Take a fresh look at your lifestyle.

ర్యాగింగ్‌ ‌నకు ఆత్మహత్యే పరిష్కారమా…. చట్టాలతో ర్యాగింగ్‌ను తరమాలి

కళాశాలల విద్యార్థులను ర్యాగింగ్‌ ‌భూతం వెంటాడుతోంది. ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నా రాష్ట్రంలో ఏదో ఒక మూల విద్యార్థులు ర్యాగింగ్‌ ‌బారిన పడుతున్నారు.ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న మెడికో డాక్టర్‌ ఇక లేరని తెలిసి ఎంతో ఆవేదన కలుగుతోంది. ఒక అమ్మాయి పాఠశాల స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ మెడికల్‌ ‌పీజీ స్థాయికి రావాలంటే దాని వెనకాల వాళ్ళ తల్లిదండ్రుల కష్టం, ఆ అమ్మాయి కఠోర శ్రమ, ఎందరివో ఎన్నెన్నో త్యాగాలు ఉంటాయి, ఎంతగా కష్టపడి చదివిందో ఎన్నెన్ని కలలు కన్నదో పాపం వాటన్నింటిని ఒక్క ర్యాగింగ్‌ అనే భూతంతో మసి చేసారు.ర్యాగింగ్‌ అనేది సర్వసాధారణంగా మారి పోయిందా, వేధింపులనేవి ఎక్కడైనా, ఎవరి కైనా తప్పవా? ఇటీవల వార్తా పత్రికలలో ప్రచురితమైన వార్తలను చూస్తే వేధింపులతో ఆత్మహత్యలా అనే సందేహం కూడా కలుగుతోంది.
ఇంత సున్నితమైన మనస్తత్వం కలిగిన యువత కూడా ఉన్నారా? మానసిక ధృఢత్వం యువత లో కొరవడుతోందా…. రోజు రోజుకు పెరుగుతున్న ఆత్మహత్యలకు, పెచ్చు మీరుతున్న మానసిక సమస్యలకు బాధ్యులు ఎవరూ…. ఆత్మహత్యలతో సమస్య పరిష్కారమవుతోందా ఒక్క సారి ఆలోచించండి….. సమస్యల బారి నుండి తప్పించుకోవడానికి పారిపోవడమేనా….. ఎదురొడ్డి నిలవడమా… మీ పైననే ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఎలాంటి ఓదార్పు దొరుకుతుందో ఆలోచించండి… వ్యక్తులలో మానసిక ధృఢత్వాన్ని అలవరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.మానసిక వేధింపులు వ్యక్తిపై విపరీతమైన ప్రభావం: మానసిక వేధింపు అనేది మనిషిలో అంతర్గతంగా కలిగే ఒక రకమైన వేధింపు. ఈ వేధింపులు ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన వలన మరొక వ్యక్తిలో డిప్రెషన్‌, ఆం‌దోళన లేదా భయం వంటి మానసిక సమస్యలు సంభవించడం జరుగుతోంది. మానసిక వేధింపు అనేది శారీరకంగా కలిగే వేధింపు కాకపోయినా మనసుకు తీవ్రమైన గాయాన్ని ఏర్పరుస్తుంది. నిరంతర విమర్శ, వాఛిక వేధింపు, బెదిరింపులు మరియు మోసం చేయడం వంటి ఏవైనా సరే మానసిక వేధింపులుగా వ్యక్తిలో ఏర్పడుతాయి.మానసిక వేధింపులు మనిషిని కృంగదీస్తాయి. ఆ సమయంలో వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో గుర్తించడం చాలా కష్టం. మానసిక వేధింపులు వ్యక్తిపై విపరీతమైన ప్రభావం చూపుతాయి. విమర్శించడం ద్వారా ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం జరుగుతుంది.
ర్యాగింగ్‌ ‌నిరోధానికి సమగ్ర చట్టం: ర్యాగింగ్‌ ‌నకు పాల్పడేవారికి కఠిన శిక్షలకు సంబంధించిన సమగ్ర చట్టం భారతదేశంలో తీసుకు రావల్సిన అవసరం ఉంది. ర్యాగింగ్‌ ‌నకు పాల్పడే వారిపై కఠిన శిక్షలు ఉన్నా, వేధింపులు జరిగినట్టు రుజువు చేసేందుకు తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో అవన్నీ కోర్టుల ముందు నిలవలేకపోతున్నాయి. ఏం జరిగినా, అంతా తెలిసినా చట్టం ముందు సరైన ఆధారాలను చూపలేక వ్యక్తులు బలహీనులుగా ఉండిపోతున్నారు. న్యాయస్థానాలు సైతం శిక్షలు వేసేందుకు సరిపడా ఆధారాలు లేకపోవడంతో నిస్సహాయంగా ఉండిపోతున్నాయి.
అధిగమించండిలా…
మెంటారుగా స్వీకరించాలి: మానసిక వేధింపులకు లోనయినపుడు ఒక ఆదర్శవంతమైన వ్యక్తి, సహాయకారిగా ఉన్న వ్యక్తిని మెంటారు గా స్వీకరించాలి. మానసిక వేధిపులకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడూ పంచుకొంటూ, పరిస్తితిని అర్థం చేసుకొని మెంటారు ఇచ్చే సూచనలను, సలహాలను స్వీకరిస్తూ వేధింపులకు పరిష్కార మార్గాలతో సరైన నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం ఉంది.మానసిక ధృఢత్వం: వేధింపులతో కుంగిపోకుండా యోగా ధ్యానం లాంటివి చేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించి, మానసిక ధృఢత్వం పెంపొందించుకోవడానికి దోహదం చేస్తాయి.కౌన్సెలింగ్‌: ‌మానసిక వేధింపుల బారిన పడుతున్న వారు వేధింపుల సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనేలా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు సైకాలజిస్ట్ ‌ద్వారా తగు కౌన్సెలింగ్‌ ‌తీసుకోవాలి.
image.png
డా. అట్ల శ్రీనివాస్‌ ‌రెడ్డి రిహాబిలిటేషన్‌ ‌సైకాలజిస్ట్ ‌ఫ్యామిలీ కౌన్సెలర్‌,

Leave a Reply