Take a fresh look at your lifestyle.

సిద్ధిపేట టు సికింద్రాబాద్‌ ‌రైలు వర్చువల్‌గా ప్రారంభించిన మోదీ

  • సిద్ధిపేటలో జెండా ఊపి రైలును ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు
  • దుద్దెడ వరకు రైలులో మంత్రి ప్రయాణం
  • సిద్ధిపేట రైల్వే స్టేషన్‌ ‌వద్ద ఉద్రిక్తత..బిఆర్‌ఎస్‌, ‌బిజెపి శ్రేణులు పోటా పోటీ నినాదాలు…ఘర్షణఎగిరిన
  • కుర్చీలు, పలువురికి గాయాలు
సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3 : ‌సిద్ధిపేట ప్రజల చిరకాల స్వప్నం సాకారమయింది. మంగళవారం  సిద్ధిపేట టు సికింద్రాబాద్‌(‌మనోహరాబాద్‌) ‌రైలును మంగళవారం దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిజామాబాద్‌ ‌నుండి వర్చువల్‌గా ప్రారంభించగా…సిద్ధిపేటలో మంత్రి తన్నీరు హరీష్‌రావు జెండాను ఊపి రైలును ప్రారంభించారు. రైలును ప్రారంభించడమే కాకుండా దుద్దెడ వరకు మెదక్‌ ఎం‌పి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌, ‌మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సేన్‌తో పాటు స్థానిక బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రజాప్రతినిధులు, శ్రేణులతో కలిసి ప్రయాణించారు. రైలు ప్రారంభం సందర్భంగా సిద్ధిపేట రైల్వే స్టేషన్‌లో గులాబీ శ్రేణులు సంబురాలు చేయగా…ప్రజలతో కోలాహలంగా రైల్వే స్టేషన్‌ ‌మారింది. సిద్ధిపేటలో రైలు కూత మోగడంతో సిద్ధిపేట ప్రాంత ప్రజల దశాబద్దాల  కల సిఎం కేసీఆర్‌, ‌మంత్రి హరీష్‌రావు నెరవేర్చారాంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే, రైలు ప్రారంభం సందర్భంగా బిజెపి పార్టీకి చెందిన దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు సిద్ధిపేట నుండి మనోహరాబాద్‌ ‌వరకు సిద్ధిపేట, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన బిజెపి నేతలతో కలిసి ప్రయాణించారు.
పోటాపోటీగా నినాదాలు..సిద్ధిపేట రైల్వేస్టేషన్‌ ‌వద్ద ఉద్రిక్తత
సిద్ధిపేట టు సికింద్రాబాద్‌ ‌రైలు ప్రారంభం సందర్భంగా సిద్ధిపేట రైల్వే స్టేషన్‌ ‌వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ప్రారంభోత్సవం కాస్త రసాభాసాగా మారింది. రైలు ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని బిఆర్‌ఎస్‌, ‌బిజెపి పార్టీకి చెందిన శ్రేణులు భారీ సంఖ్యలో సిద్ధిపేట రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాయి. మధ్యాహ్నం 3గంటలకు వర్చువల్‌గా ప్రారంభం కావల్సిన ఈ రైలు ప్రధానమంత్రి మోదీ పర్యటన గంట ఆలస్యంగా జరగడంతో  రైల్‌ ‌క్రెడిట్‌ ‌మాదంటే మాదేనని బిఆర్‌ఎస్‌, ‌బిజెపి పార్టీ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేశారు. బిజెపి నేతలు మోదీ మోదీ అంటూ నినాదాలు చేయగా…
అంతకు రెట్టింపుగా ఉన్న బిఆర్‌ఎస్‌ ‌శ్రేణులు ప్లకార్డులు పట్టుకుని సిఎం కేసీఆర్‌, ‌మంత్రి హరీష్‌రావు జిందాబాద్‌, ‌జై తెలంగాణ, జై తెలంగాణ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. బిజెపి, బిఆర్‌ఎస్‌ ‌పార్టీల శ్రేణులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ తోసుకున్నారు. కుర్చీలు లేచాయి. బిజెపి, బిఆర్‌ఎస్‌ ‌పార్టీల శ్రేణులు ఒకరిపై మరొకరు కుర్చీలు విరుసుకుకోగా కుర్చీలు విరగడంతోపాటు పలువురు గాయపడ్డారు. బిజెపి, బిఆర్‌ఎస్‌ ‌పార్టీ శ్రేణుల తోపులాటలో ఒకరిద్దరు పోలీసులు కూడా గాయపడ్డారు. పోలీసులు బిజెపి, బిఆర్‌ఎస్‌ ‌పార్టీ శ్రేణులను నిలువరించే ప్రయత్నం చేశారు. అనంతరం రైలు సికింద్రాబాద్‌కు బయలుదేరింది. దుద్దెడ, లకుడారం, కొడకండ్ల, గజ్వేల్‌, ‌బేగంపేట, నాచారం, మనోహరాబాద్‌ ‌తదితర స్టేషన్లలో బిజెపి, బిఆర్‌ఎస్‌ ‌పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. స్వీట్లు పంచుకున్నారు.

Leave a Reply