Take a fresh look at your lifestyle.

ఉన్నతంగా ఆలోచించండి.. లక్ష్యాలను సాధించండి.

విద్యార్థులు ఆత్మస్థయిర్యంతో స్ఫూర్తిగా నిలవాలి

విద్యార్థులు ఏటా పరీక్షలు ఎదుర్కోవడం సహజం. ఈ క్రమంలో కొందరు ఒత్తిడికి గురవుతుంటారు. మంచి మార్కులు సాధించగలనా? ఎలాంటి ప్రశ్నలు వస్తాయో? సరైన సమాధానాలు రాయగలనా? ఆశించిన మార్కులు రాకపోయినట్లయితే పరిస్థితి ఏమిటీ? ఇలాంటి ప్రశ్నలు మెదళ్లలో కదలాడుతుంటాయి.  ప్రణాళిక ప్రకారం చదవడంతో పాటుగా చిన్నచిన్న చిట్కాలను పాటిస్తే ఆత్మవిశ్వాసంతో ప్రపంచాన్ని జయించవచ్చని ప్రముఖ కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌ డాక్టర్‌ అట్ల శ్రీనివాస్‌ రెడ్డి సూచించారు. ఒత్తిడికి కారణం…భయం, ఆందోళన, ఉద్రిక్తత(ఫ్యాట్‌ : ఫియర్‌, యాంక్సైటీ, టెన్షన్‌).
భయం : పరీక్షలు సమీపిస్తున్నది కొద్ది విద్యార్థులలో భయం ఏర్పడుతుంది. ఆశించిన మార్కులు సాధిస్తానా…..కుటుంబ సభ్యులు, బంధువులు, ఉపాధ్యాయులు ఏమంటారోననే భయం కలుగుతుంది. ముందుగా భయాన్ని వీడాలి.
ఆందోళన : నేను చదివిన పాఠ్యాంశాలలోని ప్రశ్నలు వస్తాయో లేదో…. వచ్చినా వాటికి సరైన సమాధానాలు పూర్తి స్తాయిలో రాయగలనో లేదో …. నేను చదవని పాఠాల్లోనివి వస్తే ఏం చేయాలి? తదితరాలతో విద్యార్థులు ఆందోళన చెందుతుంటారు. ఏకాగ్రత తగ్గుతుంది. ఏది వచ్చినా రాయగలమనే ధీమా నమ్మకంతో ఉంటే ఆందోళనను దూరం చేసుకోవచ్చు.
ఉద్రిక్తత : పరీక్షల్లో ఎన్ని మార్కులు తెచ్చుకొనే స్థాయి ఉందో నా గురించి నాకు తెలుసు కానీ ఎక్కువ శాతం మార్కులు తెచ్చుకోవాలనే తపన. ఈ రెండిరటి మధ్య జరిగే సంఘర్షణ వల్లే ఉద్రిక్తత పుడుతుంది. దీని నుంచి బయట పడాలంటే విద్యార్థులు తమ సామర్థ్యంపై సొంత నిర్ణయంపై లక్ష్యాన్ని నిర్ధారించుకోవాలి.

స్పూర్తిగా తీసుకోవాలి, స్ఫూర్తిగా నిలవాలి…విజేతలను ప్రేరణగా తీసుకోవాలి…
120 కోట్ల పై చిలుకు గల జనాభాలో…..కొందరు మాత్రమే సింధూ, సాక్షి మాలిక్‌, పూర్ణ, నర్సమ్మలు…దేశ ప్రతిష్టను నిలబెట్టారు. లక్ష్యాన్ని సాధించే క్రమంలో వారు పడిన శ్రమ మనకు శిరోధార్యం కావాలి. సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు లక్ష్య సాధనలో అడ్డంకిగా మారినప్పటికి లక్ష్యాన్ని సులభంగా సాధించిన వారు ఎందరో ఉన్నారు. ఒక దేశంలోని పక్షులు తమ ప్రాంతంలో మనుగడ సాధించలేని వాతావరణ పరిస్థితులు ఉంటే అవి త్రాగడానికి నీటి కోసం కొన్ని వేల కిలోమీటర్లు పయణించి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. జీవితాన్ని కొనసాగించడంపై వాటికే అంత తెలివి తేటలు ఉంటే ప్రపంచాన్ని శాసించే స్థాయి గల అధిక మేధస్సు ఉన్న మనుసులు మాత్రము నిరాశ నిస్పృహలకు లోనవుతూ తమ జీవితాన్ని భూమికి భారంగా  వెల్లదీసె వారెందరో ఉన్నారు. జీవన పోరాటంలో విజయాలు, వైఫల్యాలు సహాజం. వైఫల్యాల నుండి కూడా నేర్చుకుని లక్ష్యాన్ని సాధించిన థామస్‌ అల్వా ఎడిసన్‌ ఆదర్శం.ఉన్నతంగా ఆలోచించండి ఉన్నత లక్ష్యాలను చేరువగా చేసుకోవాలి. ప్రేరణ చేసుకునే పద్దతులలో ప్రముఖ మైన పద్దతిని ప్రొ. ఒట్టెంజెన్స్‌ తెలిపారు. అదే..ఊప్‌ పద్దతి.

విష్‌…కావాలని కోరుకోవడం(లక్ష్యం) : మనం ఏదైతే కావాలని మన మనసులో బలమైన కోరిక కలిగి ఉంటామో దానిపై స్పష్టతను ఏర్పరుచుకోవాలి. రోజుకొకసారి మన: ఫలకం పై గుర్తుకు తెచ్చుకోవాలి.
ఔట్‌కమ్‌..(ఫలితం) : మన మనసులో ముద్రితమై ఉన్న లక్ష్యం సాధిస్తే రాబోయే ఫలితాన్ని విజువలైజ్‌ చేసుకోవడం, దాని ఫలితాన్ని నెమరు వేసుకోవాలి.
అబ్‌స్టకిల్స్‌(అడ్డంకులు) : లక్ష్య సాధన ప్రయత్నంలో రాబోయే అడ్డంకులను ముందుగానే పసిగట్టడం, అంచనా వేయడం వాటిని ఎదుర్కోవడానికి సిద్దం కావాలి.
ప్లాన్‌ (ప్రణాళిక) : మన బలాలు, బలహీనతలను దృష్టిలో పెట్టుకొని మనం ఏం కావాలో, ఏ విధంగా చేరుకోవాలో , ఎంత సమయం పడుతుందో ముందస్తు ప్రణాళిక తయారు చేసుకోవాలి.

పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయనో, అనుత్తీర్ణులయ్యామనో బాధ పడొద్దు. మార్కులు ర్యాంకులే ప్రధానం కాదు. ప్రపంచంలో లక్ష్యాలేన్నో ఉన్నాయి అందులో  మనమూ ఒకటి సాధిద్దాం. ఒక సమిధలా వెలుగుదాం. ప్రపంచానికి ఒక వెలుగును ప్రసాదిద్దాం. గెలుపునకు తుదిమెట్టు అంటూ ఏది ఉండదు, ఓటమి అన్నది ఎప్పుడు అపాయకారి కాదు. మనకు ఈ రెంటిని సాధించాల్సిన దానికి కావాల్సింది మనో దైర్ఘ్యం, ఆత్మ విశ్వాసం, పట్టుదల.
స్టీఫెన్‌ హాకింగ్‌ : స్టీఫెన్‌ హాకింగ్‌ తన 17 వ సంవత్సరంలో ఆక్ష్‌ ఫర్డ్‌ యూనివర్శిటీలో చదువుచున్న సమయంలో మోటార్‌ న్యూరాన్‌ వ్యాధి రావడంతో 3 సంవత్సరాలలో తన అవయవాలన్ని ఒక్కక్కటిగా పనిచేయడం ఆగి పోయి మరణిస్తాడని డాక్టర్‌ లు దృవీకరించారు.76 సంవత్సరాలు పూర్తిచేసుకొని ఆత్మవిశ్వాసంతో ప్రపంచానికి బ్లాక్‌ హోల్‌ లాంటి ఎన్నో పరిశోధనలు అందించిన  వ్యక్తి. ఇటీవల మార్చి 14, 2018 లో మరణించిన మహానీయుడు.
అరుణిమా సిన్హా : అరుణిమా సిన్హా  రైలు ప్రమాదంలో పూర్తిగా చిద్రమైనా శరీరం, ఒంటి కాలు తో కేవలం రెండు సంవత్సరాలలోపు ఆత్మ విశ్వాసంతో, పట్టుదలతో, క్రమశిక్షణతో సాధన చేసి ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన  భారత మహిళ.

లక్ష్యనిర్దారణలో శాస్త్రీయ పద్దతి..స్మార్ట్‌-ఎఫ్‌
ఎస్‌-స్పెసిఫిక్‌ (స్పష్టత) : మనం నిర్దారించుకున్న లక్ష్యం స్పష్తతను కలిగి ఉండాలి. దీని కోసం నా శక్తి సామర్ద్యాలను , నాకున్న సమయంలో కొనసాగిస్తాను అని నిర్ణయం తీసుకోవాలి.ఎం-మోటివేషన్‌ (ప్రేరణ) : లక్ష్యం నిరంతరణ ప్రేరణ నివ్వాలి. లక్ష్యం సిద్దిస్తే వచ్చే లాభాలు, ఆనందంను గిర్తించాలి. అప్పుడు లక్ష్యసాధనలో దూసుకు పోగలుగుతాం.ఎ-అచీవబుల్‌(సాధించగల) : మానసిక శాస్త్రం ప్రకారం ఎవరైనా ఒక పనిని సాధిస్తే ఆ పనిని అందరూ సాధించగలిగే శక్తిని ఈ ప్రకృతి మనిషికి ప్రసాధించింది. కాబట్టి లక్ష్యాన్ని సాధించగలిగే శక్తి నీకున్నదనే సత్యాన్ని గ్రహించడం అయితే సాధించే క్రమంలో అంశాలను నేర్చుకొనే పద్దతుల్లో ప్రతి మనిషికి మధ్య తేడాలు ఉంటాయి. కొందరు తొందరగా సాధిస్తారు కొందరికి ఎక్కువ సమయం తీసుకోవచ్చు.ఆర్‌-రియలిస్టిక్‌ (వాస్తవికం) : తమ శక్తి, సామర్ధ్యాలు, ఉపయోగించే పద్దతులు, సమయాన్ని దృష్టిలో ఉంచుకొని వాస్తవికతతో రోజు వారీ సాధనను కొనసాగించాలి.టి-టైమ్‌ బౌండ్‌(సమయం ప్రకారం) : ఏ లక్ష్యానికైనా సమయం ఎంత తీసుకుంటుందో  నిర్ణయించుకోవాలి. శాశ్వత లక్ష్య సాధనకు సమయానికి అనుగుణంగా తాత్కాళిక లక్ష్యాలను నిర్డారించుకుని ఇంత సమయంలో పూర్తి చేస్తాను అని నిబంధన పెట్టుకొని పని చేయడం వల్ల ఎలాగైనా పూర్తి చేయాలనే తలంపు రెట్టింపు అవుతుంది.

ఎఫ్‌-ఫ్లెక్సిబుల్‌ (మార్చుకోవడానికి వీలుగా) : తాత్కాలిక లక్ష్యాలను చేరుకునే వేగాన్ని బట్టి, ఆరోగ్య పరిస్థితులను బట్టి టార్గెట్స్‌ ను పెంచుకోవడం, తగ్గించుకోవడం చేసుకోవాలి. మన చుట్టూ ఉన్న అడ్డంకులను బేరీజు వేసుకుంటూ వాటికి లొంగ కుండా తమ శక్తి సామర్ధ్యాలను సమీకరించుకుంటూ లక్ష్యసాధన దిశగా ప్రయత్నాలను  కొనసాగించాలి. లక్ష్య సాధనలో ఎన్నో రకాల అడ్డంకులు వస్తూ ఉంటాయి వాటికి ఎదురీదుతూ వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెల్లినవారే ప్రపంచ విజేతలు అవుతారు. ఒక అంశం నేర్చుకోవాలనుకున్నప్పుడు అది ఎంత కఠినమైనా కానీ ఆ అంశం సాధనలో మిత్రులతో చర్చించడం, మేధావులు, విజేతల సహాకారం తీసుకోవడం, సీనియర్స్‌ సలహాలను తీసుకొని ముందుకు వెల్తే  మీ లక్ష్యం మీకు దాసోహం అవుతుంది. నీ వెనుక ఏముంది… ముందేముంది..అనేది నీ కనవసరం. నీలో ఏముంది అనేది ముఖ్యం. నీ శక్తి సామర్ధ్యాలతో లక్ష్యాన్ని సాధించాలి. ఇలా ఎందరో సాధించారు మనమూ సాధిద్దాం ఇతరులకూ స్ఫూర్తినిద్దాం

-డా.అట్ల శ్రీనివాస్‌ రెడ్డి
స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ రిహాబిలిటేషన్‌ సైకాలజిస్ట్‌ ఫ్యామిలీ కౌన్సెలర్‌ 9703935321

Leave a Reply