Take a fresh look at your lifestyle.

ఓబీసీ కులగణనను నిర్వహిస్తామన్న రాహుల్ గాంధీ హామీ హర్షణీయం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 29 : 2024 లోక్‌సభ ఎన్నికలలో అధికారంలోకి వస్తే దేశంలో కుల గణనను నిర్వహించాలన్న తన పార్టీ నిర్ణయాన్ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పునరుద్ఘాటించాడంపై అఖిల భారత ఓబీసీ హక్కుల పరిరక్షణ వేదిక అధ్యక్షులు ఆళ్ళ రామకృష్ణ హర్షం వ్యక్తం చేసారు. జనాభా గణనలో కుల గణన నిర్వహిస్తేనే ఓబీసీలకు నిజమైన సామజిక న్యాయం దక్కుతుందని ఆయన తెలిపారు. శుక్రవారం బషీర్ బాగ్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆళ్ళ రామకృష్ణ మాట్లాడుతూ ఓబీసీలు అన్ని రంగాల్లో తీవ్రంగా నష్టపోతున్నా తెలిసికూడా, కుల గణన కోసం పెరుగుతున్న డిమాండ్‌పై బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తుందని ప్రశ్నించారు. ఓబీసీ కులగణన చేస్తామని హామీ ఇచ్చి, నిర్వహించక మోసానికి గురిచేసిన బీజేపీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓబీసీ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన తెలిపారు. బ్రిటీష్ ఇండియాలో 1931లో చివరి ఓబీసీ జనాభా గణన నిర్వహించబడిందని, జనాభాలో వారి వాటా 52 శాతంగా గుర్తించారని, యుపిఎ ప్రభుత్వ హయాంలో 2011లో సామాజిక-ఆర్థిక, కుల గణనను నిర్వహించినప్పటికీ, అది తప్పులతో కూడిన డేటాగా తేల్చి బిజెపి ప్రభుత్వం బహిరంగ పరచలేదని చెప్పారు. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించే విధానం 1931 జనాభా లెక్కల డేటా ఆధారంగా 1990 నుండి నేటికీ కొనసాగుతుందని, ఈ కాలం చెల్లిన డేటా ఆధారంగా ఓబీసీ జనాభా యొక్క ప్రస్తుత సామాజిక-ఆర్థిక స్థితిని ఖచ్చితంగా సూచించడంలో పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. దేశంలో సమర్థవంతమైన సంక్షేమ చర్యలు తీసుకోవడానికి జనాభా కులగణన అత్యంత అవసరమని, కుల ప్రాతిపదికన జనాభా గణనకు కట్టుబడి ఉండే పార్టీలకే ఓబీసీల మద్దతు ఉంటుందని ఆళ్ళ రామకృష్ణ వెల్లడించారు.

Leave a Reply