Take a fresh look at your lifestyle.

అధికారం కోసం అసత్యాలా మోదీ జీ ?

 

ఏం లేనోనికి ఎతులెక్కువ .. అనేది తెలంగాణ జన బాహుళ్యంలో ప్రాచుర్యం పొందిన ఒక నానుడి.  విషయం ఉండని వారే మాటలు ఎక్కువ చెబుతారని దాని భావం. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి సీఎం కేసీఆర్ అనేక మార్లు ఈ సామెతను వాండ్ల ప్రవర్తనను బట్టి ఉచ్చరించిన సందర్భం. లోకసభ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలిచి ఉప ఎన్నికల్లో ఏడవంగా ..తుడవంగా మూడు గెలిచి  నోరుకు ఎంతత్తే అంతా తూలనాడి, రాజ్యాంగ సంస్థలను జేబు సంస్థలుగా వాడుకుంటూ బెదిరింపులకు దిగడం వల్ల ఇప్పటికే మోదీ  మిసిమి మసకబారింది. ఎందుకు అంతా మిడిసిపాటు దక్షిణాదిన మోదీ  ప్రభుత్వానికి చోటులేదని కర్ణాటక ఫలితాలు రుజువు చేసినాయి. దేశంలో అత్యాచారాల వంటి అమానుషాలను కూడా మతం రంగు పులమడం, రాజకీయ కళంకం పులుముకోవడం, కటకటాల పాలుకావడం వంటి ఘటనలు కాషాయ పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి. దానికి ప్రతిఫలం ఊహించనంత వేగంగా క్షిణించింది. దేశ పరిస్థితులు, ప్రజా సమస్యలపై చర్చించకుండా, సీరియస్ గా తీసుకోకుండా ఎనుకటికి నల్ల కాడి  పంచాయితీలా ..మీదికిచూడా తూ కిత్తా అంటే.. మై కిత్తా అంటున్నారు. 2023లో ఏకంగా 40శాతం కమిషన్ బోర్డులు పెట్టుకొని బీజేపీ కార్యకర్తలు ఆత్మహత్యలు చేసుకునేందుకు కారకులైనారు.బీజేపీ ఓటమితో పేద ప్రజలు ప్రయోజనాల పరిరక్షణ వంటి కర్తవ్యాల పరిపూర్తికి కర్ణాటక పునాది రాయి అయ్యింది.రాజకీయ పార్టీల పనితీరుకు ఎన్నికలే గీటురాయి. దక్షిణాదిన పాగా వెయ్యాలని కలలుకన్న బీజేపీ టక్కుటమార ,గజకర్ణ గోకర్ణ విద్యలన్నింటిని ప్రదర్శించినప్పటికీ  కర్ణాటకలో మట్టి కరిపించడంతో  తెలంగాణ ప్రభుత్వంపై అసంబద్ధమైన ఆరోపణలకు దిగింది. ఈ రోజు  బీజేపీకి బతుకునిచ్చిన వరంగల్ గడ్డమీద తొమ్మిదేళ్లలో ఈ ప్రాంతానికి గాని, దేశ యువత కోసం చేసిన ఒక్క మంచి పనైనా ప్రధాని చెప్తే బాగుండేదని మేధావులు అభిప్రాయపడుతున్నారు. .

 

భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తే అందరికి మంచి రోజులు వస్తాయన్న అయన మాటలను  అసంఖ్యాక వోటర్లు విశ్వసించారు. నిత్యం సాంప్రదాయం సంస్కృతి గురించి వల్లించే భారతీయ జనతా పార్టీ ఎందుకో బాణీ మార్చుకున్నట్లు కనిపిస్తుంది.ఈ మధ్య కాషాయ పార్టీ నాయకులు మాట్లాడేతీరులో ,ప్రవరిస్తున్న శైలిలో  మూడు గాండ్రింపులు ఆరు ఆరోపణల వెనుక అధికారకాంక్ష కొట్టొచ్చినట్టు కన్పిస్తుంది.బిజెపికి బీజం వేసిన అజాతశత్రువు అటల్ బిహారీ వాజపేయి , జై శ్రీరామ్ అంటూ తెల్లారితే అయోధ్య రామమందిరం అనే లాల్ కృష్ణ అడ్వాణీ లాంటి మహానుబావుల వారసత్వాన్ని మరిచి కార్పొరేట్ దిగ్గజం ఆదానీ మూల సిద్ధాంతం నమ్ముకొని భారతీయ జనతా పార్టీ మూలపురుషుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ సిద్ధాంతాలకు బిన్నంగా వ్యవహరిస్తున్నట్టు అనుమానం కలుగకమానదు. అధికార ధ్యాసలో పడి ఎవరిని దూషిస్తున్నారో ..ఎవరిని పోషిస్తున్నారో తెలియని పరిస్థితి దాపురించింది.75 ఏండ్ల పాలనలో ప్రజాప్రతినిధులుగా  శాసనసభలో…పార్లమెంట్ లో చర్చలు లేని వల్గారిటీ, ఎదుటి వారిని కించపర్చడం, ఎదుటి వారిని మాట్లాడనివ్వకుండా బుల్డోజ్ చేసే పద్దతికి విశ్వగురువులు అర్హతగా తెగపడ్డారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపర్చిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఇవ్వకుండా . ప్రధాని స్వంత రాష్ట్రం అయిన గుజరాత్ కు  20 వేల కోట్ల రూపాయలు కేటాయించి, కేవలం  520 కోట్లతో  రైల్వే  వ్యాగన్ల (డబ్బాల) ఫ్యాక్టరీ వరంగల్ కి తెచ్చి తెలంగాణ ప్రజలను అవమానపర్చింది. పార్లమెంట్ సాక్షిగా ప్రకటించిన గిరిజన విశ్వవిద్యాలయం కేంద్రం అటకెక్కించింది. దాదాపు 15 వేల మంది స్ధానికులకు ఉద్యోగాలిచ్చే బయ్యారం ఫ్యాక్టరీ గురించి పల్లెత్తు  మాట కూడా ప్రధాని మాట్లాడలేదు. కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ ఇచ్చేవరకు కేంద్రం వైఖరిని ఎండగట్టాలని ప్రజల పక్షాన నిలిచి ప్రధాని వరంగల్ ప్రోగ్రాం బహిష్కరించింది. తెలంగాణ విభజన చట్టంలోని కోచ్ ఫ్యాక్టరీ,బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన విశ్వవిద్యాలయం పై నలుగురు ఎంపీలు ఉన్న కాంగ్రెస్ పల్లెత్తు మాట్లాడక పోవడం గమనార్హం. బీఆర్ఎస్ ను ఓడించేందుకు  దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కల్సి పనిచేశాయనే విమర్శ వుంది.

 

తెలంగాణలో కాంగ్రెస్ రోజు, రోజుకు డీలా పడిన క్రమంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అడ్రస్ లేని బీజేపీ ప్రత్యామ్నాయమని విర్రవీగింది.నిజంగానే కాంగ్రెస్ కుమ్ములాటలు బీజేపీ పుంజుకోవడానికి కలిసి వచ్చింది. ఏ పార్టీకి లేని కొత్త పోర్ట్ పోలియో ఈటల  రాజేందర్ ను బీజేపీ చేరికల కమిటీకి  చైర్మన్ చేస్తే ఆదరణ లేక గత కొంత కాలం నుండి ఎవరు చేరకపోయేసరికి  ఆడరాక పందిరి కురుస అనే సామెత లెక్క ఉంది. ప్రచార కమిటీ భాద్యతలు ఇచ్చినాక కాంగ్రెస్ పెరగడానికి కేసీఆర్ కారణం అంటూ నిందించడం ప్రచారం మొదలు పెట్టింది. సీఎం కేసీఆర్ పాల్గొంటున్న సభలలో బీజేపీ టార్గెట్ చేయకపోతే తెగబాధ పడిపోతున్నారు.ఏమైనా అనడానికి విషయం ఉంటేకదా? అనేది మొత్తం విశ్వగురువుల దగ్గర ఉన్నది విషం కదా?  ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు తన అసమర్థతను ఇతరులకు ఆపాదించే పనిగా బీజేపీ, కాంగ్రెస్ కలిసి మైండ్ గేమ్ ఆడుతున్నది. ప్రధాని మోదీ  తొమ్మిదేండ్లలో తెలంగాణకు చేసింది ఏమిలేదు, పైగా విషం చిమ్ముతున్నది. స్వామి వివేకానంద చెప్పినట్లు నిరంతరం వెలిగే సూర్యున్ని చూసి చీకటి భయపడుతుందన్నట్లు.. కేసీఆర్ ‘అబ్ కి బార్ కిసాన్ సర్కార్’ పేరుతో జాతీయ రాజకీయాల్లో జెట్ స్పీడ్ తో దూసుకపోతున్నాడనే కుట్రతో నిందించే పనిలో పడ్డది.  తొమ్మిదేండ్లుగా బీజేపీని నిలదీసి, ప్రత్యర్థిగా బరిగీసి కొట్లాటకు దిగిన కేసీఆర్ దేశంలో రైతురాజ్యం నిర్మించేందుకు సంస్థాగత పునాదులు నిర్మించడానికి ‘మహా’ విస్తరణతో  బీజేపీ ఖంగుతిన్నది. సహజంగానే బీఆర్ఎస్ పార్టీ విశ్వసనీయత, విధాన మార్పులతో పాటు ఉద్యమ పార్టీకి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో…ఎవరిని ఆదరించాలో ఎవరిని చీదరించాలో స్పష్టమైన వైఖరితోనే అడుగులు వేస్తుంది. జాతీయ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ గురించి మాట్లాడని ప్రధానమంత్రి మోడీ మొన్న భోపాల్, నేడు వరంగల్ వేదికగా కుటుంబ పాలన గురించి, అవినీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంది.ఇక్కడ ఎవ్వరు నేరుగా పదవుల్లోకి రాలేదు. ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి ఎండకు,వానకు ఓర్చి వచ్చినవారే ఉన్నారు.కానీ బీజేపీలో అధికారం అనుభవిస్తున్న పంకజ్ సింగ్,స్వరాజ్ కౌశిల్, అనురాగ్ ఠాకూర్ ధర్మేంద్ర ప్రధాన్ లాంటి నాయకులు వారసులు కాదా? అనాధ బిడ్డలా? ఎవ్వరి బిడ్డలనే  విషయం  ప్రధానమంత్రి మోడీకి తెలియదా? తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కుటుంబం అనేది నిర్వివాదాంశం.

 

-డా.సంగని మల్లేశ్వర్,

విభాగాధిపతి, జర్నలిజం శాఖ,

కాకతీయ విశ్వవిద్యాయం, వరంగల్.

సెల్-9866255355.

Leave a Reply