Take a fresh look at your lifestyle.

‘‘పండుగలు పబ్బాలకు బోనీ తొలి ఏకాదశి’’

“ఉత్తరాయణంలో కంటే దక్షిణాయనంలో పండుగలూ పబ్బాలూ అధికం. ఆరోగ్య పరిరక్షణార్థం నియమాలు ఎక్కువగా పాటించాల్సి ఉండడం చేత, నియమ పాలనార్థం పూర్వీకులు వ్రతాలు, ఉత్సవాలు ఎక్కువగా నిర్దేశించారు. అలాంటి పండగలకు, పబ్బాలకు ‘‘బోనీ ‘‘ వంటిది ఆషాడ శుక్లపక్ష ఏకాదశి. చాతుర్మాస్య దీక్షా దినాల ఏకాదశులలో మొదటిది కావడం చేత ‘‘తొలి ఏకాదశి’’గా నామాంతరం గల దినమైనది. ‘‘ప్రధమైకాదశి’’ అను సంస్కృత నామాన్ని బట్టి తెలుగు వారు దీనిని తొలి ఏకాదశి అని వ్యవహ రిస్తున్నారు. హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి. ఈ పర్వదినం తోనే మన పండగలు మొదలవుతాయి. తర్వాత రాగల పండుగలకు పబ్బాలకు ఇది తొలిది.”

ఉత్తరాయణంలో కంటే దక్షిణాయనంలో పండుగలూ పబ్బాలూ అధికం. ఆరోగ్య పరిరక్షణార్థం నియమాలు ఎక్కువగా పాటించాల్సి ఉండడం చేత, నియమ పాలనార్థం పూర్వీకులు వ్రతాలు, ఉత్సవాలు ఎక్కువగా నిర్దేశించారు. అలాంటి పండగలకు, పబ్బాలకు ‘‘బోనీ ‘‘ వంటిది ఆషాడ శుక్లపక్ష ఏకాదశి. చాతుర్మాస్య దీక్షా దినాల ఏకాదశులలో మొదటిది కావడం చేత ‘‘తొలి ఏకాదశి’’గా నామాంతరం గల దినమైనది. ‘‘ప్రధమైకాదశి’’ అను సంస్కృత నామాన్ని బట్టి తెలుగు వారు దీనిని తొలి ఏకాదశి అని వ్యవహ రిస్తున్నారు. హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి. ఈ పర్వదినం తోనే మన పండగలు మొదలవుతాయి. తర్వాత రాగల పండుగలకు పబ్బాలకు ఇది తొలిది.

‘‘గృహస్థో బ్రహ్మచారి చ ఆహితాగ్నిస్త దైవచ, ఏకాదశ్యాంశ భంజిత పక్షయోరు భయో రపి’’ అని అగ్ని పురాణాదులు స్పష్టం చేస్తున్నాయి. గృహస్తులకు, బ్రహ్మచారులకు, నిత్యాగ్ని హోత్రులకు సైతం ఏకాదశి నిమిత్తమైన కర్మగా, ఉపవాసాద్యాచరణము విధించ బడినది. ఏకాదశి దినం శ్రీమహా విష్ణువుకు ప్రీతిపాత్రమైన ‘‘హరివాసము’’ అని కొనియాడారు బడుచున్నది. నిష్టా పరులకు సనాతన సాంప్రదాయ ఆచరణ ఆసక్తులకు ఇది ఉపవాస దినం. ఈనాటి నుండి నాలుగు మాసాల పాటు ప్రతి దినం పురాణ గ్రంథాలు పఠించడం సదాచారంగా వస్తున్నది. అన్ని ఏకాదశులలోకి ఆషాఢ శుక్ల ఏకాదశి మహా విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్ర మైనదిగా భావించ బడుతున్నది. కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు.. బ్రహ్మ వరంతో దేవతలను, రుషులను హింసించాడని, ఆ రాక్షసుడితో మహా విష్ణువు వెయ్యేళ్లు పోరాడి, అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా.. శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి, ఆ రాక్షసుణ్ని అంతం చేసిందని, ఇందుకు సంతోషించిన శ్రీమహా విష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా.. తాను విష్ణుప్రియగా లోకం చేత పూజలు అందుకోవాలని కోరుకాగా, నాటి నుంచి ఆమె ‘ఏకాదశి’ తిథిగా వ్యవహారంలోకి వచ్చిందని, అప్పటి నుంచి సాధువులు, భక్తులు ‘ఏకాదశి’ వ్రతం ఆచరించి విష్ణుసాయుజ్యం పొందినట్లుగా పురాణ కథనాలు.

ఈరోజు మొదలుకొని విష్ణుమూర్తి నాలుగు నెలలపాటు, పాతాళ లోకంలో బలి చక్రవర్తి ద్వారం వద్ద ఉండి, కార్తీక శుక్ల ఏకాదశి నాడు వెనక్కి తిరిగి వస్తారని చెబుతారు. అలాగే ఈ దినం విష్ణుమూర్తి, నాలుగు నెలల పాటు క్షీర సముద్రంలో శేష సాయిపై పండుకొని, కార్తీక శుక్ల ఏకాదశి నాడు మేల్కొంటారని అని పురాణాలు వివరిస్తున్నాయి. గదాధర పద్ధతి దీనిని ‘‘హరి శయనం’’ అంటున్నది. అలాగే ‘‘దేవ శయని ఏకాదశి’’ అని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ దినంతో ప్రారంభించి, మహావిష్ణువు నాలుగు నెలలపాటు క్షీర సముద్రంలో శయనించి, కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడని, పురాణాలు చెబుతున్నాయి. అందులకే దేనికి ‘‘దేవ శయన ఏకాదశి’’ అని, ‘‘శయనైకాదశి’’ అని పేర్లు కూడా ఉన్నాయి. వైష్ణవాలయాలలో ఈ దినం నాడు విగ్రహాలను, ఆభరణాలతో అలంకరించి పూజించడం ఆచారం. ఆషాడ మాస శుక్ల ఏకాదశినాడు ఉపవాసం ఉండి చాతుర్మాస్య వ్రత కల్పం ప్రారంభించాలని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పినట్లు గ్రంథస్తం. బ్రహ్మ వైవర్త పురాణ ఆధారంగా చాతుర్మాస్య దీక్షను ఆషాఢ శుద్ధ ఏకాదశితో ప్రారంభించి, విష్ణుమూర్తి పూజలు చతుర్మాస్య వ్రతం మొదలుకొని ఏకాదశి, ద్వాదశి, అమావాస్య, పౌర్ణమి, కర్కాటక సంక్రాంతి, పర్వదినాలలో ఉపవాస దీక్షలో ఉంటూ, కార్తీక శుక్ల ఏకాదశి వ్రతం పూర్తి చేయడం ఆచారం.

తెలుగు దేశపు వ్యవహారాల ప్రకారం గుంటూరు మండలంలో కొన్ని ప్రాంతాలలో దీనిని ‘‘పేలపిండి ఏకాదశి’’ అంటారు. పేలాలు విసిరి పిండి చేసి, బెల్లంలో కలుపుకొని తింటారని ఆ పేలాల పిండి మీద కూడా ఆచారంగా కొనసాగింది. ఉభయ గోదావరి మండలాల్లో మాగాణి గ్రామాల్లో రైతులు ఈ దినం నాడు కొత్త పాలేర్లను కుదుర్చు కుంటారు. ఆ ప్రాంతాల్లో వాళ్లకు తొలి ఏకాదశి దానికి ముందు దినాలు, ఆటవిడుపు సమయాలు. తొలి ఏకాదశి నాడు కానీ, తర్వాత ఈ రోజున కానీ, కొత్త పాలేరులకు కొత్త బట్టలు, కొత్త కర్రలు ఇచ్చి, పిలిచి పిండి వంటలతో భోజనాలు పెట్టడం కూడా ఆచారంగా ఉన్నట్లు కొన్ని గ్రంథాలు పేర్కొంటున్నాయి. ‘‘ఏరు ముందా’’… ‘‘ఏకాదశి ముందా’’ అని నెల్లూరు జిల్లాలో ఒక సామెత ఉంది. ఆషాడం నుండి మేఘోదయం అగు చుండుట చేత, ఏరువాక పనుల ప్రారంభించేవారు. ఏటి నీటి కోసం ఎదురు చూడడం, సామాన్యంగా ఆషాడ శుక్ల ఏకాదశి వరకు నీటి వనరులలో కొత్తనీరు రావడం కద్దు. అందుచేత ఏరు, ఏకాదశి పందెము వేసుకొని ‘‘నేను ముందా… నీవు ముందా’’ అని పోటీ పడతాయని అలంకార ఉక్తి ఒక సామెతగా వాడుకలో ఉంది. వ్రతం అంటే కామ్యాల్ని నెరవేర్చేది. సౌభాగ్యానికి సుఖ సంతోషాలకు ఏకాదశి దేవత అనుగ్రహ సిద్ధికై సువాసినులు సామూహిక ఏకాదశి వ్రతాలను ఆచరించడం పరంపరానుగతంగా వస్తున్నది.

ఏకాదశినాడు వ్రతవిధాన పూర్వకంగా, నియమాలతో విష్ణువును ఆరాధించాలని భవిష్యోత్తర పురాణం చెబుతోంది. ఏకాదశినాడు భగవంతుని స్మరిస్తూ ఉపవాసదీక్ష పాటిస్తారు. విష్ణుస్తోత్రాలతో షోడశోపచార పూజ నిర్వహిస్తారు. ఏకాదశి నాడు పిప్పల వృక్ష ప్రదక్షణలు, దేవాలయాలలో దీపారాధనలు ఆచరణలో ప్రధానాలు. ద్వాదశినాడు అన్నార్తులకు భోజనం పెట్టి, ఆపై లక్ష్మీనారాయణుల్ని పూజించి, తీర్థప్రసాదాల్ని స్వీకరించి ఏకాదశవ్రత దీక్షను విరమించాలని వ్రత చూడామణి నిర్దేశించింది.

– రామ కిష్టయ్య సంగనభట్ల…
9440595494

Leave a Reply