రాష్ట్రంలో బీజేపీ బలమైన శక్తిగా ఆవిర్భవించాలి

పార్టీకి టీవీ ఛానల్స్‌, పేపర్స్‌ అన్నీ సోషల్‌ మీడియా కార్యకర్తలే..
బీజేపీ సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జ్‌ల సమావేశంలో కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 12 : వొచ్చే ఎన్నికల్లో హైదరాబాద్‌ పార్లమెంట్‌ సీటు గెలుపే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్‌ గార్డెన్‌లో నిర్వహించిన బీజేపీ సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జ్‌ల సమావేశంలో కిషన్‌ రెడ్డి  మాట్లాడుతూ…వొచ్చే ఏప్రిల్‌, మే నెలలో దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయన్నారు. దేశానికి ఎవరు ప్రధాన మంత్రి కావాలో, దేశంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలో దేశ ప్రజలు తమ వోటు ద్వారా  నిర్ణయించే ఎన్నికలని వివరించారు. సోషల్‌ మీడియా వారియర్స్‌ మీటింగ్‌కు వొచ్చిన కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షాకు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి సోషల్‌ మీడియ కార్యకర్తల సేవలు ఎంతో అవసరమని, పార్టీకి టీవీ ఛానల్స్‌, పేపర్స్‌ అన్నీ సోషల్‌ మీడియా కార్యకర్తలేనన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలవంతమైన శక్తిగా వొచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఆవిర్భవింంచాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణలో 17కు 17 సీట్లు గెలవడమే లక్ష్యంగా పోటీ చేస్తున్నామని, హైదరాబాద్‌ సీటు కూడా గెలుపే లక్ష్యంగా పని చేయాలని కిషన్‌ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోషల్‌ మీడియాలో అలెర్ట్‌గా ఉంటూ…తప్పుడు సందేశాలను గట్టిగా తిప్పికొట్టాలని సూచించారు. జాతీయ నాయకులు ఇచ్చే సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా నరేంద్ర మోదీ  నీతివంతమైన, సుస్థిరమైన పరిపాలన చేస్తున్నారని, రాష్ట్రంలోనూ నరేంద్రమోదీ ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, తెలంగాణ అభివృద్ధి కోసం గత పదేళ్లుగా  మోదీ ప్రభుత్వం సుమారు రూ.10లక్షల కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పారు.

మోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కిషన్‌ రెడ్డి సూచించారు. పదేళ్లపాటు బీఆర్‌ఎస్‌ పార్టీ కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయి గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించారని, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు రెండూ కుటుంబ, అవినీతి పార్టీలేనని, దొందు దొందేనని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు తోడు ఎంఐఎం పార్టీ అని, మూడు పార్టీలు గతంలో కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేశాయని చెప్పారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలను ప్రజలు నమ్మొద్దని సూచించారు. వొచ్చే పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించాలన్నారు. నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయంగా దేశంలో ఏ నాయకుడు లేడని చెప్పారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి వోటు వేస్తే దుర్వినియోగమవుతుందని, ఆ పార్టీ అవసరం తెలంగాణకు లేదని, అది ఇర్రెలివెంట్‌ పార్టీ అని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ కూడా కుటుంబ పార్టీయేనని, 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని కేసీఆర్‌ కుటుంబం దోచుకుంటే..నేడు రాహుల్‌ గాంధీ కుటుంబం తెలంగాణను దోచుకుంటుందని కిషన్‌ రెడ్డి విమర్శించారు. ఆరు గ్యారెంటీల అమలు విషయంలో రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీని నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. అధికారంలోకి వొచ్చిన 100 రోజుల్లోనే పూర్తి చేస్తామని చెప్పి అమలు చేయడం లేదన్నారు. సోషల్‌ మీడియాలో ఐక్యమత్యంతో పని చేయాలని, వొచ్చే పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ శక్తి చూపించాలని కోరారు. ధైర్యంగా, సమర్థవంతంగా పని చేసే కార్యకర్తలు తమ పార్టీ కార్యకర్తలని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఏ కష్టం వొచ్చినా ఎదుర్కునడానికి సిద్ధంగా ఉండాలని, వొచ్చే ధర్మ యుద్ధానికి నరేంద్ర మోదీ నాయకత్వంలో తామందరం సిద్ధంగా ఉండాలని కిషన్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

Comments (0)
Add Comment