గృహమే కదా స్వర్గసీమ..!

నేడు ‘అంతర్జాతీయ కుటుంబ దినం’

భూకుగ్రామానికి పునాదులు కుటుంబాలు. వసుదైక కుటుంబ సౌభాగ్యానికి సకల మూలాలు కుటుంబాలు. అమ్మనాన్నలు, కుటుంబం లేని వారుండరు. కుటుంబం అంటే నాలుగు గోడల నడుమ ఉన్న గదులు కాదు. ప్రేమానురాగాల సిమెంటుతో కట్టిన పొదరిల్లు. కుటుంబం అంటే నవ్వులు, అనుబంధాలు, ఆప్యాయతలు, బాధలు, బాధ్యతలు, హక్కులు, సంతోషాల కుప్పలు, గాయాలకు లేపనాలు, సవాళ్ళకు సమాధానాలు, శారీరక మానసిక వికాస సోపానాలు, కష్టసుఖాల సమతుల్యతలు, అమ్మ లాలనలు, నాన్న నిర్దేశాలు, సమాజాభివృద్ధికి మూల స్తంభాలు.నాటి నుంచి నేటి వరకు కుటుంబాలు కాలక్రమంలో పెను మార్పులకు లోనవుతూ ఉన్నప్పటికీ కుటుంబానికి ప్రత్యామ్నాయం లేదు. ఉమ్మడి కుటుంబాలు అంతరిస్తూ న్యూక్లియర్‌ ‌ఫామిలీలు వెలుస్తున్నాయి. డిజిటల్‌ ‌యుగంలో కుటుంబం అంటే అమ్మనాన్న, ఒకరిద్దరు పిల్లలుగా కుచించుకు పోయింది. నాన్న నాయకత్వం, అమ్మ అమృత హస్తం నీడన ఎదిగిన పిల్లలు జాతిరత్నాలు అవుతారు. అమ్మనాన్ననలను గౌరవించక, అపహాస్యం చేసే పిల్లలు చరిత్ర హీనులు అవుతారు. ఆది గురువులుగా తల్లితండ్రులు పిల్లల మనసుల్లో మానవీయ విత్తులు నాటుతారు. సంతోషాలతో నిండిన గృహాలు దేశాభివృద్ధికి గీటురాళ్ళు. అస్థిర కుటుంబాలు అశాంతికి నెలవులు. సమాజ దేహానికి కుటుంబాలే అస్థిపంజర పటిష్ట వ్యవస్థలు, కుటుంబ సభ్యులే అవయవాలు.ఇండియాలో పితృస్వామ్య కుటుంబ వ్యవస్థ నెలకొని ఉంటూ ఆర్థిక స్థితిని బట్టి ధనిక, మధ్య తరగతి, పేదరిక కుటుంబాలుగా వర్గీకరించబడి ఉన్నాయి. .

ప్రపంచ మానవాళి సమగ్రాభివృద్ధిలో కుటుంబాల ప్రాధాన్యతలను గుర్తించిన ఐక్యరాజ్యసమితి 1994లో ‘అంతర్జాతీయ కుటుంబ దినం (ఇంటర్నేషనల్‌ ‌ఫామిలి డే)’ను ప్రతి ఏటా 15 మే రోజున పాటించుటకు నిర్ణయం తీసుకుంది. సమాజానికి యూనిట్‌ ‌కుటుంబమని, కుటుంబ అభివృద్ధే సమాజ అభివృద్ధిని నమ్మిన ఐరాస ప్రతి ఏటా ఒక ప్రత్యేక నినాదంతో ఈ దినోత్సవాన్ని జరుపుకొనుట ఆనవాయితీగా మారింది. అంతర్జాతీయ కుటుంబ దినం – 2022 నినాదంగా ‘వన్‌ ‌డే ఆఫ్‌ ‌పీస్‌’ అనే అంశాన్ని తీసుకు న్నారు. తల్లితండ్రులు తమ పిల్లల సమగ్రాభివృద్ధికి జీవితాలను ధార పోస్తారు. చిన్నారుల శారీరక మానసిక విలాసానికి కుటుంబ వాతావరణం దోహదపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా మానవాళి ఎదుర్కొంటున్న పేదరికం, నిరక్షరాస్యత, అవిద్య, నిరుద్యోగాల వంటి సవాళ్ళను అధిగమించడానికి కుటుంబ వ్యక్తులు ప్రధాన కారకులు అవుతారు. కుటుంబ అభివృద్ధికి సాంఘీక, ఆర్థిక, జనాభా లాంటి అంశాలు ప్రభావితం చేస్తాయి. కుటుంబాన్ని బలీయం చేసినపుడు సమాజం నెలకొన్న అన్ని సమస్యలు సమిసిపోతాయి. కుటుంబ సభ్యుల్లో అమ్మనాన్నల మధ్య జీవిత బంధం, పిల్లలతో ప్రేమానురాగాల సంబంధం, పిల్లల మధ్య సోదర రక్తసంబంధాలు పటిష్టంగా నెలకొని ఉంటాయి. అంతర్జాతీయ కుటుంబ దినం వేదికగా వ్యక్తి సమగ్రాభివృద్ధిలో కుటుంబాల ప్రాధాన్యతలను వివరించడం, కుటుంబ సభ్యులు కలిసి ఆటపాటలతో సంతోషంగా గడపడం, విభేదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం లాంటివి పాటిస్తారు. సమాజాభివృద్ధికి కుటుంబమే సోపానంగా నిలుస్తుంది. కుటుంబ విచ్ఛిన్నంతో కుటుంబ సభ్యుల మనసులు విరిగినట్లు భావించాలి. ఉన్నత విలువలు, సామాజిక సంఘీభావాలకు కుటుంబ వ్యవస్థ అతి ప్రధానమైనది. కుటుంబాల ప్రగతికి ప్రభుత్వాలు కూడా ప్రధాన భూమికను నిర్వహించాలి.

భారతీయ కుటుంబ వ్యవస్థలో ఉమ్మడి కుటుంబాల సంస్కృతి ప్రధానమైనది. ఒకే కుటుంబంలో 3 – 4 తరాల సభ్యులు (తాతలు, బామ్మలు, బాబాయిలు, పిన్నులు, మనుమలు, మనుమరాండ్రు, సోదర సోదరీమణులు, బావలు, మరదులు లాంటి సమీప సంబంధీకులు) ఒకే గొడుగు కింద కుటుంబ సభ్యులుగా జీవించగలగడం ఓ అపురూప భావన. మన దేశంలో నాటి పాతరాతి యుగం నుంచి నేటి డిజిటల్‌-‌నానో యుగం వరకు కుటుంబ వ్యవస్థలో కాలానుగుణంగా వస్తున్న మార్పులతో ఉమ్మడి కుటుంబాలు, న్యూక్లియర్‌ ‌ఫామిలీలు, సరళ కుటుంబాలు భాగమై ఉన్నాయి. వీటికి తోడు నేటి ఆధునిక యుగంలో ప్రేమజంటల సహజీవనాలు, సింగిల్‌ ‌పేరంట్‌ ‌కుటుంబాలు, పిల్లలు లేని కుటుంబాలు లాంటి విపరీత వ్యవస్థలు కూడా రావడం విచారకరం. భారతీయ సగటు కుటుంబంలో 4 – 5 (కుటుంబ పరిమాణం 4.6) సభ్యులు ఉంటున్నారు.

భారతీయ కుటుంబ పుణాదులుగా విధేయత, సమగ్రత, ఐక్యత గుర్తించబడినవి. భారతదేశంలోని దాదాపు 138 కోట్ల జనాభాతో 25 కోట్ల కుటుంబాలు ఉన్నాయని అంచనా. వీటిలో 20 కోట్లు హిందూ, 3 కోట్ల ముస్లిమ్‌, 6.3 ‌మిలియన్ల క్రిస్టియన్‌, 4.1 ‌మిలియన్ల సిక్కు, 1.9 మిలియన్ల జైనులకా పాటు ఇతర మతాలకు చెందిన కుటుంబాలు ఉన్నాయి. భారత్‌లో పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, విద్య, మహిళాసాధికారత, పాశ్చాత్య ధోరిణి, వివాహ వ్యవస్థలో మార్పులు, సామాజిక విలువల్లో మార్పులు, వ్యవసాయ, గ్రామీణ పరిశ్రమలు తగ్గడం లాంటి ప్రధాన కారణాలతో కుటుంబ వ్యవస్థల్లో పెను మార్పలు వస్తున్నాయి. స్వల్ప విభేదాలతో విడిపోవడంతే సింగిల్‌ ‌ఫాదర్‌ ‌లేదా సింగిల్‌ ‌మదర్‌తో పిల్లలు ఎదగడం లాంటివని భారతీయ కుటుంబ వ్యవస్థను పరిహాసం చేస్తున్నాయి. నేటి పిల్లలే రేపటి తల్లితండ్రులని మరువరాదు. న్యూక్లియర్‌, ‌సింగిల్‌ ‌పేరంట్‌ ‌కుటుంబాలు పెరుగుతున్న డిజిటల్‌ ‌కాలంలో పిల్లలకు సామాజిక అవగాహన, పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసం జరగడం లేదు. పిల్లల్లో పేరెంట్స్ ‌పట్ల నిర్లక్ష్యం, చులకన భావం పెరిగి, అనేక దురలవాట్ల నడుమ సంఘ వ్యతిరేక శక్తులుగా మారే ప్రమాదకర దుస్థితిలో భారత సమాజం నేడు ఉన్నది. కుటుంబాలను సౌభాగ్య కోవెలలుగా, అమ్మనాన్నల్ని ఆది దేవతలుగా భావిస్తూ, భరతమాత నుదుట సంతోష తిలకం దిద్దుదాం. కుటుంబ విలువలకు కలకాలం పట్టం కడుతూ గృహాన్ని స్వర్గసీమగా మలుచుకుందాం.

Comments (0)
Add Comment