పెద్దపల్లి గడ్డపై ‘పెద్దన్న’గా నిలిచేదెవరో…

  • సింగరేణి అండ..ఎవరికో పూదండ
  • బొగ్గు గని కార్మికులే గెలుపు ఓటముల నిర్ణేతలు
  • పెద్దపెల్లి అసెంబ్లీ నియోజకవర్గ ముఖచిత్రం

పెద్దపల్లి, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, ధర్మపురి, రామగుండం, మంథని శాసనసభ నియోజకవర్గాలు ఉన్న పెద్దపల్లి లోకసభ నియోజకవర్గ పరిధిలో 15 లక్షల 94 వేల 392 వోట్లు ఉన్నాయి. ఇటీవల జరిగిన 2023 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ మొత్తం ఈ ఏడు నియోజకవర్గాల పరిధిలో 6 లక్షల 82 వేల 33 వోట్లు సాధించింది. బిఆర్‌ఎస్‌ పార్టీకి 3 లక్షల 36 వేల 374 వేల వోట్లు ..ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో డిపాజిట్‌ గల్లంతయిన  బిజెపికి  79 వేల 418
వోట్లు మాత్రమే వొచ్చాయి.

2023 శాసనసభ ఎన్నికలలో పార్టీలు పొందిన వోట్లు
6,82,033
కాంగ్రెస్‌

3,36,374
బిఆర్‌ఎస్‌

79,418
బీజేపీ

 
పెద్దపల్లి(జగిత్యాల), ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 24 : విప్లవ వీరులను అందించిన పెద్దపల్లి లోకసభ స్థానానికి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. వామపక్ష ఉద్యమానికి ఊపిరిలూదిన సోదరులు కిషన్‌ జి వర, మల్లోజుల కోటేశ్వరరావు, మల్లోజుల వేణుగోపాల రావు పెద్దపెల్లి బిడ్డలే …వీరే కాకుండా అనేకమంది అగ్ర నేతలుగా ఎదిగారు. సింగరేణి బొగ్గు గనులు, పచ్చని పొలాలు, తెలంగాణ సాగు దశను మార్చే కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు, ఎన్టీపీసీ, సిమెంట్‌ పరిశ్రమలు, యూరియా కర్మాగారం..ధర్మపురి, కాళేళ్వరం వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు నెలవు పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం. నైసర్గికంగా కాకుండా రాజకీయంగానూ విభిన్నత, వైవిధ్యం దీని సొంతం. తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువైన ఈ నియోజకవర్గం ఇచ్చే తీర్పుపై ఆసక్తి నెలకొంది.
పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నియోజకవర్గం కాకా ఫ్యామిలీకి కంచుకోట కాగా, గత రెండు పర్యాయాలు కారు జోరు చూపించింది. ఈసారి కారు జోరుకు బ్రేకులు వేసేందుకు హస్తం పార్టీ కాకా మనవడు, ప్రస్తుత చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ తనయుడు గడ్డం వంశీకృష్ణను పెద్దపెల్లి లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపింది. బీఆర్‌ఎస్‌ కూడా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను బరిలోకి దింపగా, బిజెపి పార్టీ కూడా గోమాస శ్రీనివాస్‌ను రంగంలోకి దించింది. దీంతో ఈ నియోజకవర్గంలో పోరు ఆసక్తికరంగా మారింది. ఈసారి ఎలాగైనా పూర్వ వైభవాన్ని సాధించాలని హస్తం పార్టీ కసితో పనిచేస్తుండగా..అధికార పార్టీకి ధీటుగా బీఆర్‌ఎస్‌ మరోవైపు బిజెపి వ్యూహ ప్రతి వ్యూహాలతో ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి లోకసభ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. సింగరేణి కార్మికుల ప్రభావం అధికంగా ఉండే ఈ సెగ్మెంట్లో గత పదేళ్లుగా బీఆర్‌ఎస్‌ పార్టీదే హవా కొనసాగుతుంది.
గత పదేళ్ల క్రితం వరకు కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ పెద్దపల్లి నియోజకవర్గాన్ని భారీ విక్టరీతో తన ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తుంది. మరోవైపు బిజెపి కూడా ప్రధాని మోదీ చెరిస్మాతో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తుంది. మొత్తానికి మూడు పార్టీలు కూడా తగ్గేదిలే అన్నట్లుగా ఎత్తుకు పైఎత్తులతో రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నాయి. పెద్దపెల్లి, మంచిర్యాల, జగిత్యాల నియోజకవర్గం పరిధిలో విస్తరించిన ఈ లోకసభ నియోజకవర్గం పరిధిలో పెద్దపెల్లి, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, ధర్మపురి, రామగుండం, మంథని శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. పెద్దపల్లి లోక్‌ సభ నియోజకవర్గ పరిధిలో 15 లక్షల 94 వేల 392 వోట్లు ఉన్నాయి.  వీరిలో పురుషులు 7 లక్షల 87 వేల 140  కాగా, మహిళల వోట్లు 8 లక్షల 5 వేల 755 ఉన్నాయి. పురుషుల కన్నా 18 వేల 615 మహిళల వోట్లు ఎక్కువగా ఉన్నాయి.
ఇటీవల జరిగిన 2023 శాసన సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ ఈ ఏడు శాసనసభ స్థానాలను క్లీన్‌ స్వీప్‌ చేసింది. మొత్తం ఈ ఏడు నియోజకవర్గాల పరిధిలో 6 లక్షల 82 వేల 33 వోట్లు సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించింది కాంగ్రెస్‌ పార్టీ. కాగా ప్రధాన ప్రతిపక్షం బిఆర్‌ఎస్‌ పార్టీకి 3 లక్షల 36 వేల 374 వేల వోట్లు వొచ్చాయి. గతంలో బీఆర్‌ఎస్‌ పార్టీ హవా కొనసాగిన పెద్దపల్లిలో గత శాసనసభ ఎన్నికల్లో పూర్తి రివర్స్‌ ఫలితాలు వొచ్చాయి. ఈసారి ఎలాగైనా గెలవాలని కలలుగంటున్న బిజెపికి గత శాసనసభ ఎన్నికల్లో ఏడు శాసన సభ నియోజకవర్గాల పరిధిలో 79 వేల 418 వోట్లు మాత్రమే వొచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఏకపక్ష విజయాలను సాధించగా, పార్లమెంట్‌ ఎన్నికల నాటికి పరిస్థితిలో మార్పు వొచ్చిందనే ఆశతో ప్రతిపక్ష పార్టీలు పోటీకి రెడీ అవుతున్నాయి. సిట్టింగ్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ బోర్లకుంట వెంకటేష్‌ నేత కాంగ్రెస్‌ పార్టీలో చేరగా, సీనియర్‌ నేత మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇచ్చి రంగంలోకి దించింది. ఇక ఎప్పటి నుండో ఎంపీ కావాలని కలలు కంటున్న గోమాస శ్రీనివాస్‌ను బరిలోకి దింపింది బిజెపి. ఇక ఈ రెండు పార్టీలకు ధీటుగా ఆర్థిక బలం..రాజకీయ నేపథ్యం ఉన్న కాకా మనవడు, చెన్నూరు శాసనసభ ఎమ్మెల్యే వివేక్‌ తనయుడు గడ్డం వంశీకృష్ణను ఈ స్థానం నుండి కాంగ్రెస్‌ పార్టీ బరిలోకి దించింది.
పెద్దపెల్లి నియోజకవర్గ పరిధిలో సింగరేణి, ఆర్‌ఎఫ్‌సిఎల్‌, ఎన్‌టిపిసి, సిమెంటు పరిశ్రమలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో సింగరేణి కార్మికులు వారి కుటుంబ సభ్యులే గెలుపు ఓటమి లను ప్రభావితం చేస్తారు. ప్రస్తుతం ఈ లోక్‌ సభ నియోజకవర్గ పరిధిలో ఏడు శాసనసభ సెగ్మెంట్లలో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఉండటంతో ఆ పార్టీలో గెలుపు ధీమా ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ దూకుడుకు కళ్లెం వేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ పక్కా స్కెచ్‌ వేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే టార్గెట్‌తో సీనియర్‌ నాయకులు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు టికెట్‌ ఇచ్చింది బీఆర్‌ఎస్‌ పార్టీ. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కొప్పుల ఈశ్వర్‌ అనూహ్యంగా గత ఎన్నికల్లో ధర్మపురి శాసన సభ నియోజకవర్గ స్థానం నుండి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి అడ్డూరి లక్ష్మణ్‌ కుమార్‌ చేతిలో ఓడిపోయారు. సింగరేణి కార్మికుడైన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు పెద్దపల్లి లోక్‌ సభ నియోజకవర్గ పరిధిలో బంధు వర్గం, మిత్రులు, అనుచర వర్గం భారీగా ఉంది. గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన మేడారం నియోజకవర్గ పరిధిలో భాగమైన రామగుండం, ధర్మపురి నియోజకవర్గంలో అభిమానులు ఉన్నారు.
దీంతో కోల్‌ బెల్టు వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి వోటు బ్యాంకు బలంగా ఉండటంతో గెలుపుపై ఆశలు పెట్టుకుంటుంది. తనకున్న విస్తృత పరిచయాలు తనను గెలిపిస్తాయని నమ్మకంతో బిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ ధీమాగా ఉన్నారు. ఈ ఏడు నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్‌ పార్టీ బలంతో హస్తం జెండా ఎగరేస్తామని కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ బలంగా నమ్ముతున్నారు. బలమైన ఆర్థిక నేపథ్యం..ఘనమైన రాజకీయ వారసత్వం ఉన్న గడ్డం వంశీకృష్ణకు కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఖరారు చేసి అసెంబ్లీ ఎన్నికల ఊపును కొనసాగిస్తామని కాంగ్రెస్‌ అంటుంది. చెన్నూర్‌ ఎమ్మెల్యే వివేక్‌ తనయుడైన వంశీకృష్ణ తన తాత దివంగత నేత గడ్డం వెంకటస్వామి రాజకీయ వారసత్వానికి తోడుగా..కాంగ్రెస్‌ పార్టీ హయాంలోనే ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగిందని ప్రచారం చేసుకుంటున్నారు. తన తాత, తండ్రి ఇద్దరూ ఈ నియోజకవర్గ ఎంపీలుగా ఉండటంతోనే అప్పట్లో వాళ్ళు తెచ్చిన పథకాలు, నిధులతోనే స్పష్టమైన ముద్ర వేశారని గడ్డం వంశీ చెబుతున్నారు.
ఇటీవల జరిగిన సింగరేణి ఎన్నికలలో కాంగ్రెస్‌ అనుబంధ యూనియన్‌ గుర్తింపు సంఘంగా గెలవడం కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్‌గా చెబుతున్నారు. ఇదే సమయంలో బిజెపి అభ్యర్థి గోమాస శ్రీనివాస్‌ చీల్చే వోట్లు కూడా ఈ నియోజకవర్గంలో కీలకంగా మారాయి. 1993 నుండి కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగిన గోమాత శ్రీనివాస్‌ 2009లో కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డారు. అప్పట్లో టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 2 లక్షల 64 వేల 731 వోట్లు సాధించారు. ఈ ఎన్నికల్లో ఓటమి తర్వాత బిఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ పార్టీలోకి వొచ్చిన గోమాస మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు శాసనసభ నియోజకవర్గ స్థానాన్ని ఆశించారు. టికెట్టు దక్కకపోవడంతో అసంతృప్తితో కాంగ్రెస్‌ పార్టీని వీడి బిజెపి పార్టీలో చేరారు. పార్లమెంట్‌ పరిధిలో 15 లక్షల 94, వేల 392 వోట్లు ఉండగా, అందులో గోమాస శ్రీనివాస్‌ సామాజిక వర్గమైన మహావీర్‌ నేతకాని వోట్లు 2 లక్షల 25 వేల 875  ఉన్నాయి. ఈ వోటు బ్యాంకు తనకు కలిసి వొస్తుందని గోమాస ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ సామాజిక వర్గ వోట్లతో పాటుగా, ఇతర వర్గాలకు చెందిన వోట్లను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో పడ్డారు. ప్రస్తుతం పోటీ పడుతున్న అభ్యర్థులు నేతకాని మాల సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఇందులో మాదిగ సామాజిక వర్గం ఎవరు వైపు మొగ్గు చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.
పారిశ్రామిక ప్రాంతంగా పేరుగాంచిన పెద్దపల్లి లోక్‌ సభ నియోజకవర్గం పరిధిలో ఏడు శాసన సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో ధర్మపురి, చెన్నూరు, మందమర్రి శాసనసభ స్థానాలు ఎస్సీ రిజర్వుడు కాగా, రామగుండం, మంథని, పెద్దపల్లి, మంచిర్యాల అసెంబ్లీ సెగ్మెంట్‌లతో పెద్దపల్లి లోక్‌ సభ నియోజకవర్గంలో ప్రస్తుతం 17వ సారి పార్లమెంట్‌ ఎన్నికలు జరుగుతున్నాయి. రామగుండం, బెల్లంపల్లి, చెన్నూరు, మంథని నియోజకవర్గాల్లో అత్యధికంగా సింగరేణి కార్మిక కుటుంబాలున్నాయి. అభ్యర్థుల గెలుపోటములను వీరి వోట్లే నిర్దేశిస్తాయి. సింగరేణి కార్మిక కుటుంబాలు ఏళ్లుగా ఎదురు చూస్తున్న అంశం వారసత్వ ఉద్యోగాలు. గత అసెంబ్లీ 2018 ఎన్నికల్లోనూ దీనిపై ప్రచారం చేసి టిఆర్‌ఎస్‌ వోటర్లను ఆకర్షించింది. కానీ వారసత్వ ఉద్యోగాలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో సమస్య పెండిరగ్‌లో ఉంది. దీంతో ఈ ఎన్నికల్లో ఇదే అంశాన్ని కాంగ్రెస్‌ ప్రచారాస్త్రంగా ఎంచుకుంది. గతంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు అవకాశం ఇచ్చిన వోటర్లు ఈసారి ఎలాంటి తీర్పునిస్తారో చూడాలి.
Comments (0)
Add Comment