fresh look at your lifestyle.

నిర్మాణంలో ఉన్న భవనం కూలి ముగ్గురు కూలీల మృతి

• ఒకరి పరిస్థితి విషమం…మరొకరికి తీవ్ర గాయాలు
• బిల్డర్‌ ‌కక్కుర్తి, టౌన్‌ ‌ప్లానింగ్‌ అధికారుల అవినీతితో ముగ్గురు బలి
• ప్రభుత్వ విప్‌, ‌శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ దిగ్భ్రాంతి

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 7: ‌నిర్మాణంలో ఉన్న భవనం కూలి ముగ్గురు కూలీలు మృతి చెందిన ఘటన గురువారం శేరిలింగంపల్లి నియోజక వర్గం, కూకట్‌పల్లి సర్కిల్‌ ‌హైదర్‌ ‌నగర్‌ ‌డివిజన్‌ ‌పరిధిలోని అడ్డగుట్టలో చోటు చేసుకుంది. అడ్డగుట్టలో దాసరి సంతోష్‌, ‌దాసరి శ్రీరామ్‌ అనే వ్యక్తులు సర్వే నెంబర్‌ 176‌పి, 177పి,182 పిలోని 668 గజాలలో నిర్మాణం చేపట్టారు. దీనికి కూకట్‌పల్లి జీహెచ్‌ఎం‌సీ అధికారులు స్టిల్ట్ ‌ప్లస్‌5 అం‌తస్థుల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. అయితే ఇప్పటికే ఐదు అంతస్థులు పూర్తి చేసుకున్న ఈ నిర్మాణంలో 6వ అంతస్తు కూడా నిర్మాణం చేపట్టారు.

వీటి సెంట్రింగ్‌ ‌తొలగిస్తున్న క్రమంలో పక్కకు ఒరిగిన గోడ ఒక్కసారిగా కూలింది. దీంతో గోవ కట్టపై ఉండి పనిచేస్తున్న ఒడిషా రాష్ట్రానికి చెందిన ఐదుగురు కూలీలు అక్కడి నుండి కిందకు పడిపోయారు. ఈఘటనలో సంతోష్‌ ‌సింగ్‌, ‌సోనీ సింగ్‌ అనే ఇద్దరు కార్మికులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా వారిని దగ్గరలోని ప్రతిమ హాస్పిటల్‌కి తరలించారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉందని మరొకరికి స్వల్ప గాయాలైనట్లు హాస్పిటల్‌ ‌వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కూకట్‌పల్లి, మూసాపేట్‌ ‌సర్కిల్‌ల పరిధిలో వందలాది అక్రమ నిర్మాణాలు జరుగుతున్న జంట సర్కిల్లల్లోని అధికారులు అందిన కాడికి దండుకుంటూ అక్రమ నిర్మాణాలు ప్రోత్సహిస్తున్నారు. పలువురు అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేసినప్పటికీ వారి పేర్లు నిర్మాణదారులకు అందజేసి వారి ద్వారా బెదిరింపులకు గురిచేస్తున్నారని పలువురు తెలిపారు. సంఘటన జరిగినప్పుడు హడావుడి చేసే అధికారులు ఆ తర్వాత  షరా మామూలుగానే అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. ఇప్పటికే కూకట్‌పల్లిలోని భవనం కూలీ ఇద్దరు మరణించిన సంఘటన మరచిపోక ముందే హైదర్‌ ‌నగర్‌ ‌డివిజన్‌ ‌పరిధిలో మరొక సంఘటన జరిగి ముగ్గురు మృతి చెందడం అధికారుల పనితీరుకు నిదర్శనమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయా సర్కిల్‌ల పరిధిలో ఎన్నో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నప్పటికీ పలువురు ఫిర్యాదు చేస్తున్న జిహెచ్‌ఎం‌సి టౌన్‌ ‌ప్లానింగ్‌ అధికారులు లక్షలాది రూపాయలు దండుకుంటూ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి దురదృష్టకర సంఘటనలు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుని ఇలాంటి సంఘటనలు పునావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

ప్రభుత్వ విప్‌, ‌శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ దిగ్బ్రాంతి
భవన నిర్మాణంపై నుండి పడి కార్మికులు మృతి చెందిన సంఘటన తెలుసుకుని వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ప్రభుత్వ విప్‌, ‌శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరేకపూడి గాంధీ తీవ్ర దిగ్బ్రాంతి, విచారం చేస్తూ జరిగిన సంఘటన దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణాదారుల కక్కుర్తి, ఆయా సంబంధిత అధికారుల అలసత్వం వల్లనే ఇలాంటి దురదృష్ట సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు. అక్రమ నిర్మాణదారులపై, సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలకు పై అధికారులకు సిఫారసు చేస్తున్నట్లు తెలిపారు. బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం భవన నిర్మాణదారులకు ఎన్నో వెసులుబాట్లు కల్పిస్తూ చర్యలు  తీసుకుంటున్నప్పటికీ బిల్డర్లు అత్యాశతో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టడంతోనే ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు. ప్రమాదంలో మరణించిన గాయపడిన వారికి ప్రభుత్వం తరఫున, బిల్డర్‌ ‌తరఫున సహకారాలు అందజేయిస్తామని ఆయన తెలిపారు.

Leave a Reply