కేసీఆర్‌ ప్రాబల్యం కొనసాగేనా ..?

మెతుకు సీమ మొనగాడు ఎవరో…?
మెదక్‌ ఎంపి సీటుపై మూడు పార్టీల గురి
సిట్టింగ్‌ సీటును కాపాడుకునే పనిలో కారు
హస్తగతానికి కాంగ్రెస్‌ పక్కా ప్లాన్‌
యూత్‌, మోదీ ఛరీష్మా, అయోధ్యపై కమలం ఆశలు

ఈలోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా మెదక్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు ఉన్నారు. మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల్కెన పటాన్‌చెరు, నర్సాపూర్‌, గజ్వేల్‌, సంగారెడ్డి, సిద్ధిపేట, దుబ్బాకలలో బిఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ లోక్‌ సభ నియోజక వర్గంలో   18లక్షల పై చిలుకు వోటర్లు ఉన్నారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన కొత్త ప్రభాకర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌పై 3లక్షల పై చిలుకు వోట్ల మెజారిటీతో గెలిచాడు.గత 2023 శాసన సభ ఎన్నికల్లో ఏడు శాసన సభ నియోజక వర్గాల్లో మొత్తంగా  భారత్‌ రాష్ట్ర సమితి 6,68,955 వోట్లు ,కాంగ్రెస్‌ పార్టీ 4,20,881మరియు భారతీయ జనతా పార్టీ 2,10,626 వోట్లు పొందాయి.
సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 22: వొచ్చే నెల 13న జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలుకు మరో రెండ్రోజులు మాత్రమే మిగిలింది. పార్లమెంటు ఎన్నికలకు ప్రధాన పార్టీలు కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌, బిజెపి పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మెతుకు సీమ విషయానికి వొస్తే మెదక్‌ ఎంపి స్థానం నుండి అధికార కాంగ్రెస్‌ పార్టీ తరపున నీలం మధు ముదిరాజ్‌, బిఆర్‌ఎస్‌ పార్టీ తరపున పరుపతి వెంకట్రామరెడ్డి, భారతీయ జనతా పార్టీ తరపున మాధవనేని రఘునందన్‌రావు ఎన్నికల బరిలో ఉన్నారు. దేశ రాజకీయాల్లో అందునా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మెదక్‌ లోక్‌సభ స్థానంకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మెదక్‌ ఎంపిగా దివంగత ఇందిరాగాంధీ పోటీ చేసి దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. దీంతో మెదక్‌ లోక్‌సభ స్థానంకు ప్రత్యేక స్థానం ఉండటంతో మూడు ప్రధాన పార్టీల్కెన కాంగ్రెస్‌, బిజెపి, బిఆర్‌ఎస్‌ పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది. ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా ఉన్న మెదక్‌ పార్లమెంటులో బిజెపి, బిఆర్‌ఎస్‌ పార్టీలు సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించాయి.
 తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన తర్వాత  ఆలే నరేంద్ర, సినీ నటి ఎం.విజయశాంతి అలియాస్‌ రాములమ్మ, కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి(రెండు పర్యాయాలు)ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. సుమారుగా 25ఏళ్లుగా మెదక్‌ ఎంపిగా కాంగ్రెస్‌ అభ్యర్థి లేరు. బిజెపి, బిఆర్‌ఎస్‌ పార్టీల అభ్యర్థులే ఎంపిలుగా గెలుస్తున్నారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉండడంతో ఎలాగైనా ఈసారి మెదక్‌ను హస్తగతం చేసుకుని తీరాలన్న గట్టి పట్టుదలతో ఆ పార్టీ నాయకత్వం ఉంది. ముఖ్యమంత్రి, టిపిసిసి చీఫ్‌ ఎనుముల రేవంత్‌రెడ్డి కూడా మెదక్‌ ఎంపి సీటుపై ప్రత్యేక ఫోకస్‌ను పెట్టారు. బిఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సొంత జిల్లా కావడమే కాకుండా, బిఆర్‌ఎస్‌కు సిట్టింగ్‌ సీటు కావడంతో కూడా ఎలాగైనా ఈ సీటును తిరిగి కైవసం చేసుకునేందుకు కేసీఆర్‌తో పాటు, బిఆర్‌ఎస్‌ పార్టీలో ట్రబుల్‌ షూటర్‌, మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అన్నీ తాన్కె మెదక్‌ పార్లమెంటు పరిధిలో పార్టీ ఎంపి అభ్యర్థి పి.వెంకట్రామరెడ్డి గెలుపు కోసం సర్వశక్తులొడ్డి పని చేస్తున్నాడు. ఇక బిజెపి అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు ప్రచారాన్ని ముమ్మరం చేశాడు. గతంలో ఎంపిగా పోటీ చేసి ఓడిపోయిన రఘునందన్‌రావు ఈసారి ఎలాగైనా గెలిచి పార్లమెంటుకు వెళ్లేందుకు యూత్‌ వోట్లపై ఆశలుపెట్టుకున్నట్లు కనిపిస్తుంది. ఈసారైనా దక్కించుకోకవడానికి ఎంపి అభ్యర్థి రఘునందన్‌రావుతో పాటు పార్టీ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.  1952లో మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడిరది. 2008లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా సిద్ధిపేట లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ స్థానాలు ఇందులో కలిశాయి. మాజీ ప్రధానమంత్రి, దివంగత ఇందిరాగాంధీతో పాటు మల్లిఖార్జున్‌, బాగారెడ్డి వంటి ఉద్దండ రాజకీయ నాయకులు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.  మెదక్‌ పార్లమెంటు పరిధిలో సంగారెడ్డి, పటాన్‌చెరు, మెదక్‌, నర్సాపూర్‌, గజ్వేల్‌, దుబ్బాక, సిద్ధిపేట మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా…18లక్షల పై చిలుకు వోటర్లు ఉన్నారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన కొత్త ప్రభాకర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌పై 3లక్షల పై చిలుకు వోట్ల మెజారిటీతో గెలిచాడు.గత 2023 శాసన సభ ఎన్నికల్లో ఏడు శాసన సభ నియోజక వర్గాల్లో మొత్తంగా  భారత్‌ రాష్ట్ర సమితి 6,68,955 వోట్లు ,కాంగ్రెస్‌ పార్టీ 4,20,881మరియు భారతీయ జనతా పార్టీ 2,10,626 వోట్లు పొందాయి.
సిట్టింగ్‌ స్థానాన్ని కైవసం చేసుకునేలా…
మెదక్‌…బిఆర్‌ఎస్‌ పార్టీకి సిట్టింగ్‌ స్థానం. 2004నుండి మొదలుకుని నేటి వరకు మెదక్‌ పార్లమెంటు అభ్యర్థిగా టిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులే వరుసగా గెలుస్తూ వొస్తున్నారు. మెదక్‌ ప్రస్తుత సిట్టింగ్‌ ఎంపిగా ఉన్న కొత్త ప్రభాకర్‌రెడ్డి 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందాడు. దీంతో ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్సీ, సిద్ధిపేట జిల్లా మాజీ కలెక్టర్‌, రిట్కెర్డ్‌ ఐఏఎస్‌ అధికారి పరుపతి వెంకట్రామరెడ్డి(పివిఆర్‌)కి పార్టీ ట్రబుల్‌ షూటర్‌, మాజీమంత్రి తన్నీరు హరీష్‌రావు సూచన మేరకు పార్టీ అధినేత కేసీఆర్‌ అవకాశం ఇచ్చారు. ఈ లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా మెదక్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు ఉన్నారు. మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల్కెన పటాన్‌చెరు, నర్సాపూర్‌, గజ్వేల్‌, సంగారెడ్డి, సిద్ధిపేట, దుబ్బాకలలో బిఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బిఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌, పార్టీలో ట్రబుల్‌ షూటర్‌, మాజీమంత్రి తన్నీరు హరీష్‌రావు సొంత జిల్లా కావడం..బిఆర్‌ఎస్‌కు సిట్టింగ్‌ స్థానం కావడంతో ఎలాగైనా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే గట్టి పట్టుదలతో ఆ పార్టీ అధినాయకత్వం ఉంది. ఇప్పటికే ఎంపి అభ్యర్థి పివిఆర్‌కు మద్దతుగా పార్టీ అధినేత కేసీఆర్‌ జోగిపేటలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఇక మాజీమంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నీ తాన్కె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాడు. హరీషే అభ్యర్థి అన్నట్లుగా అన్నింటిని తన భుజ స్కందాలపై వేసుకుని రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాడు. ఇప్పటికే మెదక్‌ పార్లమెంటు వ్యాప్తంగా ఎన్నికల సన్నాహాక సమావేశాలను నిర్వహించి పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తున్నాడు. అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ  మెదక్‌ పార్లమెంటు పరిధిలో సుడిగాలి పర్యటను నిర్వహిస్తున్నాడు.
పార్టీ ఎంపి అభ్యర్థి వెంకట్రామరెడ్డి కూడా వోటర్లను ఆకట్టుకునేందుకు 100కోట్ల రూపాయలతో పివిఆర్‌ ట్రస్టును స్థాపించి పార్టీకి చెందిన నిరుపేదలకు ఉచిత విద్య, వైద్యను అందించడంతో పాటు పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏడు ఫంక్షన్‌ హాల్స్‌ను ఒక్కో ఫంక్షన్‌ హాలును 2కోట్ల రూపాయలతో నిర్మించి పార్టీ శ్రేణులకు ఒక రూపాయికి ఇచ్చేలా చేస్తానంటూ చెబుతూ తనద్కెనశ్కెలిలో ప్రచారంలో దూసుకెళ్తున్నాడు. ఈ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకుగానూ ఆరింటిలో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తుండటం, మాజీమంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నీ తాన్కె ప్రచారం నిర్వహిస్తుండటం..బిఆర్‌ఎస్‌కు  ప్లస్‌ పాయింట్‌ కాగా, వెంకట్రామరెడ్డి సిద్ధిపేట జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్ల నిర్మాణానికి రైతుల నుండి బలవంతంగా వేల ఎకరాల భూములు గుంజుకున్నాడనీ, పోలీసుల లాఠీలతో కొట్టించి వేలాది కుటుంబాలను రోడ్డున పడేసిన వెంకట్రామరెడ్డికి వారి ఉసురు తగులుతుందంటూ కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు అస్త్రంగా చేసుకుని ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ప్రాజెక్టుల నిర్మాణానికి భూములు బలవంతంగా గుంజుకోవడం అనేది బిఆర్‌ఎస్‌ ఎంపి అభ్యర్థి వెంకట్రామరెడ్డికి కొంత మైనస్‌ పాయింట్‌ కావచ్చని తెలుస్తుంది.
హస్తగతానికి…కాంగ్రెస్‌ పక్కా ప్లాన్‌తో ముందుకు…
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ మెదక్‌ పార్లమెంటు సీటును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అభ్యర్థి ఎంపిక మొదలుకుని అన్నీ ఒక ప్లాన్‌ ప్రకారమే ముందుకెళ్తుంది. బిజెపి, బిఆర్‌ఎస్‌ పార్టీలు అగ్రవర్ణాలకు చెందిన అభ్యర్థులను నిలబెడితే…కాంగ్రెస్‌ మాత్రం బిసి వర్గానికి చెందిన  నీలం మధు ముదిరాజ్‌ను ఎంపిక చేసింది. రాష్ట్రంలో అత్యధిక జనాభ, వోట్లు ఉన్న బిసి సామాజిక వర్గానికి చెందిన ముదిరాజ్‌ కులానికి చెందిన మధును నిలబెట్టడం ద్వారా బిసిలకు కాంగ్రెస్‌ పార్టీ ఎంతగా ప్రాధాన్యతను ఇస్తుందో చెప్పకనే చెప్పే ప్రయత్నం చేసింది. మాజీ ప్రధానమంత్రి, దివంగత ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్‌ నుండి మధును గెలిపించి సోనియా, రాహుల్‌కు బహుమానంగా ఇస్తామని ఇప్పటికే సిఎం రేవంత్‌రెడ్డి, టిపిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంటు జగ్గారెడ్డి, మంత్రులు దామోదర రాజనర్సింహా, కొండా సురేఖ ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ హయాంలోనే మెదక్‌కు ఆర్డినెన్స్‌, బిహెచ్‌ఈఎల్‌, బిడిఎల్‌ తదితర పరిశ్రమలు వచ్చాయనీ తద్వార వేలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాన్ని కల్పించామనీ,  2004నుంచి నేటి వరకు బిఆర్‌ఎస్‌ ఎంపి అభ్యర్థులు ఉన్నప్పటికీ మెదక్‌కు చేసిందేమీ లేదనీ, పదేళ్లు కేసీఆర్‌ సిఎంగా ఉన్న మెదక్‌లో కనీసం ఒక కొత్త పరిశ్రమన్కెనా తెచ్చారా?అంటూ సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడి యువత కాంగ్రెస్‌ వైపు వొచ్చే  విధంగా చేయడంలో కొంత సక్సెస్‌ అయ్యాడని చెప్పొచ్చు.
రాష్ట్రంలో మరో నాలుగున్నరేళ్లు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంటుందని, కేంద్రంలో వొచ్చేది కూడా కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వమేనని, కాంగ్రెస్‌ పార్టీ ఎంపి అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌ను గెలిపించడం ద్వారా మరిన్ని కొత్త పరిశ్రమలు తీసుకురావడమే కాకుండా, బిఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యానికి గురైన మెదక్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామంటూ సిఎం రేవంత్‌రెడ్డి మొదలుకుని పార్టీ అభ్యర్థి మధు, మంత్రులు, టిపిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంటు జగ్గారెడ్డి వరకు ప్రచారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు. మరోవైపు బిఆర్‌ఎస్‌ పార్టీలోని అసంతృప్త నేతలకు కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుతున్నారు. సిఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులుగా పేరున్న నర్సాపూర్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, గజ్వేల్‌కు చెందిన గంగుమల్ల ఎలక్షన్‌రెడ్డి తదితరులను కాంగ్రెస్‌లో చేర్పించుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు మరో నాలుగున్నరేళ్లు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంటుందని, అభివృద్థి తమతోనే సాధ్యమవుతుందని ప్రజలకు నచ్చచెబుతూ లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. మధుకు మద్దతుగా మెదక్‌లో కార్నర్‌ మీటింగ్‌ పెట్టిన సిఎం రేవంత్‌రెడ్డి…సిద్ధిపేట, సంగారెడ్డిలలో ఏద్కెనా ఒక అసెంబ్లీ సెగ్మెంట్‌లో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో  భారీ  బహిరంగ సభకు ప్లాన్‌ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వివరించాయి. ఇదిలా ఉంటే, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉండడం, బిఆర్‌ఎస్‌ అసంతృప్తులు కాంగ్రెస్‌లో చేరడం.. ఎంపి అభ్యర్థిగా బిసి సామాజిక వర్గమైన ముదిరాజ్‌ అయిన మధును అభ్యర్థిగా ఎంపిక చేయడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశాలుగా కనబడుతున్నాయి.
యూత్‌, మోదీ, అయోధ్యపై కమలం ఆశలు…
కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశగా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తోంది. 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఎంపిగా పోటీ చేసి ఓడిపోయిన మాధవనేని రఘునందన్‌రావు..మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుటున్నాడు. దుబ్బాక నియోజకవర్గంలోని బొప్పాపూర్‌కు చెందిన రఘునందన్‌రావు తనను గెలిపిస్తే ప్రశ్నించే, ప్రజా గొంతుకగా పార్లమెంటులో మెదక్‌ సమస్యలను లేవనెత్తుతానంటూ…బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలపై  తనద్కెనశ్కెలిలో  తూటల్లాంటి మాటలతో విరుచుకుపడుతున్నాడు.  బిఆర్‌ఎస్‌ పార్టీ ఎంపి అభ్యర్థి వెంకట్రామరెడ్డి సిద్ధిపేట జిల్లా కల్టెర్‌గా పని చేసిన హయాంలో ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నిర్మాణాల పేరిట రైతుల నుండి బలవంతంగా వేలాది ఎకరాల భూములు గుంజుకున్నాడనీ, వేలాది కుటుంబాలను రోడ్డున పడేశాడనీ, స్థానికేతరుడ్కెన వెంకట్రామరెడ్డికి ఎంపి టికెట్‌ ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నాడు. ఎంపిగా పోటీ చేసే ఒక తెలంగాణ ఉద్యమకారుడు కూడా మెదక్‌ జిల్లాలో బిఆర్‌ఎస్‌ పార్టీకి ఎంపి అభ్యర్థిగా దొరకలేదా అని బిఆర్‌ఎస్‌ను ఇరుకనపెట్టేలా మాట్లాడుతున్నాడు. వెంకట్రామరెడ్డి ఏర్పాటు చేస్తానని ప్రకటించిన పివిఆర్‌ ట్రస్టు గురించి కూడా రఘునందన్‌రావు పలు ఆరోపణలు చేశాడు. తనను గెలిపిస్తే కేంద్రం నుండి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానంటూ వోట్లు అభ్యర్థిస్తున్న రఘునందన్‌రావు…యువత, ప్రధానమంత్రి మోదీ ఛరీష్మా, అయోధ్య ఆలయంపై పూర్తి ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. ఏది ఏమైనా వొచ్చే నెలలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో మెదక్‌ ఎంపి స్థానాన్ని గెలవడానికి కాంగ్రెస్‌, బిజెపి, బిఆర్‌ఎస్‌ మూడు పార్టీల అభ్యర్థులు, అగ్ర నాయకులు, కార్యకర్తలు తీవ్రంగానే శ్రమిస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి మెతుకు సీమ మొనగాడు ఎవరో… చూడాలి మరి!
Comments (0)
Add Comment