Take a fresh look at your lifestyle.

మావోయిస్టు రహిత తెలంగాణయే లక్ష్యం

  • సిసి కెమేరాల ఏర్పాటుతో ప్రజల్లో పెరిగిన భద్రతా భావం
  • మావోయిస్టు కట్టడిలో ప్రజల సహకారం అభినందనీయం.
  • రాష్ట్ర డిజిపి మహేందర్‌ ‌రెడ్డి.

కొత్తగూడెం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15 : ‌మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణను నిలపడంలో ప్రజల సహకారం అభినందనీయమని డిజిపి మహేందర్‌ ‌రెడ్డి అన్నారు. గురువారం భదాద్రి కొత్తగూడెం జిల్లాలోని హేమచంద్రపురం పోలీస్‌ ‌హెడ్‌ ‌క్వార్టర్స్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిజిపి మాట్లాడుతూ…మావోయిస్టులు లేని రాష్ట్రంగా తెలంగాణాను తీర్చిదిద్దడమే పోలీసుల లక్ష్యం అన్నారు. ఈ చర్యలను భవిషత్‌లోను కొనసాగించేందుకు రాష్ట్ర పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ములుగు, భదాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల పనితీరును కొనియాడారు. జిల్లా పోలీసులు ఉన్నతాధికారుల సహకారాలతో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ మావోయిస్టులు జిల్లాలో అడుగు పెట్టకుండా నిరంతర నిఘా, భద్రతలతో చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రం మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఉండాలనే లక్ష్య సాధనతో రెండు జిల్లాల పోలీస్‌ ‌యంత్రాంగం అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసలు కురిపించారు.

భవిష్యత్తులోను మావోయిస్టుల ద్వారా ఏర్పడే సమస్యలు పునరావృతం కాకుండా పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు చేపడుతున్న వ్యూహాలను, ఫలితాలను సమీక్షించుకుంటూ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుని సిద్దంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. మావోయిస్టులను ఉనికిని కట్టడి చేయడంలో  పోలీసు యంత్రాగానికి ప్రజలు అందిస్తున్న సహకారం మరువలేనిది అన్నారు.  ప్రజలు బాధ్యతయుతంగా వ్యవహరిస్తు పోలీసులకు సహకరిస్తున్న తీరును కొనియాడారు. ముఖ్యంగా మావోయిస్టు కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంలో ములుగు, భదాద్రి కొత్తగూడెం జిల్లాల పోలీసులు సమిష్టిగా చేస్తున్న కృషిని డిజిపి అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం పోలీసు వ్యవస్థకు పెద్దపీట వేస్తూ నేర కట్టడికి అధునాతన సాంకేతికతను అందజేస్తూ పూర్తి సహకారం అందిస్తుందన్నారు.

పారిశ్రామీకీకరణ, అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాలను పెరిగాయని, అందుకు శాంతి భద్రత పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేయడమే ప్రధానా కారణమన్నారు. పోలీసు యంత్రాంగానికి అవసరమ్యే వనరులు సత్వరమే రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుతుందని అన్నారు. 10లక్షల సిసి కెమేరాలు గ్రామగ్రామాన ఏర్పాటు చేశామని..తద్వారా ప్రజల్లో భద్రతా భావం పెరిగిందన్నారు. ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు మావోయిస్టుల విధానాలను నిరాకరిస్తూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలతో జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకంటూ ముందుకు సాగుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. శాంతిభద్రతలు ఎక్కడైతే పటిష్టంగా అమలవుతాయో ఆ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఆ దిశలో తెలంగాణ పయనిస్తుందన్నారు. డిజిపి ముందుగా చత్తీస్‌ఘడ్‌ ‌సరిహద్దు ప్రాంతమైన ఆలుబాక బేస్‌ ‌క్యాంపును సందర్శించి కొత్తగూడెం చేరుకున్నారు. ఈ విలేఖరుల సమావేశంలో భదాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ వినీత్‌ ‌జి, భద్రాచలం ఏఎస్పీ రోహిత్‌ ‌రాజు, ఓఎస్డి సాయి మనోహర్‌, ‌డీఎస్పీ వెంకటేశ్వర బాబు, జిల్లా పోలీస్‌ ‌యంత్రాంగం పాల్గొన్నారు.

Leave a Reply