Take a fresh look at your lifestyle.

మీ దారి సనాతనమా? సమతా మార్గమా?

‘‘సనాతన ధర్మం కొనసాగించి అందులో పిల్ల కాల్వ అయిన కులాన్ని కొనసాగించి కులాంతర వివాహం చేసుకున్నందుకు బలైన ప్రణయ్‌ లాంటి బిడ్డల్ని ఇంకా ఎంతమందిని బలిపీఠం ఎక్కిద్దాం? మనం పైపైన ఎన్ని మాటలు చెప్పినా, సంస్కరణ ముసుగుతో తిరిగినా భారతీయ సమాజం నుంచి కులాన్ని విడదీసి చూడగలమా?  అందుకే సనాతన ధర్మాన్ని అంతం చేయాలంటే అందులో ఉన్న కులాన్ని, వివిధ ఆచారాల్ని అంతం చేయాలని అంబేద్కర్‌  సూచించారు.’’

తమిళనాడు రాష్ట్ర క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ ఇటీవల చెన్నైలో నిర్వ హించిన తమిళ ప్రగతిశీల రచయితల సభలో ప్రసం గిస్తూ ‘‘సనాతన ధర్మం ఒక మలేరియా, డెంగ్యూ, కొరోనా లాంటిది’’  దాన్ని నిర్ములించాల్సిన అవసరం ఉందంటూ వ్యాఖ్యనించారు.ఇక తర్వాత ఏం జరిగి ఉంటుందో, మన సమాజంలో కొందరు ఎలా స్పందించి ఉంటారో,అలాగే గత తొమ్మిదేళ్లుగా ఇలాంటి విషయాల్లో తమ ఆలోచనల్ని వ్యక్త పరిచిన వ్యక్తుల మీద ఎంతటి భయంకరమైన దాడి జరుగుతుందో మనందరికీ తెలిసిన విషయమే. ఆ భీకర  దాడికి ఉదయనిధి ఏమీ మినహాయింపు కాదు. ఇంతటి దాడికి జవాబుగా తాను చేసిన వ్యాఖ్యలపై పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నానని, అలాగే కులం సమస్య మీద అంబెడ్కర్‌, పెరియార్‌ వంటి మహనీయులు చేసిన విస్తృతమైన అధ్యాయనాలపై ఏ బహిరంగ వేదిక మీద అయినా తాను చర్చకు సిద్దమని ఉదయనిధి సవాల్‌ విసిరారు. దేవుడు వట్టి రాయి అంటూ చెప్పిన పెరియార్‌ మాటకు, దైవ చింతన మానసిక బానిసత్వమని చెప్పిన గోరా సవాలుకు, దేవుడన్నది హిమాలయమంత పెద్ద అబద్ధమన్న కరుణానిధి ప్రశ్నకు సమాధానాలు ఇంతవరకూ ఏ పండితుడు ఇవ్వలేదు, ఇక మునుముందు ఇస్తారన్న నమ్మకమూ నాకు లేదు.

ఎన్నో అసమానతల దొంతర అయిన సనాతన ధర్మం పూర్తి నిర్మూలనే సమ సమాజ నిర్మాణానికి, సామాజిక న్యాయానికి నాందీ అన్నది ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం కావచ్చు. స్టాలిన్‌ ఏమన్నారు, ఎందుకన్నారు అనే అంశాల్ని కాస్త పక్కన పెడితే ఈ రోజు ధర్మం అని పిలువబడుతున్న సనాతనంలో ఉన్న అసమానతల్ని ఎత్తి చూపుతూ లోతైన అధ్యయనం చేసిన అంబేడ్కర్‌  తన ‘‘కుల నిర్మూలన’’ ఏమన్నారో చూద్దాం. హిందూ మతంలో సంస్కరణల కోసం లాహోర్‌ నగరంలో జాట్‌-పాట్‌-తోడక్‌ మండల్‌ తల పెట్టిన సభకి ఉద్దేశించి కుల నిర్మూలన అంశం మీద అంబేడ్కర్‌  కొన్ని మౌలిక అంశాలు ఆ పుస్తకంలో ప్రస్థావించారు. సహాపంక్తి భోజనాల వల్ల హిందూ సమాజంలో మార్పు రాదని కులాంతర వివాహలే ఈ కుల రక్కసిని అంతం చేసే ఆయుధాలని అంబేడ్కర్‌  చెప్పడం జరిగింది.ఇదే సనాతన ధర్మం కొనసాగించి అందులో పిల్ల కాల్వ అయిన కులాన్ని కొనసాగించి కులాంతర వివాహం చేసుకున్నందుకు బలైన ప్రణయ్‌ లాంటి బిడ్డల్ని ఇంకా ఎంతమందిని బలిపీఠం ఎక్కిద్దాం? మనం పైపైన ఎన్ని మాటలు చెప్పినా, సంస్కరణ ముసుగుతో తిరిగినా భారతీయ సమాజం నుంచి కులాన్ని విడదీసి చూడగలమా?  అందుకే సనాతన ధర్మాన్ని అంతం చేయాలంటే అందులో ఉన్న కులాన్ని, వివిధ ఆచారాల్ని అంతం చేయాలని అంబేడ్కర్‌  సూచించారు.

మతం మరియు ఆ మతంలో భాగమైన విశ్వాసాలు ఎంత ప్రభావవంతమైనవి అంటే నాడు లాహోరులో జరగాల్సిన అంబేడ్కర్‌  ప్రసంగానికి అడ్డు పుల్లలు వేయగలిగినంత గొప్పవి.  పేరుకు సంస్కరణ వాదాన్ని నాటి మండలి మోసినా మెజారిటీ రాజకీయ హిందువుల మనోభావాలు దెబ్బతిని తమకు నష్టం జరుగుతుందని భయపడి అంబేడ్కర్‌  ప్రసంగంలో ‘‘కుల నిర్మూలన’’ అనే పదాన్ని తొలగించమని ఆయనపై వారు ఒత్తిడి చేయడం జరిగింది.కానీ సభకు అధ్యక్ష్యత వహించడం నా ప్రాధాన్యత కాదని సనాతన ధర్మం పేరుతో జరుగుతున్న అన్యాయాల్ని అమాయక ప్రజలకి తెలియజేయడమే తన లక్ష్యమని సొంత ఖర్చులతో ఆ పుస్తకాన్ని అచ్చు వేయించారు. నాటి అంబేడ్కర్‌  రాజీ లేని వ్యక్తిత్వమే నేటి కుల రక్కసి వ్యతిరేక పోరాటాలకు నిజమైన స్ఫూర్తి.తాను మతం మారుతున్న అంశం, కుల నిర్మూలన అంశంపై తన అధ్యయనం వంటి విషయాల మీద మండలికి అభ్యంతరాలు ఉంటే ప్రసంగం తర్వాత తీర్మానం చేయొచ్చు అని సూచించిన అంబేడ్కర్‌  ఆలోచనల్ని చూస్తే ఆయనకు సామాజిక న్యాయం పట్ల ఎంతటి నిబద్దత ఉందో అర్ధం చేసుకోవచ్చు.

మనుషులు వేసుకునే బట్టల మీద, మాట్లాడే భాష మీద, తినే ఆహారం మీద నేడు ఎంతటి అసహనంతో కూడిన దాడి  జరుగుతుంది అనేది మనకి తెలియనిది కాదు. మన సమాజంలో కొన్ని వర్గాలు తమ తమ జీవితాల్ని ప్రత్యక్ష్యంగా ప్రభావితం చేసే మహిళల స్వేచ్ఛ వంటి అంశాలు తప్పించి పేదలు, వెనుకబడ్డ వర్గాల సమస్యలైన అంటరానితనం,కులవివక్ష మరియు సఫాయి కార్మికుల వంటి సమస్యల మీద వారికి పట్టింపు లేదు.ఏ సమాజంలో అయినా సామాజిక న్యాయం ఎలా వస్తుంది అంటే ఆ సమాజంలో సమానత్వం ఉన్నప్పుడు, అన్ని వర్గాల ప్రజలకు అవకాశాలు సమానంగా అందినప్పుడు.మరి అందరికి సమాజంలో సరైన అవకాశాలు ఉన్నాయా అన్నదే అతిపెద్ద ప్రశ్న. సమాన అవకాశాలు లేని ఏ సమాజాన్ని అయినా ఆ సమాజంలో జనులు ఎందుకు భరించాలి? సామాజిక చైతన్యం లేని వ్యవస్థ ఒక జీవచ్చవం లాంటిది కాదా? మెజారిటీ విశ్వాసాల మనుషులు మైనారిటీ మహిళల్ని మానభంగం చేస్తే సహించేదేనా సనాతనం? ఇతర విశ్వసాలు అనుసరించే ప్రజల ఇళ్లను బుల్‌ డోజర్లతో కూల్చమని చెప్పిందా సనాతనం? ప్రశ్నించే ప్రగతిశీల శక్తుల్ని వేటాడమని చెప్పిందా సనాతనం? ప్రశ్నించే హేతువాద భావాన్ని ఎన్నటికీ ఒప్పుకోని సనాతనం ఓ జడత్వ భావన. కదలిక లేని సనాతన ఊబిలో ఉంటావో స్వేచ్చా జీవిగా విశాల ప్రపంచంలో విహారిస్తారో  మీ  ఇష్టం.
image.png
పిల్లుట్ల నాగఫణి

Leave a Reply