అంతరిక్షం ఇప్పటికీ ఓ అంతుచిక్కని రహస్యమే. ముఖ్యంగా మొత్తం భూమినే నాశనం చేయగలిగిన గ్రహశకలాల (ఆస్టరాయిడ్స్) గురించి మనకు తెలిసింది తక్కువే. డైనోసార్లు లాంటి భారీ జీవరాశులు అంతరించిపోవడానికి ఇవే కారణం.తుంగస్కా గ్రహశకలం చరిత్రలో భూమిపై అతిపెద్ద ఉల్క దాడి. పొడవైన తుంగస్కా నదిపైకి వచ్చి పడిన ఈ గ్రహశకలం 2,150 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు 80 మిలియన్ చెట్లను నాశనం చేయడానికి తగినంత శక్తిని విడుదల చేసింది.
30 జూన్ 1908లో ఈ ఘటన జరిగింది.గ్రహశకలాల దినంపై ఐక్యరాజ్య సమితి తీర్మానం విషాదకరమైన మరియు విస్మయపరిచే తుంగస్కా సంఘటన జ్ఞాపకార్థం,2016లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం జూన్ 30వ తేదీ ‘‘అంతర్జాతీయ గ్రహశకలం దినం’’ గా పాటించాలని తీర్మానం చేసింది.2017 జూన్ 30 నుండి ప్రతీ సంవత్సరం అంతర్జాతీయ గ్రహ శకల దినోత్సవం జరుపుకుంటున్నారు.
ఉద్దేశ్యం
గ్రహశకలాల బారి నుంచి భూమిని కాపాడటం, అందుకు తగ్గ సాంకేతికతలను అభివృద్ధి చేయడం, భావితరాలకు వీటి గురించిన సమాచారం అందించడం దీని ముఖ్యోద్దేశం.
గ్రహశకలాల స్థితిన గమనించి భూమిని, భవిష్యత్ తరాలను ఆయా విపత్తు సంఘటనల నుండి రక్షించడానికి చేయవలసిన కార్యకలాపాల గురించి ఈరోజు చర్చలు జరుపుతారు.
గ్రహశకలం అంటే
సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం సౌర వ్యవస్థ ఏర్పడినప్పటి నుండి మిగిలిపోయిన రాతి శకలాలు గ్రహ శకలాలు.గ్రహశకలాలు సూర్యుని చుట్టూ ప్రయాణించే ఒక చిన్న వస్తువు. ఎక్కువగా, ఇవి అంగారక గ్రహం మరియు బృహస్పతి కక్ష్యల మధ్య కనిపిస్తాయి. కాని కొన్ని ఎక్కువ అసాధారణ కక్ష్యలను కలిగి ఉంటాయి.ఇవి గులకరాళ్ళ కొలతలు నుండి 600 మైళ్ళ వరకు ఉంటాయి.
అవి చాలా చిన్నవి, అవి గ్రహాలుగా పరిగణించబడవు.కాని అవి సూర్యుని చుట్టూ తిరుగుతాయి. వాటిని సౌర వ్యవస్థ యొక్క మిగిలిపోయిన పదార్థంగా పిలుస్తారు.ఇవి తీవ్రమైన వేగంతో ఎగురుతూ భూమి గుండా వెళతాయి లేదా కొన్ని సమయాల్లో ఎగువ వాతావరణాన్ని తాకుతాయి.
డైనోసార్ల అంతానికి కారణం గ్రహశకలాలు
డైనోసార్లు లాంటి భారీ జీవరాశులు అంతరించిపోవడానికి కారణమయ్యాయి. అయితే అప్పుడే కాదు.. ఇప్పుడు సైతం భూ గ్రహానికి ముప్పు పొంచే ఉందంటున్నారు శాస్త్రవేత్తలు.భూమికి చేరువగా వచ్చే గ్రహ శకలాలతో ముప్పు భూమికి చేరువగా ఉండి, వినాశనం సృష్టించగలిగే 16 వేల గ్రహశకలాలను ఇప్పటివరకు గుర్తించారు. రోజుకు సగటున మూడు చొప్పున ఇటువంటివి వెలుగులోకి వస్తున్నట్లు తేల్చారు.అంతరిక్షం..అంతు అనేదే లేని అద్భుతా లమయం.
అంతరిక్షంపై దశాబ్దాలుగా ప్రయోగాలు కొనసాగుతున్నప్పటికీ ఎన్నో ప్రశ్నలను మిగిల్చుతూనే ఉంటుంది. విశ్వాంతరాలపై ప్రయోగాలు సాగుతున్న కొద్దీ కొత్త కొత్త సంగతులు బయటపడుతూనే ఉంటాయి తప్ప.. వాటికి అంతం అనేది ఉండట్లేదు. వెలుగులోకి వచ్చిన ప్రతి సమాచారం కూడా అత్యంత ఆసక్తిని కలిగించేదే.. ఉత్కంఠను రేకెత్తించేదే.
గ్రహశకలాలు వల్ల భూమికి ప్రమాదం
నాసా నిబంధనల ప్రకారం.. భూమికి 4.6 మిలియన్ మైళ్ల చేరువకు వచ్చే 460 అడుగులు లేదా అంతకంటే ఎక్కువ వెడల్పు గల గ్రహశకలాలన్నీ మానవాళికి ప్రమాదకరమైనవే. అయితే, 2003లో ‘డిమార్ఫస్’ ఆస్టరాయిడ్ (వెడల్పు 524 అడుగులు, బరువు 480 కోట్ల కిలోలు) భూమికి 3.7 మిలియన్ మైళ్ల చేరువకు వచ్చింది. దీంతో గ్రహశకలాల వల్ల భూమికి భవిష్యత్తులో ప్రమాదం ఉందన్న శాస్త్రవేత్తల అంచనాలు తొలిసారిగా నిజమయ్యే సూచనలు కనిపించాయి.గ్రహ శకలాల ఉనికిని సరిగ్గా గుర్తించ లేకపో తున్న శాస్త్రవేత్తలు చాలా సందర్భాల్లో గ్రహశకలాలు భూ వాతావరణంలోకి ప్రవేశించే వరకు శాస్త్రవేత్తలు గుర్తించలేకపోతున్నారు.
2008 అక్టోబర్లో అయిదు మీటర్ల గ్రహశకలం ఒకటి భూమివైపు దూసుకొచ్చింది. అది సూడాన్ సమీపంలో గాలిలోనే మండిపోయింది. 2013లో 20 మీటర్ల రాయి భూమివైపు వచ్చింది. ఇక్కడి వాతావరణంలో రాపిడికి మండిపోతూ పేలిపోయింది. అది రష్యాలోని చెల్బ్యాబిన్సక్ నగరంలో పడింది. అప్పట్లో చాలా ఇళ్ల కిటికీల అద్దాలు పగిలిపోయాయి. 7,000 ఇళ్లు దెబ్బతినగా… 1,400 మంది గాయపడ్డారు. అందుకే ఇలాంటి ఘటనలే 2014, 2018ల్లోనూ జరిగాయి.
ఆయా ఉల్కలను భూ వాతావరణంలోకి అవి ప్రవేశించడానికి 20 గంటల ముందు మాత్రమే కనుగొన్నారు.ప్రస్తుతం నాసా భూమికి సమీపంగా ఉన్న 26,000 గ్రహశకలాలను, వాటి గమనాన్ని పర్యవేక్షిస్తుంది. అంతర్జాతీయ గ్రహ శకలాల దినం సందర్భంగా గ్రహ శకలాల వల్ల మానవాళికి జరిగే ముప్పును గురించి తెలుసుకుని నివాస గ్రహమైన ధరిత్రిని కాపాడుకుందాం.
– పిన్నింటి బాలాజీ రావు, భౌతిక రసాయన శాస్త్ర
ఉపాధ్యాయుడు
హనుమకొండ., 9866776286