- 100 మంది సంపన్నుల చేతిలో 57.3 లక్షల కోట్లు
- 50 శాతం జనాభా వాటా కేవలం 6 శాతం
- కటిక పేదరికంలోకి 84 శాతం కుటుంబాలు
- 2020లో కొత్తగా అత్యంత పేదరికంలోకి 4.6 కోట్ల కుటుంబాలు
- 102 నుండి 142కు చేరిన బిలియనీర్లు
- 8 రెట్లు పెరిగిన అదాలనీల.. రెండున్నర రెట్లు పెరిగిన అంబానీల సంపద
- అధ్వాన్నంగా ఆదాయ అసమానత ఆక్స్‌ఫామ్ గ్లోబల్ నివేదిక వెల్లడి
ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, న్యూ దిల్లీ, జనవరి19 : చైనా అమెరికాల తర్వాత అత్యధిక బిలియనీర్లు కలిగిన దేశం భారత్. ఫ్రాన్స్, స్వీడన్, స్విట్జర్లాండ్ల కంటే ఎక్కువ మంది బిలియనీర్లు భారత్‌లో ఉన్నారు. మరోవైపు భారత్‌లో 84 శాతం కుటుంబాలు కటిక పేదరికంలోకి జారుకున్నాయని ఆక్స్‌ఫామ్ నివేదిక ద్వారా తెలుస్తున్నది. 2021లో భారతీయ బిలియనీర్ల సంఖ్య 102 నుండి 142కి చేరుకుంది. అలాగే దేశంలోని 84 శాతం కుటుంబాల ఆదాయం క్షీణించి అధ్వాన్న పరిస్థితికి చేరుకున్నాయి. అధ్వాన్నమైన ఆదాయ అసమానత భారత్‌లో ఉందంటూ ఆక్స్‌ఫామ్ నివేదిక భయంకరమైన నిజాలను బయటపెట్టింది.
2021లో భారతదేశంలోని 100 మంది సంపన్నుల సామూహిక సంపద రికార్డు స్థాయిలో 57.3 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుందని ఆక్స్‌ఫామ్ గ్లోబల్ రిపోర్టు పేర్కొంది. ఇదే ఏడాది జాతీయ సంపదలో 50 శాతం పేద జనాభా వాటా కేవలం 6 శాతం మాత్రమే వుందని కూడా వెల్లడించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ దావోస్ సమావేశానికి ముందు ఆదివారం నాడు విడుదల చేసిన ఆక్స్‌ఫామ్ నివేదికలో భారత్‌ను ‘‘అసమానత చంపివేస్తున్నది’’… ‘‘అసమానత వలన భారతదేశం నాశనం అవుతున్నది’’ అని ఆక్స్‌ఫామ్ నివేదిక తెలిపింది. దేశ ఆరోగ్య సంరక్షణ బడ్జెట్ 2020 సవరించిన అంచనాలు 10 శాతానికి పడిపోయాయని, విద్యా కేటాయింపులలో 6 శాతం తగ్గిందని నివేదిక తెలిపింది. సామాజిక భద్రతా పథకాలకు దేశ వార్షిక బడ్జెట్ కేటాయింపు 1.5 శాతం నుండి 0.6 శాతానికి పడిపోయిందని నివేదిక తెలిపింది.
మహమ్మారి విజృభించిన కాలంలో అంటే మార్చి 2020 నుండి నవంబర్ 30, 2021 మధ్య కాలంలో భారతీయ బిలియనీర్ల సంపద 23.14 లక్షల కోట్ల రూపాయల నుండి 53.16 లక్షల కోట్లకు రూపాయలకి పెరిగిందని ఆక్స్‌ఫామ్ నివేదిక స్పష్టం చేసింది. 2020లో 4.6 కోట్లకు పైగా భారతీయులు అత్యంత పేదరికంలోకి నెట్టివేయబడ్డారని నివేదిక తెలిపింది. ఐక్యరాజ్యసమితి ప్రకారం ప్రపంచ కొత్త పేదలలో దాదాపు సగం మంది భారత్‌లో ఉన్నారు. 2021లో బిలియనీర్ల సంఖ్యలో, భారత్ 39 శాతం పెరుగుదలను చూసింది. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో బిలియనీర్లను కలిగి ఉన్న దేశాలలో భారతదేశం మూడవ స్థానంలో ఉంది. చైనా, అమెరికాల తర్వాత స్థానంలో భారత్ వుంది. అంటే భారత్‌లో ఫ్రాన్స్, స్వీడన్, స్విట్జర్లాండ్ల కంటే ఎక్కువ మంది బిలియనీర్లు ఉన్నారు. ప్రధాని మోడీకి ఆప్త మిత్రుడు అయిన గౌతమ్ అదానీ ప్రపంచవ్యాప్తంగా వున్న అత్యధిక ధనవంతుల జాబితాలో 24వ స్థానంలో వున్నారు.
భారత్‌లో ఇతని సంతానం ముకేశ్ అంబానీ తర్వాత అంటే రెండవ స్థానంలో వుంది. అదానీ ఆస్తి నికర విలువ ఒక ఏడాది వ్యవధిలో ఎనిమిది రెట్లు పెరిగింది. ఫోర్బస్ రియల్ టైమ్ డేటా ప్రకారం, 2020లో అదానీ సంపద 8.9 బిలియన్ల డాలర్లు ఉండగా 2021లో 50.5 బిలియన్ల డాలర్లకు చేరుకుంది. అంతేకాదు 2021 నవంబర్ 24 నాటికి, అదానీ నికర ఆస్తి విలువ 82.2 బిలియన్ డాలర్లుగా నమోదు అయింది. ఎనిమిది నెలల వ్యవధిలో ఇంత విపరీతమైన వ్యక్తిగత ఆస్తి వృద్ధిని అదానీ చవిచూశారు. భారతదేశం మొత్తం ఘోరమైన కొరోనా రెండవ వేవ్ బారినపడి విలవిలలాడుతున్న సమయంలో ఆస్ట్రేలియాలో అదానీ పెట్టుబడులు పెట్టి కొత్తగా కొనుగోలు చేసిన కార్మైకేల్ గనుల నుండి చాలా లాభాలను ఆర్జించారు. ముంబై విమానాశ్రయంలో 74 శాతం వాటాను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసారు. ఇదే సమయంలో, ముఖేష్ అంబానీ నికర ఆస్తి విలువ 2020లో 36.8 బిలియన్ డాలర్ల నుండి 2021లో 85.5 బిలియన్ డాలర్లకు అంటే రెండింతలకి పెరిగిందని ఆక్స్‌ఫామ్ నివేదిక తెలిపింది.
ఆక్స్‌ఫామ్ ఇండియా సిఈఓ అమితాబ్ బెహర్ మాట్లాడుతూ.. ‘‘ప్రతిరోజు భారతదేశంలో కనీసం 21,000 మంది లేదా ప్రతి నాలుగు సెకన్లకు ఒక వ్యక్తి మరణిస్తున్నారు. దీనికి కారణం ఆర్థిక అసమానత. ప్రస్తుత నివేదిక భారత్‌లో వున్న వాస్తవికతకు అద్దం పడుతున్నది’’. అన్నారు. ప్రస్తుత ఈ ఆర్థిక అసమానత స్త్రీలను అధోగతి పాలు చేస్తున్నది. స్త్రీ..పురుష శ్రామికుల మధ్య అసమానత్వాన్ని తీవ్రంగా పెంచింది. గత 99 సంవత్సరాలలో నెలకొన్న స్త్రీ పురుష శ్రామికుల మధ్య అసమానత ఇప్పుడు 135 సంవత్సరాలలో కనిపించే అంత అసమానత స్థాయికి పెరిగింది. 2020లో మహిళలు ఏకంగా 59.11 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయారు.
గత ఏడాది పెట్టుబడులను ఆకర్షించేందుకు కార్పొరేట్ పన్నులను మోడీ ప్రభుత్వం 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించింది. దీని వలన సర్కారీ ఖజానాకు 1.5 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆక్స్‌ఫామ్ నివేదిక తెలిపింది. దీని వలన భారత్ ఆర్థిక వ్యవస్థ లోటుకు గురైందని నివేదిక పేర్కొంది. దీని వలన భారత్‌లో పేదలు పెరిగినట్లు తెలిపింది. అట్టడుగున ఉన్న పేదలు, మధ్యతరగతి ప్రజలు మహమ్మారిని ఎదుర్కున్నప్పటికీ అధిక పన్నులు చెల్లించారని, అదే సమయంలో ధనవంతులు మాత్రం తమ వాటాగా చెల్లించాల్సిన పన్నులు చెల్లించకుండా ఎక్కువ డబ్బు సంపాదించారని ఆక్స్‌ఫామ్ నివేదిక తెలిపింది.