తెలంగాణలో .. పెరుగుతున్న కొరోనా

  • 24 గంటల్లో 1764 కేసులు..12 మంది మృతి
  • 58,908కి చేరిన పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య

తెలంగాణలో కొరోనా వైరస్‌ ‌విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. రాష్ట్రంలో  కొత్తగా 1,764 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 58,908కి చేరింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం బుధవారం హెల్త్ ‌బులెటిన్‌ ‌విడుదల చేసింది. గత 24 గంటల్లో 18,858 శాంపిల్స్‌ను పరీక్షించినట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. కొరోనాతో మంగళవారం ఒక్క రోజే 12 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు వైరస్‌ ‌బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 492కి చేరింది. కొత్తగా వచ్చిన కేసుల్లో జీహెచ్‌ఎం‌సీ పరిధిలో 509 ఉన్నాయి. మేడ్చల్‌లో 158,నల్లగొండ51, నిజామాబాద్‌47,‌మహబూబ్‌నగర్‌47,‌పెద్దపల్లి44, వరంగల్‌ ‌రూరల్‌ 41, ‌సూర్యాపేట 38, రంగారెడ్డి147, వరంగల్‌ అర్బన్‌ 138, ‌కరీంనగర్‌ 93, ‌సంగారెడ్డి89, ఖమ్మం జిల్లాలో 69 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 43,751 మంది కోలుకోగా, ప్రస్తుతం 14,663 యాక్టివ్‌ ‌కేసులు ఉన్నాయి. ఇదిలావుంటే మహమ్మారి మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాను కూడా పూర్తిగా వణికిస్తోంది. ఇప్పటికే దాదాపు 1600 పాజిటీవ్‌ ‌కేసులతో జిల్లా అతలాకుతలమవుతోంది. ఈ నేపథ్యంలో స్వచ్చంధంగా లాక్‌ ‌డౌన్‌ అనే మాట వినిపిస్తోంది. అత్యవసరమైనప్పుడు మాత్రమే బయటకు రావాలని, సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా జనాలు పట్టించుకోవడంలేదు. షాపుల వద్ద గుమిగూడుతున్నారు.

విచ్చలవిడి•గా రోడ్లపై తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో వ్యాపారులు సమావేశమై స్వచ్ఛంద లాక్‌ ‌డౌన్‌కు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే జడ్చర్లలో ఆగస్టు 2 వరకు లాక్‌ ‌డౌన్‌ ‌ప్రకటించారు. అలాగే నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లా కేంద్రంలో బుధవారం నుంచి ఆగస్టు 8 వరకు లాక్‌ ‌డౌన్‌ ‌ప్రకటించారు. మహబూబ్‌నగర్‌ ‌జిల్లా కేంద్రంలో గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అన్నిరకాల వ్యాపార సముదాయాలు నిర్వహించి తర్వాత స్వచ్చంధంగా మూసివేయాలని వ్యాపార సంస్థల అసోసియేషన్‌ ‌నిర్ణయించింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా విజృంభిస్తున్న వైరస్‌ ఎవరినీ వదలడం లేదు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కోవిడ్‌ ‌బారినపడి కోలుకోగా తాజాగా మరో ఎమ్మెల్యేకు కొరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డికి బుధవారం వైరస్‌ ‌పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దాంతో ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో ఐసోలేషన్‌కు వెళ్లారు. కాగా,నిజామాబాద్‌ ‌రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, ‌నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణెళిష్‌ ‌గుప్తా కరోనాబారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే. ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ ‌రెడ్డి, కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద్‌గౌడ్‌ ఇటీవల కోవిడ్‌బారినపడి చికిత్స పొందుతున్నారు.

Comments (0)
Add Comment