Take a fresh look at your lifestyle.

‌ప్రధాని ఏనాడూ తాను చేస్తున్నానని చెప్పరు

  • సిఎం కేసీఆర్‌, ‌మంత్రులేమో మేమే ఇస్తున్నామంటారు
  • కేసీఆర్‌ అ‌క్రమ సంపాదనను కక్కిస్తాం…ప్రజలే నన్ను కాపాడుకుంటారు
  • చేర్యాల మహాజన సంపర్క్ అభియాన్‌లో బిజెపి నేత ఈటల రాజేందర్‌

సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 30 : ‌ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏనాడు తాను చేస్తున్నాననీ చెప్పరనీ, జీతగాడిని, సేవకుడిని తప్ప ఓనరును కాదని చెబుతుంటే…తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన మంత్రులు ఏదీ మాట్లాడినా తామే ఇస్తున్నామంటూ మాట్లాడుతుంటారనీ బిజెపి సీనియర్‌ ‌నాయకుడు, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌విమర్శించారు. శుక్రవారం సిద్ధిపేట జిల్లా చేర్యాలలో నిర్వహించిన మహాజన్‌ ‌సంపర్క్ అభియాన్‌ ‌కార్యాక్రమానికి ఈటల రాజేందర్‌ ‌ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యమ సమయంలో అటుకులు తిని బతికిన కేసీఆర్‌కు హుజురాబాద్‌లో ఖర్చు చేయడానికి రూ. 600 కోట్లు ఎక్కడి నుంచి వొచ్చాయని ప్రశ్నించారు. తమ సొమ్మును తీసుకుపోయి పంజాబ్‌లో, మహారాష్ట్రలో పంచడానికి కేసీఆర్‌ ఎవరని ప్రశ్నించారు. బిఆర్‌ఎస్‌ ‌పార్టీ అక్రమ సంపాదన కొన్ని లక్షల కోట్లు ఉంటదని..దాన్ని కక్కిస్తామన్నారు. ‘మోదీకి కుటుంబం లేదు..దేశమే ఆయన కుటుంబం.’ అంటూ వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న కళ్యాణ లక్ష్మి, పెన్షన్‌, ‌కేసీఆర్‌  ‌కిట్‌, ‌రైతుబంధు అన్నీ ఇస్తున్నామనీ అందుకే మాకే వోటు వేయాలని సిఎం కేసీఆర్‌ ‌చెప్పుకుంటున్నారు. కానీ,  ఆ డబ్బులు ఎక్కడనుండి వస్తున్నాయనీ రాజేందర్‌ ‌ప్రశ్నించారు. నేను ఆర్థిక మంత్రి అయిన తొలినాళ్లలో మద్యం ద్వారా 10 వేల 700 కోట్ల రూపాయల ఆదాయం వొస్తే..ఇవ్వాల మద్యం ద్వారా వొస్తున్న ఆదాయం 45 వేల కోట్ల రూపాయలన్నారు. రాష్ట్రంలో బెల్టుషాపులను రద్దు చేసే దమ్ము కెసీఆర్‌కు ఉందా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఈటల చిన్న కథ చెప్తా అంటూ…గొల్లాయన గొర్లు కాసేది మా కోసమే అని గొర్లు అనుకుంటాయి. కానీ, ఆ గొర్లతోనే ఆయన బ్రతుకుతున్నాడని ఆ అమాయక గొర్లకు తెలియదు. వాటిలాగా మనం కూడా అమాయకంగా ఉండొద్దు, సిఎం కేసీఆర్‌  ఇచ్చే ప్రతి రూపాయి ప్రజలదే అనే వాస్తవం తెలుసుకోవాలన్నారు. కేసీఆర్‌ ఇచ్చే కల్యాణలక్ష్మీ, పెన్షన్లు, రైతుబీమాకు మొత్తంగా కలిపితే 25వేల కోట్లు రూపాయలు మాత్రమేననీ, కానీ మద్యం ద్వారా కేసీఆర్‌ ‌ప్రభుత్వం లాక్కునేది 45 వేల కోట్ల రూపాయలన్నారు.

కేసీఆర్‌ ‌చేసిన నిర్వాకాల వల్ల తెలంగాణ గడ్డ మీద పుట్టబోయే బిడ్డ కూడా ఒక లక్ష 20 వేల కోట్ల అప్పుతో పుడుతుందన్నారు. తెలంగాణను 5 లక్షల కోట్ల అప్పుల కుప్పలా మార్చిన కేసీఆర్‌ను ఓడించకపోతే మనకు విముక్తి లేదన్నారు. సిద్ధిపేట కలెక్టర్‌ ‌భవనాల కింద దళితుల ఆర్తనాదాలు ఉన్నాయనీ, 350 ఎకరాల భూమిని కేసీఆర్‌ ‌చౌకగా కొట్టేశాడన్నారు. గజ్వేల్‌ ‌నియోజకవర్గం నుంచి కేసీఆర్‌ను ఎమ్మెల్యేగా గెలిపించిన పాపానికి గజ్వేల్‌ ‌నియోజకవర్గంలోని వర్గల్‌, ఒం‌టిమామిడి తదితర ప్రాంతాలలో 3 వేల ఎకరాల భూములు లాక్కుంటున్నాడన్నారు. ఏమైనా ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టులు నిర్మిస్తే భూములు తీసుకో..కానీ, పేదలను కొట్టి పెద్దలకు పెట్టొద్దన్నారు. ధరణి తెచ్చి పేదల భూములు దొరలకు కట్టబెట్టిన ఘతన కేసీఆర్‌కు దక్కిందన్నారు. సంగారెడ్డిలో గ్రామ పంచాయితీ కోసం భూమి గుంజుకుంటే తండ్రి, కొడుకు కలెక్టర్‌ ‌సాక్షిగా ఆత్మహత్య చేసుకున్నారనీ, జనగాం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ప్రజలు వోట్లు వేసింది ప్రజల భూములు ఆక్రమించుకోవడానికి కాదనీ, ముత్తిరెడ్డి బిడ్డనే వొచ్చి మా నాన్న భూమి ఆక్రమించుకున్నాడని చెప్తున్నారు అంటే ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉంది అర్థం చేసుకోవాలన్నారు.

బిఆర్‌ఎస్‌ ‌నేతలు తప్పు చేసినా, అధర్మం అయినా పోలీసులు మాత్రం వారి కోసమే పని చేస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ ఏం ‌చెప్పాడో…సిఎం అయ్యాక ఏం చేస్తున్నారో ప్రజలే ఆలోచన చేయాలన్నారు. ఉత్సవాల పేరుతో ప్రభుత్వ సొమ్ముతో ప్రచారం చేసుకుంటున్నాడన్నారు. బిజెపి యావంతా పేద ప్రజల కోసమే ఉంటుందనీ, ప్రధానమంత్రి మోదికి కుటుంబం లేదనీ, ప్రజలే ఆయన కుటుంబమనీ… నిత్యం ప్రజల కోసం పరితపించే మోదీని ఆశీర్వదించాలన్నారు. రాష్ట్రంలోనూ ప్రజలందరూ మెచ్చేలా పాలనను అందిస్తామనీ ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ అన్నారు.

Leave a Reply