నేడు నర్సాపూర్‌కు రాహుల్‌ గాంధీ

రాహుల్‌ తోనే దేశ ప్రగతి… కాంగ్రెస్‌ గెలిస్తేనే మళ్లీ దేశానికి మంచి రోజులు
పదేళ్లపాలనలో  బిజెపి, బిఆర్‌ఎస్‌ చేసిందేమీ లేదు
ఇందిరమ్మ రోజులు మళ్లీ కావాలంటే మెదక్‌లో మధు గెలవాలె..
నేటి సభకు లక్షలాదిగా ప్రజలు తరలి రావాలని మంత్రి కొండా సురేఖ పిలుపు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, మే 8 : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రధాని అయితేనే దేశం ప్రగతి పథంలో దూసుకుపోతుందని ఉమ్మడి మెదక్‌ జిల్లా ఇంఛార్జి మంత్రి, రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం సాయంత్రం నర్సాపూర్‌లో  రాహుల్‌ గాంధీ సభ ఏర్పాట్లను ఏఐసిసి పర్యవేక్షకులు సురేష్‌, మెదక్‌ పార్లమెంట్‌ పరిశీలకులు విశ్వనాథ్‌తో పాటు కాంగ్రెస్‌ పార్టీ ఇతర నాయకులతో కలిసి పరిశీలించారు. రాహుల్‌ గాంధీ దిగే హెలిప్యాడ్‌ పనులను పర్యవేక్షించి పలు సూచనలు చేశారు. రాహుల్‌ గాంధీ పాల్గొనే బహిరంగ సభకు లక్షలాదిగా కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం దుబ్బాక నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్న మెదక్‌ పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థి నీలం మధు, దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి మీడియా సమావేశంలో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ…పదేళ్ల్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్‌ పార్టీలు ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు.

దేశంలో మోదీ విభజన రాజకీయాలు చేస్తే రాష్ట్రంలో కెసిఆర్‌ తెలంగాణను అవినీతి కేరాఫ్‌గా మార్చడంతో పాటు అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వొస్తేనే మళ్లీ భారత్‌ అభివృద్ధి బాటలో పయనిస్తుందని తెలిపారు. మహానేత ఇందిరమ్మ ప్రాతినిధ్యం వహించిన మెదక్‌ పార్లమెంటు స్థానంలో బిజెపి, బిఆర్‌ఎస్‌ పార్టీలు అగ్రకులాల అభ్యర్థులకు పోటీ చేసే అవకాశం కల్పిస్తే కాంగ్రెస్‌ పార్టీ మాత్రం బిసి  బిడ్డ నీలం మధుకు అవకాశం ఇచ్చిందన్నారు. బిఆర్‌ఎస్‌ పార్టీ తరఫున పోటీ చేస్తున్న వెంకట్రామరెడ్డి సిద్ధిపేట జిల్లా కలెక్టర్‌గా  రైతులకు చేసిన అన్యాయాన్ని ఈ ప్రాంత ప్రజలు మరచిపోలేదన్నారు. ఇక బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న రఘునందన్‌రావు దుబ్బాక ఉప ఎన్నికల్లో అమలు కానీ హామీలు ఇచ్చి కేంద్ర నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చి మాయ చేశారని ఆరోపించారు. రఘునందన్‌రావు ఉప ఎన్నికల్లో గెలిచి దుబ్బాక నియోజకవర్గనికి ఒరగబెట్టింది శూన్యమన్నారు.  దుబ్బాక నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన శ్రీనివాస్‌రెడ్డి దుబ్బాక అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నాడని అభినందించారు. ఇప్పటికే దుబ్బాక నియోజకవర్గం నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నాడని, పార్టీలకతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందరికీ అందిస్తున్నాడన్నారు. ఈ ఎన్నికల్లో ఎంపీగా నీలం మధును గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు తీసుకువచ్చి దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్తాడని భరోసా ఇచ్చారు.

ప్రజల్లో కాంగ్రెస్‌ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి జీర్ణించుకోలేని బిఅర్‌ఎస్‌ పార్టీ బిజెపికి తొత్తుగా మారి మన ముందుకు వొస్తున్నారని ఆరోపించారు. జైళ్లో పడిన కవితను కాపాడుకోవడానికి కేసీఆర్‌ ప్రయత్నం చేస్తున్నారని, దీనిని ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ బిజెపితో చీకటి ఒప్పందం చేసుకున్నారని, ఎన్నికలలో ఆ పార్టీకి లాభం చేకూరేలా పనిచేస్తున్నారని విమర్శించారు. బిజెపి ప్రభుత్వం రాబోతుందని కలలు కంటుందని, కానీ ఆ పార్టీ వోటమి పాలు కాబోతుందని చెప్పారు. దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేసి ప్రజలను మోసం చేయొద్దని  సూచించారు.

మెదక్‌ గడ్డ నుంచి ఇందిరా గాంధీ ప్రాతినిధ్యం వహించి ఎంతో అభివృద్ధిని చేశారని చెప్పారు. అలాంటి గడ్డపై నుంచి 25ఏళ్ల తర్వాత నీలం మధు గెలుపు ద్వారా కాంగ్రెస్‌ జెండా ఎగరబోతుందని స్పష్టం చేశారు. నీలం మధు పార్లమెంట్‌లో అడుగు పెట్టబోతున్నారని స్పష్టం చేశారు.  పార్లమెంట్‌ పరిధిలోని నేతలంతా భారీ జన సమీకరణ చేసి రాహుల్‌ గాంధీ బహిరంగ సభను విజయవంతం చేయాలని  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  మాజీ ఎమ్మల్యేలు మధన్‌ రెడ్డి, మైనంపల్లి హనుమంత్‌ రావు, మాజీ ఎమ్మెల్సీ ఆర్‌ సత్యా నారాయణ, డిసిసి అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్‌, నర్సాపూర్‌, దుబ్బాక కాంగ్రెస్‌ ఇంఛార్జులు  ఆవుల రాజిరెడ్డి, చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు మద్దుల గాల్‌రెడ్డి, పద్మారెడ్డి, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

prajatantra newstelangana updatestelugu kavithaluTelugu News Headlines Breaking News NowToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment