మోదీ..నీకిది తగునా..?

ప్రధాని స్థాయికి తగని వ్యాఖ్య
ప్రజాస్వామ్యం అపహాస్యమవుతుందంటున్న విపక్షాలు
ఓటమి భయంతోనే ఏదేదో మాట్లాడుతున్నాడని రాహుల్‌ విమర్శ

ఇటీవల మోదీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం లేపుతున్నాయి. ప్రధాని అంతటివాడు మాట్లాడాల్సిన మాటలేనానంటున్నాయి ప్రతిపక్షాలు. మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రధాన మంత్రి స్థాయిని దిగజార్చేవిగా ఉన్నాయని విపక్షాలు విరుచుపడుతున్నాయి. ఈ వేడి ఇప్పట్లో చల్లారేట్లు కనిపించడంలేదు. మరీ ముఖ్యంగా దేశ వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న వేళ ఇలాంటి ప్రసంగాలు ఉద్దేశ్య పూర్వకంగానే మోదీ చేశారని ఆ పక్షాలు ఆరోపిస్తున్నాయి. దేశంలో ఏడు విడుతలుగా ఎన్నికలను ఎన్నికల కమిషన్‌ నిర్వహిస్తున్నది. అయితే మొదటి విడుత ఎన్నికలు కాగానే ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేయడాన్ని చూస్తుంటే, మొదటి విడుత ఎన్నికల్లో బిజెపి ఊహించిన మేరకు వోటింగ్‌ జరిగి ఉండకపోవడంవల్లే ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఆయన చేసి ఉంటాడని రాజకీయ పరిశీలకులు కూడా భావిస్తున్నారు.

హిందువుల్లో ముస్లింల పట్ల ద్వేషభావాలను రగిలించి, హిందువుల మతాభిమానాన్ని రెచ్చగొట్టే విధంగా ఈ వ్యాఖ్యలున్నాయంటున్నారు. 2024లో 400 సీట్లను గెలుచుకోవడం లక్ష్యంగా పెట్టుకున్న నరేంద్ర మోదీ, ప్రజల ముందు కాంగ్రెస్‌ను బూచిగా చూపించే ప్రయత్నంలో భాగమే ఈ వ్యాఖ్యలని కాంగ్రెస్‌ ఆరోపిస్తున్నది. ప్రధాని అంతటి వాడు తన ప్రసంగాల్లో మతపరమైన అంశాలను చేర్చడం లౌకిక ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని ఆ పార్టీ ఆరోపిస్తున్నది. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమిపై ధ్వజమెత్తే క్రమంలో మోదీ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే తన ఆరోపణలకు మాజీ ప్రధాని మన్‌మోహన్‌ సింగ్‌ గతంలో చేసిన ప్రకటనలను ఆయన ఆధారంగా ఎత్తిచూపుతున్నారు. ముఖ్యంగా ముస్లింలనుద్దేశించి చేసిన ఆరోపణలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం లేపుతున్నది.  కాంగ్రెస్‌ అధికారంలోకి వొస్తే దేశ ప్రజల సంపదను ముస్లింలకు పంచిపెడుతుందన్నది ఆయన విమర్శల్లో ప్రధానమైనది. హిందువుల ఆస్తులను పున:పంపిణీ చేసి కొందరికి వాటిని కట్టబెడుతారంటూ, కాంగ్రెస్‌ దేశ ప్రజల ఆస్తులను లాక్కుని, తమకు ఇష్టమైన వారికి కట్టబెడుతుందనడం ఆయన స్థాయిని దిగజార్చుకోవడమేనంటున్నాయి ఆ పక్షాలు. ఇండియా కూటమి పార్టీలు అర్బన్‌ నక్సలైట్‌ మనస్థత్వం కలిగి ఉన్నాయని, ఆ పార్టీ తల్లులు, చెల్లెళ్ళ వద్ద ఉన్న బంగారాన్ని లెక్కకట్టి, వాటి సమాచారాన్ని పూర్తిగా సేకరించి ఆ తర్వాత ఆస్తి పంపిణీ చేస్తారని  ఆ విషయాన్ని కాంగ్రెస్‌ మానిఫెస్టోనే చెబుతున్నదంటూ ఆయన వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న ప్రచార సభల్లో మోదీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

దేశంలోని ఆస్తులపై ముస్లింలకు మొదటి హక్కు ఉందని, ఆ లెక్కన దేశ ప్రజల ఆస్తులను ఎక్కువ మంది పిల్లలున్న వారికి కాంగ్రెస్‌ పంపిణీ చేస్తుందని, ఆ విధంగా చొరబాటు దారులకు ఈ ఆస్తులు అందుతాయని, దాన్ని దేశ ప్రజలు ఇష్టపడతారా అని మోదీ దేశ ప్రజలను ప్రశ్నిస్తున్న తీరుపై విపక్షాలు విరుచుపడుతున్నాయి. దేశంలో నెలకొన్న సమస్యలను పక్కకుపెట్టి అబద్దాలు ప్రచారం చేయడంలో మోదీది అందె వేసిన చెయ్యి అని పక్షాలు ఆరోపిస్తుంటే, అందుకాయన మాజీ ప్రధాని మన్‌మోహన్‌ మాటలను ఊటంకిస్తున్నారు. దేశంలోని ఆస్తులపై ముస్లింలకు మోదటి హక్కు ఉంటుందని గత కాంగ్రెస్‌ ప్రభుత్వం చెప్పిందేనంటూ 2006లో మన్‌మోహన్‌సింగ్‌ చేసిన ‘ఫస్ట్‌ క్లేయిమ్‌’ వ్యాఖ్యలను మోదీ ప్రస్తావిస్తున్నారు. అయితే మన్‌మోహన్‌సింగ్‌ చేసిన ప్రకటనను మోదీ వక్రీకరించడాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా ప్రతిఘటిస్తున్నది. నిజానికి నాటి ప్రధాని మన్‌మోహన్‌సింగ్‌ మాట్లాడిరది వేరు. ఆయన జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డిసి) సమావేశంలో షెడ్యూల్‌ కులాలు, షెడ్యూల్‌ తెగలు, బీసీలు, మైనార్టీలు, మహిళలు, పిల్లల అభ్యున్నతికి దేశంలోని సంపదను కేటాయించాలన్నారన్నది కాంగ్రెస్‌ వాదన. కాగా మోదీ హయాంలో అమలవుతున్న పథకాలవల్ల దళితులు, ఓబిసి, గిరిజనులు, మైనార్టీలు, సాధారణ పేద ప్రజలకు ఎలాంటి మేలు జరుగడం లేదని కాంగ్రెస్‌ ప్రధాన నాయకుడు రాహుల్‌ గాంధీ విమర్శిస్తున్నారు. ఆయన ఓటమి భయంతో ఏదేదో మాట్లాడుతున్నాడని విమర్శిస్తున్నారు.

మోదీ మాటలు నమ్మితే కాటేస్తాడు..తస్మాత్‌ జాగ్రత్త..అంటూ హెచ్చరిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఈ పదేళ్ళ కాలంలో దేశ సంపదనంతా మోదీ కార్పోరేట్‌ దిగ్గజాలకు పంచిపెట్టాడని, మతాలు, జాతుల మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని దోచుకోవాలని చూస్తున్నాడని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు గెలుపే లక్ష్యంగా పోరాడుతున్న మోదీకి సంపూర్ణ మెజార్టీ వొస్తే భారత రాజ్యాంగాన్నే మారుస్తాడని, రిజర్వేషన్లను ఎత్తివేస్తాడంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. అలాగే బిఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ కూడా మోదీ విధానలపైన విరుచుకుపడుతున్నారు. ఈ పదేళ్ళ కాలంలో మోదీ ఆనేక నినాదాలిచ్చాడు, అవన్నీ నెరవేరాయా అంటే శూన్యమేనంటాడు. పెద్ద నోట్ల రద్దు సందర్భంగా దేశంలోని ప్రతీ ఒక్కరి ఖాతాలో 15 లక్షలు పడుతాయన్నారు. పడ్డాయా.. అంటే లేదు. అంతా బక్వాస్‌. ప్రజలను అనేక ఇబ్బందులపాల్జేసిండు. అచ్చేదిన్‌ అని సచ్చేదిన్‌ చేసిండు. ఆయన చెప్పిన మేక్‌ ఇండియా ఓ బక్వాస్‌. డిజిటల్‌ ఇండియా అయిందా? జన్‌ధన్‌ యోజన వల్ల ఏమన్నా లాభమైందా? సబ్‌కాసాథ్‌..సబ్‌ కా వికాస్‌ అన్నది సత్యనాష్‌ అంటూ ఆయన బిజెపి పాలన పట్ల  తన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

-మండువ రవీందర్‌రావు
సీనియర్‌ జర్నలిస్ట్‌

 

Comments (0)
Add Comment