ఎంఐఎం, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల డీఎన్‌ఏ ఒక్కటే..

  • ప్రజలను వోట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్‌కి లేదు
  •  ప్రజల కోసం పోరాడిన వ్యక్తి బండి సంజయ్‌..
  • ఈ ఎన్నికల్లో 400లకు పైగా సీట్లను గెలువబోతున్నాం..
  • కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి  
  • కరీంనగర్‌ బిజెపి అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన బండి సంజయ్‌

కరీంనగర్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 25 : ఈ ఎన్నికలు దేశానికి ఎవరు ప్రధాన మంత్రి కావాలో నిర్ణయించే ఎన్నికలని, దేశ భవిష్యత్తు, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే ఎన్నికలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. ఎంఐఎం, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ ఒకే తాను ముక్కలేననని, మూడు పార్టీల డీఎన్‌ఏ ఒక్కటేనని అందుకే ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. గురువారం కరీంనగర్‌ బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్‌ కుమార్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. అంతకు ముందు నగరంలో భారీ రాలీ నిర్వహించగా కిషన్‌ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ..మే 13వ తేదీన లోక్‌ సభ ఎన్నికలు జరగనున్నాయని, ఈ రోజు నుంచి పోలింగ్‌ జరిగే రోజు వరకు కార్యకర్తలందరూ బిజెపి జెండాలతో గ్రామగ్రామాన తిరిగి నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిని చేసుకునేలా, కరీంనగర్‌ నుంచి బండి సంజయ్‌ భారీ మెజారిటీతో గెలిపించుకునేలా ప్రచారం చేపట్టాలని కోరారు.

దేశంలో మోదీ నాయకత్వంలో 400 సీట్లు గెలవబోతున్నామని, జూన్‌ రెండో వారంలో మళ్లీ నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి ఎందుకు వోటేయాలో రేవంత్‌ రెడ్డి చెప్పాలన్నారు. శాసనసభ ఎన్నికల్లో 6 గ్యారంటీల పేరుతో 100 రోజుల్లో అమలు చేస్తామని తెలంగాణ ప్రజలకు హామీలు ఇచ్చి ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. రైతు భరోసా కింద రూ.15 వేలు, రైతు కూలీలు, కౌలు రైతులకు రూ.12 వేలు ఇస్తామని చెప్పి ఇంతవరకు చెల్లించలేదని విమర్శించారు. రుణమాఫీ చేయలేదని, ధాన్యానికి రూ. 500 బోనస్‌ ఇస్తామని చెప్పి మోసం చేశారని, వివాహం చేసుకున్న ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామంటూ హామీ ఇచ్చి ఎందుకు అమలు చేయలేదని కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు ఏవీ నెరవేరలేదన్నారు. ప్రజలను వోట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్‌ పార్టీకి లేదని అన్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ పార్టీలోకి పంపించి కేసీఆర్‌ వోట్లు అడుగుతున్నారని, బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకునే శక్తి లేదని, ఇంకా ఏ మొహం పెట్టుకుని వోట్లు అడుగుతారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో 17కు 17 ఎంపీ సీట్లలో భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని, కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు..అటక్‌ నుంచి కటక్‌ వరకు ఎక్కడికెళ్లినా ప్రజలందరూ మోదీ నామమే స్మరిస్తున్నారని, ఫిర్‌ ఏక్‌ బార్‌..చార్‌ సౌ పార్‌..ఇది పార్టీ నినాదమే కాదని, దేశంలో ప్రతి ఇంటి నినాదమైందన్నారు. బండి సంజయ్‌ తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేశారని, రానున్న రోజుల్లో కరీంనగర్‌ ప్రజల కోసం అలుపు లేకుండా పనిచేస్తారని చెప్పారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులు ఏనాడు ప్రజల తరఫున పోరాడలేదన్నారు. కరీంనగర్‌ పార్లమెంటు నియోజకవర్గంలో భారీ మెజారిటీతో బండి సంజయ్‌ని గెలిపించి నరేంద్ర మోదీకి బహుమతిగా ఇవ్వాలని  కిషన్‌ రెడ్డి కోరారు.

Comments (0)
Add Comment