Take a fresh look at your lifestyle.

పౌరహక్కుల ఉద్యమం ప్రారంభం

“ఇక్కడ ఒక చిత్రం ఏమంటే ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే న్యాయస్థానానికి వెళ్ళవచ్చు. న్యాయస్థానం ద్వారా వాటిని సంపాదించుకోవచ్చు. అందుకే వాటిని జస్టిసియబుల్‌ అంటారు. ఆదేశిక సూత్రాలు అటువంటివి కాదు. వాటిని న్యాయస్థానం ద్వారా సంపాదించుకోవడానికి వీలు లేదు. అవి నాన్‌ ‌జస్టిసియబుల్‌. ఆమె ఎంత తెలివిగా ఈ వాదన ముందుకు తెచ్చిందంటే న్యాయస్థానం ద్వారా సంపాదించగలిగిన వాటికన్న న్యాయస్థానానికి వెళ్ళి అడగడానికి వీలులేనివే ముఖ్యమైనవని వాదించింది. కాని నేనేమనుకుంటానంటే ఆదేశిక సూత్రాలను అమలుచేయడానికి ప్రాథమిక హక్కులు ఉండడం అత్యవసరం. కాని ఈ దేశంలో న్యాయవ్యవస్థ అప్పటికే దిగజారి పోయి, సామాజిక పరివర్తనా కర్తవ్యాన్ని చేపట్టడానికి చేతకాని స్థితికి చేరింది. సుప్రీం కోర్టు స్థితి చూస్తే న్యాయవాద వృత్తి అసహ్యకరమైన స్థితికి చేరుకుంది. ఒకరోజు, ఒక గంట వాదిస్తే, లేచి నిలబడితే వేలాది రూపాయలు ఫీజు వసూలు చేసే వాతావరణంలో ఒక పేదవాడి కేసు సుప్రీం కోర్టు ముంగిట్లోకైనా వెళ్తుందా?”

ఈ వైఫల్యం వల్లనే పౌరహక్కుల ఉద్యమం పుట్టుకురావలసి వచ్చింది. అది ఎవరో ఒక వ్యక్తి వల్లనో, కొందరు వ్యక్తుల వల్లనో రాలేదు. ఒక చారిత్రక అనివార్యతగా వచ్చింది. ఆ తర్వాత అది ఎట్లా మారిందనేది వేరే చర్చ. కాని పౌరహక్కుల ఉద్యమం చాలా సహజంగా తలెత్తడానికి తగిన భూమికను మన సామాజిక జీవితమే సృష్టించి పెట్టింది. 1970 లకు ముందు దేశంలో పౌరహక్కుల ఉద్యమం లేదని కాదు. కాని దాని మూలాలకూ, 1970 ల తర్వాతి పౌరహక్కుల ఉద్యమ మూలాలకూ తేడా ఉంది. 1964లో అనుకుంటాను, ఎంఎల్‌ఎ ‌క్వార్టర్స్‌లో జరిగిన ఒక పౌరహక్కుల సమావేశానికి వెళ్ళాను. అది చివరికి సిపిఐ, సిపిఎం సానుభూతి పరుల మధ్య ఘర్షణగా ముగిసింది. 1970ల ముందరి పౌరహక్కుల ఉద్యమం గురించి నాకు అంతకన్న ఎక్కువ సంబంధం లేదు. కాని 1970ల తర్వాత, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 1968 తర్వాత దేశంలోనూ, రాష్ట్రంలోనూ సాగిన పౌరహక్కుల ఉద్యమ ఆలోచనలకు చాలా లోతయిన సామాజిక పునాది ఉంది.

      అప్పుడే ప్రారంభమైన నక్సలైట్ల సాయుధ పోరాటం ఆ రోజుల్లో వర్గ శత్రు నిర్మూలన అనే మార్గాన్ని చేపట్టింది. ప్రభుత్వం ఆ పోరాటకారుల మీద అతి తీవ్రమైన అణచివేతను అమలుచేసింది. అప్పటికే ఒక దశాబ్దంగా దేశంలో పరిపాలన అనేది చట్ట, న్యాయ, రాజకీయ వ్యవస్థలను దిగజార్చివేసింది. పార్లమెంటు దాని రాజకీయ బాధ్యతలను మరచి పోయింది. గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగానికి గురయింది. ఎన్నికల రాజకీయాలు, ఎన్నికల ప్రచారాలు హాస్యాస్పదమైన ప్రహసనంగా మారిపోయాయి.దేశంలోరాజకీయచర్చలసరళిఅట్టడుగుకుగజారిపోయింది. ఆ స్థితిలో ఏదో ఒక రాజకీయ ఆలోచన ఉండక తప్పదని ఇందిరా గాంధీ గుర్తించింది. అందువల్ల జనాకర్షక రాజకీయాలనైనా ఉనికిలోకి తెచ్చింది. రాజ్యాంగం లోని ఆదేశిక సూత్రాలను ఆచరణలోకి తీసుకురావలసిన అవసరం గురించి మాట్లాడడం మొదలుపెట్టింది. అయితే ఆ చర్చలో ఆమె చాల తెలివిగా ఆదేశిక సూత్రాలకూ, ప్రాథమిక హక్కులకూ పోటీ పెట్టింది. పార్లమెంటుకూ, న్యాయవ్యవస్థకూ పోటీ పెట్టింది. అర్ధసత్యాలు ప్రచారం చేయడం మొదలు పెట్టింది. ఆమె మాటలను చాలామంది నమ్మారు కూడ.

      ఇక్కడ ఒక చిత్రం ఏమంటే ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే న్యాయస్థానానికి వెళ్ళవచ్చు. న్యాయస్థానం ద్వారా వాటిని సంపాదించుకోవచ్చు. అందుకే వాటిని జస్టిసియబుల్‌ అంటారు. ఆదేశిక సూత్రాలు అటువంటివి కాదు. వాటిని న్యాయస్థానం ద్వారా సంపాదించుకోవడానికి వీలు లేదు. అవి నాన్‌ జస్టిసియబుల్‌. ఆమె ఎంత తెలివిగా ఈ వాదన ముందుకు తెచ్చిందంటే న్యాయస్థానం ద్వారా సంపాదించగలిగిన వాటికన్న న్యాయస్థానానికి వెళ్ళి అడగడానికి వీలులేనివే ముఖ్యమైనవని వాదించింది. కాని నేనేమనుకుంటానంటే ఆదేశిక సూత్రాలను అమలుచేయడానికి ప్రాథమిక హక్కులు ఉండడం అత్యవసరం. కాని ఈ దేశంలో న్యాయవ్యవస్థ అప్పటికే దిగజారి పోయి, సామాజిక పరివర్తనా కర్తవ్యాన్ని చేపట్టడానికి చేతకాని స్థితికి చేరింది. సుప్రీం కోర్టు స్థితి చూస్తే న్యాయవాద వృత్తి అసహ్యకరమైన స్థితికి చేరుకుంది. ఒకరోజు, ఒక గంట వాదిస్తే, లేచి నిలబడితే వేలాది రూపాయలు ఫీజు వసూలు చేసే వాతావరణంలో ఒక పేదవాడి కేసు సుప్రీం కోర్టు ముంగిట్లోకైనా వెళ్తుందా?

    న్యాయవాద వృత్తి సమాజానికి సేవచేయాలనే ఆదర్శాన్ని మరిచిపోయింది. వైద్య, ఉపాధ్యాయ వృత్తుల్లో కూడా అదే జరిగింది. ఆ పరిస్థితుల్లో ఆ అసంతృప్తితో సహజంగానే ఉద్యమాలు పెల్లుబుకుతాయి. కమ్యూనిస్టు ఉద్యమంలోని యువ కార్యకర్తలు ఇంక ఓపిక పట్టలేకపోయారు. ఎన్నో చర్చలు, వివాదాల తర్వాత సాయుధ పోరాటం తప్ప మరో దారి లేదనే నిర్ణయానికి వచ్చారు. క్రమక్రమంగా ఎప్పటికో ఒకప్పటికి సోషలిజం వస్తుందనే మాటలో వారికి విశ్వాసం పోయింది. బలప్రయోగమే మంత్రసాని అనే మాట వాళ్ళు దృఢంగా నమ్మారు. వాళ్ళ కళ్ళ ముందర చైనా అనుభవం కూడా ఉంది. అదే ఏకైక మార్గమని వాళ్ళు అనుకున్నారు. అయితే వాళ్ళ పొరపాటేమిటంటే చైనా పరిస్థితులకూ, భారతదేశపు పరిస్థితులకూ చాల తేడా ఉంది. అది వాళ్ళు గమనంలోకి తీసుకోలేదు. బ్రిటిష్‌ వలసవాదం ఈ దేశంలో తయారు చేసి పెట్టిన పాలకవ్యవస్థలు, సుశిక్షితులైన పోలీసు, సైనిక యంత్రాంగాలు చాలా బలమైనవి.ఆ తొలితరం సాయుధ పోరాటాన్ని ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా అణచివేసింది. వందలాది మంది కార్యకర్తలను ఎన్‌కౌంటర్ల పేరిట చంపివేసింది. దాదాపు ఐదువేల మంది గిరిజనులను జైళ్ళలో నిర్బంధించింది. శ్రీకాకుళం జిల్లాలోని రెండు మూడు తాలూకాలు నిర్బంధ శిబిరాలుగా మారిపోయాయి. ఇటు హైదరాబాద్‌ ‌కుట్ర కేసు (నాగిరెడ్డి కుట్రకేసు), అటు పార్వతీపురం కుట్రకేసు పెట్టి వందలాది మంది కార్యకర్త లను, సానుభూతిపరులను వాటిలో ఇరికించింది.

      అప్పుడు – 1970కి ముందే – ఈ నక్సలైటు కేసులను రావి సుబ్బారావు గారు హైకోర్టులో వాదిస్తుండేవారు. ఆయన అప్పటికి సిపిఐతో ఉన్నప్పటికీ నక్సలైట్ల కేసులన్నీ  ఆయనే చేపట్టేవారు. ఆయన చాలా మంచిమనిషి. నాకు ఆయనతో చాలా సాన్నిహిత్యం ఉండేది. ఆయనే నాకు ఈ పౌరహక్కుల, నక్సలైట్ల కేసులతో పరిచయం కల్పించారు. అప్పుడే నాకు జ్వాలాముఖి కూడ పరిచయమయ్యాడు. నా ఆఫీసులో పని చేస్తుండిన నరసింహాచారికి జ్వాలాముఖికి బంధుత్వం ఉందనుకుంటాను. అందువల్ల జ్వాలాముఖి నా దగ్గరకు వస్తుండేవాడు. నాకిప్పటికీ గుర్తొస్తుంది – జ్వాలాముఖి వర్గ శత్రు నిర్మూలన అవసరం గురించి నాకు పాఠం చెపుతుండేవాడు. నేను ఆయనతో విభేదిస్తుండేవాడ్ని.‘‘ఇట్లా వర్గశత్రువులను ఒక్కొక్కడ్ని పట్టుకుని చంపడం ఎప్పుడయ్యేను? ఇది పద్ధతి కాదయ్యా – ఏదో వెల్లువ లాగ వచ్చి ఇదంతా కొట్టుకు పోవలసిందే తప్ప ఇది పనికి రాదు’’ అనేవాడ్ని. ‘‘పురుగుల్ని చంపే మిషన్‌  ‌కనిపెట్టి ప్రచారం చేస్తున్నాడట అమ్మేవాడెవడో. ఒక్కొక్క పురుగును పట్టుకో, మిషన్‌లో పెట్టు, మీట నొక్కు-ఇదంతా అయ్యేపని కాదు’’ అనేవాడ్ని.

      ఆ రోజుల్లోనే విరసం ఏర్పడింది. జ్వాలాముఖి, చెరబండరాజు, నిఖిలేశ్వర్‌ కవిత్వం వినిపిస్తుండేవాళ్ళు. వాళ్ళ కవిత్వం పుస్తకాల్ని ప్రభుత్వం నిషేధించింది. 1970 జులై 4న విరసం ఏర్పడిన రోజున విడుదలయిన ‘మార్చ్’ ‌కవితా సంకలనాన్ని, అక్టోబర్‌లో విరసం మొదటి మహాసభల్లో విడుదలయిన ‘ఝంఝ’ కవితా సంకలనాన్ని ప్రభుత్వం నిషేధించింది. 1971 మార్చిలో ఈ నిషేధ ఉత్తర్వులు వస్తే వెంటనే విరసం తరఫున ఈ రెండు పుస్తకాల నిషేధం మీద హైకోర్టులో రిట్‌ ‌పిటిషన్‌ ‌వేశాం. మొదట ‘మార్చ్’ ‌నిషేధాన్ని వరంగల్‌ ‌సెషన్స్ ‌కోర్టు ధృవపరిచింది. హైకోర్టులో మాత్రం ముగ్గురు న్యాయమూర్తుల బెంచిలో ఇద్దరు న్యాయమూర్తులు నిషేధాన్ని ఖాయం చేస్తూ తీర్పు ఇచ్చారు. జస్టిస్‌ ‌కొండా మాధవ రెడ్డి మాత్రం సుదీర్ఘమైన డిసెంట్‌ ‌నోట్‌ ‌రాశారు.ఆ బెంచిలో జస్టిస్‌ ఓబుల్‌ ‌రెడ్డి, జస్టిస్‌ శ్రీ‌రాములు, జస్టిస్‌ ‌మాధవ రెడ్డి ఉన్నారు. మార్చ్, ‌లే సంకనాల నిషేధం మీద నేను వాదించగా, ఝంఝ నిషేధం మీద పత్తిపాటి వెంకటేశ్వర్లు వాదించాడు. మార్చ్, ‌ఝంఝల నిషేధాన్ని సమర్థించిన న్యాయమూర్తులు, లే నిషేధాన్ని కొట్టివేశారు. మొత్తం మీద రాజద్రోహం అనే మాటకు న్యాయస్థానం చాలా సంకుచితమైన నిర్వచనం ఇచ్చింది. ఆ నిర్వచనాన్ని జస్టిస్‌ ‌మాధవ రెడ్డి అంగీకరించలేదు. ఆయన చాల ఓపికగా న్యాయవాదుల వాదనను వినే న్యాయమూర్తి. అతి కొద్ది మంది మంచి న్యాయమూర్తులలో ఆయన ఒకరు.

-కె.జి. కన్నబిరాన్‌
ఆత్మకథాత్మక సామాజిక చిత్రం

అక్షరీకరణ :ఎన్ .వేణుగోపాల్

Leave a Reply