ఈడీ విచారణను ధైర్యంగా ఎదుర్కుంటాం

  • బిఆర్‌ఎస్‌ను కూల్చే కుట్రలు ఫెయిల్‌…అం‌దుకే నోటీసులు
  • తెలంగాణ బిడ్డలం వెరిచేది లేదన్న ఎమ్మెల్సీ కవిత
  • మోదీ పాలనా వైఫల్యాలపై ఘాటు విమర్శలు
  • కవిత అభ్యర్థనకు స్పందించిన ఇడి…11న సాయంత్రం విచారణకు రావాలని వెల్లడి

న్యూ దిల్లీ, మార్చి 9 : లిక్కర్‌ ‌స్కామ్‌లో ఈడీ విచారణకు వంద శాతం సహకరిస్తాను..నేనే ఈడీ ముందుకు ధైర్యంగా వొచ్చి, విచారణ ఎదుర్కుంటానని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ బిడ్డనని, ఎలాంటి బెదిరింపులకు లొంగబోమని అన్నారు. దిల్లీలో ఎమ్మెల్సీ కవిత వి•డియాతో మాట్లాడుతూ…తాను విచారణకు సహకరిస్తాని..ఎమ్మెల్యేల ఎర కేసులో బీఎల్‌ ‌సంతోష్‌ ‌సిట్‌ ‌ముందుకు ఎందుకు రావడం లేదని ఎదురు ప్రశ్నించారు. సిట్‌ ‌ముందుకు వొచ్చేందుకు బీఎల్‌ ‌సంతోష్‌కు భయమెందుకు..? అని కవిత ప్రశ్నించారు. బీజేపీ నేతలు, బీజేపీలో చేరిన నేతలపై ఈడీ, సీబీఐ కేసులు ఉండవు. బీజేపీని ప్రశ్నించిన విపక్షాలపై దర్యాప్తు సంస్థలతో దాడులు, కేసులు పెడుతారు. తమ వైపు సత్యం, ధర్మం, న్యాయం ఉంది. ఏ విచారణనైనా ధైర్యంగా ఎదుర్కుంటాం అని కవిత తేల్చిచెప్పారు. దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసులో ఈడీ అధికారులే తమ ఇంటికి రావచ్చని ఎమ్మెల్సీ కవిత కోరారు. ఒక వేళ ఈడీ ఇంటికి రానంటే తానే ఈడీ అధికారులు ఎదుట హాజరవుతానని చెప్పారు.

ఇలాంటి కేసుల్లో మహిళలను ఇంట్లోనే విచారిస్తారని గుర్తు చేశారు. కుదరక పోతే వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా అయినా విచారిస్తారని తెలిపారు. కానీ కావాలనే తనను దిల్లీకి పిలిచారని, 2023, మార్చి11వ తేదీన ఉదయం 11న ఈడీ విచారణకు హాజరవుతానని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తమను ఇబ్బంది పెట్టేందుకే ఈడీని ప్రయోగిస్తుందని కవిత ఆరోపించారు.  ఏడాది చివరి వరకు తెలంగాణలో ఎన్నికలున్నాయని..అందుకే ప్రధాని మోదీ తమను టార్గెట్‌ ‌చేశారని ఆమె ఆరోపించారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు ఉన్నా మోదీ వొచ్చే ముందు ఈడీ రావడం కామన్‌ అని చెప్పారు. అందులో భాగంగానే తమను భయపెట్టేందుకే బీజేపీ ప్రభుత్వం ఈడీని తమపై ప్రయోగించిందన్నారు. తనను మాత్రమే కాదు..తనతో పాటు బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర నేతలు సహా 15 మందిని బీజేపీ ప్రభుత్వం విచారణ పేరుతో వేధిస్తుందన్నారు.

దేశంలో డబుల్‌ ఇం‌జన్‌ ‌సర్కారు నడుస్తుందని కవిత అన్నారు. ఇందులో ఓ  ఇంజన్‌ ‌ప్రధాని మోదీ అయితే… మరో ఇంజన్‌ అదానీ అని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలను టార్గెట్‌ ‌చేయడంలో శ్రద్ధ చూపెడుతున్న మోదీ..దేశంలో సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. గాంధీజీ పుట్టిన దేశంలో ప్రస్తుతం అబద్ధాలు రాజ్యమేలుతున్నాయని చెప్పారు. మోదీ ఎంత భయపెట్టినా..భయపడే ప్రసక్తే లేదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా..పోరాటం చేస్తామని..న్యాయ వ్యవస్థపై నమ్మకముందున్నారు. మోదీ వన్‌ ‌నేషన్‌..‌వన్‌ ‌ఫ్రెండ్‌ ‌స్కీమ్‌ అమలు చేస్తున్నారని కవిత మండిపడ్డారు. బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆర్‌ఎస్‌ అవుతుంది. మహిళా బిల్లు ఆందోళన అనగానే తనకు ఈడీ నోటీసులు ఇచ్చారు. వంట గ్యాస్‌ ‌ధరలపై మరొకరు గళమెత్తితే వాళ్లకు కూడా ఈడీ నోటీసులు ఇస్తారు.

కేంద్ర ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే దర్యాప్తు సంస్థలను పంపుతున్నారని కవిత ధ్వజమె త్తారు. నవంబర్‌, ‌డిసెంబర్‌లో తెలంగాణలో ఎన్నికలు రావొచ్చని కవిత పేర్కొన్నారు. తెలంగాణ నేతలను వేధించడం కేంద్ర దర్యాప్తు సంస్థలకు అలవాటుగా మారిందని కవిత విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారని, అది సాధ్యం కాకపోవడంతో తనను టార్గెట్‌ ‌చేశారని కవిత చెప్పుకొచ్చారు. ఈ కుట్రలను రాజకీయంగా తిప్పికొడతామన్న  కవిత మద్యం కుంభకోణం దర్యాప్తుపై అంత తొందర ఎందుకని ఆమె ప్రశ్నించారు. మహిళలను ఇంటిలో విచారించాలని, కావాలంటే నిందితులను ఇంటికి తీసుకురావాలని ఈడీని కోరానని ఆమె వి•డియాకు వెల్లడించారు. రెండు రోజుల సమయమైనా తనకు ఇవ్వరా అని ఆమె నిలదీశారు.

కవిత అభ్యర్థనకు స్పందించిన ఇడి…11న సాయంత్రం విచారణకు రావాలని వెల్లడి
మద్యం కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ‌కుమార్తె, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ‌ముందు హాజరుకు వెసులుబాటు కల్పించింది. అయితే ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని ఈడీ వెంటనే తాఖీదులు పంపింది. గురువారం విచారణకు రావాలంటూ బుధవారం నోటీసులు ఇచ్చింది. చట్టసభల్లో మహిళకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో ఈ నెల 10న జంతర్‌మంతర్‌లో ధర్నా నిర్వహిస్తున్నానని, ఆ ఏర్పాట్లలో బిజీగా ఉండడం వల్ల తాను రాలేనని కవిత సమాధానం ఇచ్చారు.

తనకు మరింత సమయం కావాలని కవిత కోరుతున్నారని, అయితే ఈడీ స్పందించడం లేదని అధికార వర్గాలు తెలిపాయి. తొలుత మరింత గడువు కావాలని కోరినప్పటికీ బుధవారం అర్ధరాత్రి ఈ నెల 11నే విచారణకు హాజరయ్యేందుకు అంగీకరిస్తున్నట్లు కవిత తెలిపారు. ఈ మేరకు ఈడీ జాయింట్‌ ‌డైరెక్టర్‌కు లేఖ పంపారు.

Comments (0)
Add Comment