Take a fresh look at your lifestyle.

పిలిచి మర్యాద చేస్తే… కెలికి కయ్యం పెట్టుకుంటారా?

‘‌నా అంతట నేనే ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వ పెద్దలను పిలిచి పీటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడాను. రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించుకుందామని స్నేహ హస్తం అందించాము. బేసిన్లు లేవు, భేషజాలు లేవు అని మన వైఖరిని చాలా స్పష్టంగా చెప్పాము. సహజ సరిహద్దు రాష్ట్రాలు కాబట్టి స్నేహ పూర్వకంగా మెదిలి, అంతిమంగా రైతులకు సాగునీరు అందించే లక్ష్యం సాధించాలని ప్రతిపాదించాము. వృధాగా సముద్రం పాలు అవుతన్న నీటిని రైతుల పొలాలకు మళ్లించే కార్యాచరణ అమలు చేద్దామని చెప్పాము. అయినా సరే ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటున్నది. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అర్థం లేని వాదనలతో, నిరాధారమైన ఆరోపణలతో ఫిర్యాదు చేస్తున్నది. అపెక్స్ ‌కమిటీ సమావేశంలో ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వం నోరు మూయించేలా, వారి అర్థ రహిత వాదనలను తిప్పికొట్టేలా సమాధానం చెపుతాం. తెలంగాణ ప్రాజెక్టుల గురించి మరోసారి నోరెత్తి మాట్లాడలేని పరిస్థితిని ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వానికి కల్పిస్తాం’’
-సీ ఎం కె.చంద్రశేఖర్‌ ‌రావు  

  • తెలంగాణ ప్రాజెక్టులపై ఆరోపణలు అర్ధరహితం
  • మరోసారి తెలంగాణ ప్రాజెక్టులపై నోరెత్తకుండా సమాధానం చెబుతాం  
  • ఏపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్‌ ఆ‌గ్రహం

తెలంగాణలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందే అనుమతులు పొందిన ప్రాజెక్టులపై సైతం అభ్యంతరాలు చెప్పడం ఏమిటని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణకు ఉన్న వాటా ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామనీ, వాస్తవాలు పరిగణనలోనికి తీసుకోకుండా అభ్యంతరాలు వ్యక్తం చేయడం తగదని మండిపడ్డారు. సోమవారం సీఎం కేసీఆర్‌ ‌జలవనరుల శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి రెండు రాష్ట్రాలకు రాసిన లేఖ, అపెక్స్ ‌కౌన్సిల్‌ ‌సమావేశం, రాష్ట్రంలో నిర్మిస్తున్న నీటి ప్రాజెక్టుల పూర్వాపరాలపైబీప ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈసందర్భంగా కేసీఆర్‌ ‌మాట్లాడుతూ తెలంగాణలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం కొత్తగా ఫిర్యాదులు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ఫిర్యాదుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుడు విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. శ్రీశైలం నుంచి సాగర్‌కు నీటి విడుదలలో కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నదనీ, వాస్తవాలు పరిగణనలోనికి తీసుకో••పోవడం, రాష్ట్రాల హక్కులు హరించే విధంగా కేంద్రం వ్యవహరించడం తగదని అభిప్రాయపడ్డారు.

వాస్తవాలు, సంపూర్ణ సమాచారంతో కేంద్ర ప్రభుత్వం, ఏపీకి బలంగా సమాధానం చెప్పాలని అధికారులను ఆదేశించారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు ఉండకూడదన్న ఉద్దేశంతో తనంతట తానే ఏపీ ప్రభుత్వ పెద్దలను పిలిచి పెద్దలను పిలిచి పీట వేసి అన్నం పెట్టి రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులను నిర్మించుకుందామని స్నేహ హస్తం అందించానని గుర్తు చేశారు.  బేసిన్లు, భేషజాలు లేకుండా ఇరు రాష్ట్రాలు కలసి పనిచేద్దామని స్పష్ఠంగా చెప్పానని గుర్తు చేశారు. సహజ సరిహద్దు రాష్ట్రాలు కాబట్టి స్నేహ పూర్వకంగా మెదిలి రైతులకు సాగు నీరందించే లక్ష్యం సాధించాలని ప్రతిపాదించినట్లు చెప్పారు. వృధాగా సముద్రం పాలవుతున్న నీటిని ఇరు రాష్ట్రాలలోని పొలాలకు మళ్లించుకోవాలని ప్రతిపాదించా. కానీ ఎంత మంచిగా చెప్పినా ఏపీ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటున్నదనీ మండిపడ్డారు. అపెక్స్ ‌కమిటీ సమావేశంలో ఏపీ ప్రభుత్వం నోరు మూయించేలా వారి అర్ధరహిత వాదనలను తిప్పికొట్టేలా సమాధానం చెబుతామని సీఎం కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాజెక్టుల గురించి ఏపీ ప్రభుత్వం మరోసారి నోరెత్తకుండా చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడే నాటికి నీటి కేటాయింపులు జరిగి అనుమతులు పొంది ఖర్చు కూడా జరిగిన ప్రాజెక్టుల విషయంలో కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం కూడా సరైంది కాదనీ, దీనిని సమర్థవంతంగా తిప్పికొట్టి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుంటామని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు.

Leave a Reply