గద్దర్‌ ఎం‌ట్రీతో మరింత ఉత్సుకతగా మారిన మునుగోడు

ప్రజా యుద్ద నౌక గద్దర్‌ ఎన్నికల్లో పోటీకి సిద్దపడడంతో మునుగోడు ఉప ఎన్నిక మరింత ఆసక్తిగా మారింది. నిన్నటి వరకు కేవలం మూడు పార్టీల మధ్యే పోటీ ఉంటుందనుకుంటున్న తరుణంలో అనుకోకుండా గద్దర్‌ ‌పేరు తెరపైకి రావడం అందరినీ ఒక్కసారి ఆశ్చర్యపరిచింది. నిన్నటివరకు ఎన్నికలు బూటకమని, ఎన్నికలను బహిష్కరించాలంటూ నినాదాలిచ్చిన గద్దర్‌ ‌ప్రజాస్వామ్యయుత ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొనేందుకు సిద్దపడడాన్ని గద్దర్‌ ‌గురించి తెలిసినవారెవరూ నమ్మలేకపోతున్నారు. విద్యార్థి దశనుంచి దాదాపు అయిదారేళ్ళ కిందివరకు విప్లవ భావాలతో కనిపించే గద్దర్‌లో ఇలాంటి మార్పు ఎలా వచ్చిందన్న ప్రశ్న ముఖ్యంగా తెలంగాణ ప్రాంత ప్రజల్లో అంతుబట్ట కుండా ఉంది. ఏదియేమైనా గద్దర్‌ ‌మునుగోడు ఎన్నికల్లో పోటీకి సిద్దమైనాడన్నది నిజం. అయితే అంతకన్నా మరో ఆశ్చర్యకరమైన విషయమేమంటే ఆయన ఎంచుకున్న పార్టీ గురించి. దేశంలో అనేక జాతీయ, ప్రాంతీయ పార్టీలుండగా ఆయన ఇంతవరకు ఏ ఒక్క ఎన్నికల్లోనూ గెలవని రాజకీయ పార్టీ నుండి పోటీచేయడానికి ఇష్టపడడం. విచిత్రమేమంటే ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్‌ ‌కె.ఏ. పాల్‌కూడా రాజకీయాలకు కొత్త. ఇప్పుడా పార్టీనుండి పోటీ పడుతున్న గద్దర్‌ ‌కూడా ఇంతవరకు ప్రజా ఉద్యమాల్లో పాల్గొనడమేగాని ఎన్నికల్లో పోటీ చేయడమన్నది ఆయనకు ఇదే మొదటిసారి.

గతంలో అనేక రాజకీయ పార్టీలు ఆయన్ను తమ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించాయి. కాని ఏ పార్టీలో చేరనంటూనే ఆయన ప్రత్యేకంగా దిల్లీ వెళ్ళి రాహుల్‌గాంధీని, సోనియాగాంధీని కలవడంతో కాంగ్రెస్‌లో చేరిపోతాడని అందరూ అనుకున్నారు. దానికి తగినట్లుగా కాంగ్రెస్‌ ‌లెజిస్లేటివ్‌ ‌పార్టీ నాయకుడు భట్టి విక్రమార్క గద్దర్‌ను తమ పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారు. రాహుల్‌గాంధీ ఎంతో ప్రతిష్టగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్రలో పాల్గొనాల్సిందిగా భట్టి ఆయన్ను కోరినప్పుడు, యాత్ర తెలంగాణలో సాగినప్పుడు పాల్గొంటానని హామీ ఇవ్వడంతో కాంగ్రెస్‌వైపుకే ఆయన మొగ్గుతున్నారని అంతా భావించారు. కేంద్రంలోని బిజెపి నాయకులు రాష్ట్ర పర్యటనలో భాగంగా ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసినప్పుడు ఆ సభలో గద్దర్‌ ‌ప్రత్యక్షమవడాన్ని చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. అయితే దిల్లీ నాయకులు ఏమి చెబుతారో వినడానికి వచ్చానంటూ గద్దర్‌ ‌వారిని ఆశ్చర్యంనుండి తేరుకునేలా చేశారు. ఏమైనా సుదీర్ఘకాలం పీపుల్స్‌వార్‌, ‌మావోయిస్ట్ ‌పార్టీల సింపథైజర్‌గా, విప్లవోద్యమాల్లో, ప్రజా పోరాటాల్లో పాల్గొన్న 73 ఏళ్ళ గద్దర్‌ ‌నేటి కుళ్ళు రాజకీయాల్లోకి రావడంపట్ల ఆయన అభిమానులను తీవ్రంగా కలిచివేస్తోంది. నేటి రాజకీయ నాయకుల సరసన ఆయన్ను వారు ఊహించుకోలేకపోతున్నారు. అప్రజాస్వామికంగా లేదా ప్రజావ్యతిరేక పాలన చేసే ప్రభుత్వాలను నిలదీయాల్సిన గొంతుక ఒక పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేయడమేంటని వారు వేదన చెందుతున్నారు.

వాస్తవంగా విప్లవోద్యమాలకు దూరమైన తర్వాత ఆయనే ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తారన్న వార్తలు వచ్చాయి. ఆయన ఆ తర్వాత కాలంలో తనను ఆంబేద్కరిస్టుగా పేర్కొన్నారు. ఆ తర్వాత కాలంలో ఆయనకు రాజకీయాలపైన ఆసక్తి ఏర్పడింది. అప్పటికే ఆయన కుమారుడు సూర్య కిరణ్‌ ‌కాంగ్రెస్‌ ‌తీర్థం తీసుకున్నాడు. కొడుకుతోపాటు తానుకూడా కాంగ్రెస్‌లో చేరిపోతాడని అనుకున్నారు. కాని ఆయన ఎవరూ ఊహించని రీతిలో తాజాగా ప్రజా శాంతి పార్టీలో చేరిపోయారు. తమ పార్టీ తరఫున గద్దర్‌ను మునుగోడు అభ్యర్థిగా నిలబెడతామని డాక్టర్‌ ‌కె.ఏ. పాల్‌ ‌చేస్తున్న ప్రకటనను ప్రజలు, వివిధ పార్టీల నాయకులు చాలా ఈజీగా తీసుకున్నారు. కాని, ఒక్కసారే గద్దర్‌ ‌పేరు తెరపైకి రావడంతో అందరూ అవక్కాయ అయిపోయారు. దీంతో మునుగోడులో ఇప్పుడు ముక్కోణ పోటీకి బదులు చతుర్ముఖ పోటీ ఏర్పడింది. అలాగే బిఎస్పీ కూడా తన అభ్యర్థిని నిలబెట్టే ఆలోచనలో ఉండడంతో మునుగోడు ఉప ఎన్నిక మరింత రంజుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మునుగోడుకు ఇప్పటివరకు పన్నెండు సార్లు ఎన్నికలు జరిగాయి. ఆరు సార్లు కాంగ్రెస్‌ ‌పార్టీ, అయిదు సార్లు కమ్యూనిస్టులు , ఒకసారి టిఆర్‌ఎస్‌ ఈ ‌స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. నిన్నటి వరకు కాంగ్రెస్‌కు, అంతకు ముందు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని గెలుచుకునేందుకు ఇప్పుడు బిజెపికి తోడు కొత్తగా ప్రజాశాంతి పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇంకా బిఎస్పీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. వీరందరిలో ఆబాలగోపాలానికి గద్దర్‌ ‌పేరు తెలియందికాదు. ఇక్కడి సిట్టింగ్‌ ఎంఎల్‌ఏ ‌కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసినప్పటినుండి కాంగ్రెస్‌, ‌బిజెపి, టిఆర్‌ఎస్‌లు ఈ స్థానం తమకే దక్కుతుందని ఎవరికి వారు ఘంటా పథంగా చెబుతున్నారు. ఇప్పటికే ఆయా పార్టీలకు చెందిన చోటా బడా నాయకులు ఈ నియోజకవర్గంలో తమ ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు గుమ్మడి విఠల్‌రావు అలియాస్‌ ‌గద్దర్‌ ఎం‌ట్రీ ఇవ్వడంతో అయోమయంలో పడిపోయారు. మునిగోడు ప్రజలు చివరికి ఎవరిని భుజాన ఎత్తుకుంటారో వేచి చూడాలి.

– మండువ రవీందర్‌రావు

 

prajatantra newstelangana updatestelugu kavithaluTelugu News Headlines Breaking News NowToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment