Take a fresh look at your lifestyle.

బీసీలను దగాచేసిన బిఆర్ఎస్ ను చిత్తుగా ఓడించాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 06 : తెలంగాణ రాష్ట్రంలోని బీసీల హక్కులను కాలరాసి దగా చేసిన దగుల్బాజీ పార్టీ బిఆర్ఎస్ ను చిత్తుగా ఓడించాలని తెలంగాణ రాష్ట్ర తొలగించబడిన 26 కులాల పోరాట సమితి అధ్యక్షులు ఆళ్ల రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమితి నేతలతో కలసి ఆళ్ల రామకృష్ణ మాట్లాడుతూ నిజాం పాలన నుండి కొన్ని దశాబ్దాలుగా తెలంగాణాలో కొన్ని ఆంధ్ర ప్రాంతానికి చెందిన అణగారిన బీసీ కులాలు తమ జీవనం కొనసాగిస్తున్నాయని, ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత తరతరాలుగా తెలంగాణాలో నివసిస్తున్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన అత్యంత వెనుకబడిన 26 బీసీ కులాలను సీఎం కెసిఆర్ వివక్షపూరితంగా తెలంగాణ బీసీ కుల జాబితా నుండి తొలగించి అన్యాయం చేసాడని అయన ఆరోపించారు. తొలగించిన 26 బీసీ కులాల ప్రజలు గత 10 సంవత్సరాల నుండి విద్య, ఉపాధి, ఉద్యోగ పరంగా తీవ్రంగా నష్ట పోయారని అయన తెలిపారు. బీసీల జాబితా నుండి తొలగించిన 26 కులాలను రాజకీయ పార్టీలు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి చేర్చుతామని హమీ ఇచ్చి తమ మానిఫెస్టోలో చేర్చితే ఆ పార్టీలకు ఓటు వేసి గెలిపిస్తామన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ జాబితా నుండి తొలగించిన 26 కులాలను తిరిగి జాబితాలో చేర్చుతామని ఇప్పటికే పలుమార్లు పలువురు కాంగ్రెస్ నేతలు ప్రకటించారన్నారు. జనాభా లెక్కల్లో కులగణన చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రతి నియోజక వర్గంలో గెలిపిస్తామన్నారు. ఈ సమావేశంలో సమితి ప్రధాన కార్యదర్శి పివివి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు చొల్లంగి ప్రసాద్, ఎం.ఆర్.కె.రెడ్డి, జాయింట్ సెక్రటరీ చిత్తూరి వేణు, కార్యవర్గ సభ్యులు ఎస్.వెంకటేశ్వర్ రావు, మురళిధర్, కె.రామకృష్ణ, జల్లు హేమసుందర్ రావు, కె.వెంకట్ నాయుడు, టి.శ్రీనివాస్ రావు, జి.విజయ్ కుమార్ పాల్గొన్నారు..

Leave a Reply