తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్‌ రద్దు..

  • ఆ కోటా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు బదిలీ
  • భారత్‌లో కశ్మీర్‌ విలీనానికి మోదీ కృషి
  • తెలంగాణలో 12 సీట్లు ఇవ్వండి..రఘునందన్‌రావును గెలిపించండి…
  • కాంగ్రెస్‌ పార్టీకి ఏటీఎంలా తెలంగాణ
  • కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కు
  • బీజేపీ అధికారంలోకి వొస్తేనే తెలంగాణ సమగ్రాభివృద్ధి
  • సిద్ధిపేట భారీ బహిరంగ సభలో  కేంద్ర హోమ్‌ శాఖ మంత్రి అమిత్‌ షా

సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 25 : కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తున్నారని కేంద్ర హోమ్‌, సహకార శాఖల మంత్రి అమిత్‌ షా విమర్శించారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు ముస్లిమ్‌లకు రిజర్వేషన్లు ఇచ్చాయని, బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ఆ కోటాను రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని  అమిత్‌ షా  అన్నారు.  సిద్ధిపేటలో మెదక్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునం దన్‌ రావుకు మద్దతుగా నిర్వహించిన బిజెపి  భారీ బహిరంగ సభలో అమిత్‌ షా మాట్లాడుతూ…తాను తెలుగులో మాట్లాడలేనని, ఇందుకు క్షమాపణలు చెబుతున్నానన్నారు. తెలంగాణలో బీజేపీకి 12 సీట్లు ఇవ్వాలని, మోదీని బలపరచి 400 లోకసభ  స్థానాలను సాధించాలన్నారు. దేశంలో చాలా కాలంగా పెండిరగ్‌లో ఉన్న సమస్యలను ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ పరిష్కరించారని అన్నారు.

అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని కాంగ్రెస్‌ పార్టీ, బీఆర్‌ఎస్‌ అస్సలు కోరుకోలేదని, రామ మందిర అంశాన్ని కాంగ్రెస్‌ దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉంచిందన్నారు. ప్రధాన మంత్రి మోదీ కూడా శ్రీరామ మందిరం సమస్యపై కొనసాగుతున్న కేసును న్యాయపరంగా ఐదేళ్లలో గెలిచారని తెలిపారు. రామజన్మభూమిలో అద్భుతమైన రామ మందిరాన్ని నిర్మించి అయోధ్యని గొప్ప పవిత్ర పుణ్యక్షేత్రంగా తీర్చదిద్దారని చెప్పారు. మోదీ కాశ్మీర్‌ను భారతదేశంలో అంతర్భాగంగా చేశారని ఆయనన్నారు. కాశ్మీర్‌ ఎప్పటికీ భారతదేశంలో భాగమేనని అమిత్‌ షా స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అవినీతిపై దాడి చేసిన షా..తెలంగాణలో బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ కలిసి అవినీతికి పాల్పడ్డాయని అన్నారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్‌ దిల్లీ ఏటీఎంగా మార్చేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండూ కుమ్మక్కయ్యాయని, అందుకే కాళేశ్వరం,  భూ కుంభకోణాలకు పాల్పడిన బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్‌ ప్రభుత్వం దర్యాప్తు చేయడం లేదని ఆరోపించారు. మోదీని మరోసారి ప్రధానిని చేస్తే తెలంగాణను అవినీతి నుంచి విముక్తి పొందుతుందని హామీ ఇచ్చారు.

మజ్లిస్‌కు భయపడి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడం లేదని, అయితే సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవాలని బీజేపీ సంకల్పించిందని షా అన్నారు. మజ్లిస్‌కు బీజేపీ భయపడదన్నారు. నరేంద్ర మోదీని మరోసారి ప్రధానమంత్రిని చేయాలని తెలంగాణ ప్రజలు సంకల్పించారని అమిత్‌ షా తెలిపారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పుడే తెలంగాణ సమగ్రాభివృద్ధి జరుగుతుందని  ప్రజలకు హామీ ఇచ్చారు. మల్కాజిగిరి, మెదక్‌తో సహా దేశవ్యాప్తంగా కమలాన్ని భారీ మెజారిటీతో గెలిపించాలని, మరోసారి మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అమిత్‌ షా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Comments (0)
Add Comment