Take a fresh look at your lifestyle.

కన్నుల పండువగా స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు

  • ముఖ్య అతిధిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సిఎం కెసిఆర్‌
  • ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 1 : ‌స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుక కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో కన్నుల పండువగా జరిగింది. అత్యంత శోభాయమానంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు దేశ ఔన్నత్యాన్ని చాటుతూ తెలంగాణ ప్రగతికి అద్దం పట్టాయి. హెచ్‌ ఐసీసీ వేదికగా నిర్వహించిన ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ ‌రావు  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌జాతీయ పతాకాన్ని  ఆవిష్కరించి, వందనం సమర్పించి, జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం వేదిక ముందు ఏర్పాటు చేసిన గాంధీ మహాత్ముడి విగ్రహానికి, భరత మాత చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులో భాగంగా ముందుగా..రాష్ట్ర సమాచార శాఖ, వారోత్సవాల ముగింపు సందర్భంగా రూపొందించిన షార్ట్ ‌ఫిల్మ్‌ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు వీక్షించారు. అనంతరం.. రాఘవాచారి బ్రదర్స్ ‌నిర్వహించిన ‘రఘుపతి రాఘవ రాజారాం’ అనే గానంతో సంగీత విభావరి ప్రారంభమైంది. ‘ఇదిగో భదాద్రి..అదిగో చూడండి’ అంటూ ఆలాపనతో పాటు, ‘ఎందరో మహానుభావులూ..అందరీకీ వందనాలూ’ అంటూ సాగిన త్యాగరాజ కీర్తన సభికులను ఆకట్టుకుంది. సంగీత నాటక అకాడమి ఆధ్వర్యంలో రూపొందిన  ‘భారతీయ భావన’ అన్న నాట్య రూపకం వీక్షకులను కట్టిపడేసింది. ఇందులో కూచిపూడి, భరత నాట్యం, పేరిణి, మోహినీ అట్టం, ఒడిస్సితో పాటు ఆరు రకాల భారతీయ నృత్యరీతులతో కూడిన ఏక ప్రదర్శన ఇచ్చారు.

ఆయాచితం నటేశ్వర శర్మ రాసిన ‘తెలంగాణ అవతరణం తెలంగాణ అవతరణం..తొలిపొద్దు నవకిరణం..భరత మాత ఆభరణం’ అంటూ సాగిన  నృత్య ప్రదర్శన..కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు దళితబంధు, రైతుబంధు వంటి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఒకొక్క ప్రభుత్వ కార్యక్రమాన్ని వర్ణిస్తూ సాగింది. ఈ నృత్య రూపకం సిఎం కేసీఆర్‌ ‌దార్శనికతను, రాష్ట్ర ప్రగతిని ప్రతిబింబించింది. సకల జనులకు అందుతున్న ప్రగతి ఫలాల ఔన్నత్యాన్ని ఆవిష్కరించింది…భావోద్వేగానికి గురిచేసింది. అనంతరం ‘సింఫనీ ఆఫ్‌ ‌ఫ్రీడం’ పేరిట సాగిన పలు వాయిద్యాలతో సాగిన జూగల్బందీ ఆద్యంతం ఆకట్టుకుంది. తబలా, ఫ్లూటు, ఘటం గిటారా, డప్పు తదితర వాయిద్యాలతో కొనసాగిన సంగీతం ప్రేక్షకులను కట్టిపడేసింది. అనంతరం మంజుల రామస్వామి బృందంచే ప్రదర్శించిన ‘వజ్రోత్సవ హారతి’ నృత్య ప్రదర్శన వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనలో కళాకారుల నృత్య భంగిమలు చూపరులను కట్టిపడేశాయి. ప్రేక్షకులు ఈ నృత్య ప్రదర్శనను కళ్లార్పకుండా వీక్షించారు. జయహో అంటూ సాగిన మరో నృత్యం దేశభక్తిని రగిలించింది. దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పింది.

Leave a Reply