‌చెయ్యికాలిన తర్వాత ఆకు పట్టుకున్నట్లు

పన్నెండు మంది మృతి, పలువురి అస్వస్థతకు దారితీసిన విశాఖ ఎల్‌జి పాలిమర్స్ ‌ఫ్యాక్టరీ నుండి వెలువడిన విషవాయువు ఉదంతంతో ఇప్పుడు కాలుష్య పరిశ్రమల ఉనికి మరోసారి చర్చనీయాంశమవుతున్నది. పరిశ్రమలైనా, ఇతర వ్యాపార సంస్థలేవైనప్పటికీ ప్రాణాంతక ప్రమాదానికి దారితీసినప్పుడే వాటిపై చర్చలు, విమర్శలు చెలరేగడం ఆ తర్వాత వాటిగూర్చి అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు మరిచి పోవడమన్నది సహజమైపోయింది. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి పర్యావరణ, ఆరోగ్య, కార్మిక తదితర అనేక శాఖలకు సంబంధించి చట్టాలకు లోబడి ఉన్నప్పుడే అనుమతులు లభిస్తాయి. కాని, ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే ఆ సంస్థనో లేదా ఆ ఫ్యాక్టరీయో నిబంధనలకు విరుద్ధగా నడుస్తున్నదనో, ఫలానా విషయంలో అనుమతులు లేవన్న మాటలు తరుచు వినిపిస్తుంటాయి. ఏళ్ళకొద్ది నడిచే ఈ ఫ్యాక్టరీలకు నిజంగానే అనుమతులు లేకపోతే సంబంధిత అధికార యంత్రాంగం ఏంచేస్తున్నదని ఎవరూ అడగరు. అంటే ఆయా సంబంధిత శాఖల అధికార యంత్రాంగానికి చేతులు తడుపుతూ పారిశ్రామికులు పబ్బం గడుపుకుంటున్నారన్నది జగమెరిగిన సత్యం.

ప్రమాదమేదో జరిగితే తప్ప ఆ పరిశ్రమ గుట్టురట్టు అయ్యే పరిస్థితి
ఉండదు. దేశవ్యాప్తంగా అనేక ప్రమాదకర పరిశ్రమలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ అనేక పరిశ్రమల్లో ప్రాణాంతకమైన రసాయనాలు లీక్‌ అవడంవల్లో, ఆయా ఫ్యాక్టరీలకు సంబంధించిన బాయిలర్‌లు పేలిన సంఘటనల్లోనో, విద్యుత్‌ ‌లేదా ఇతర అగ్ని ప్రమాదాలతోనో పలువురు కార్మికులతో పాటు ప్రజలు కూడా మృత్యువాత పడుతున్న సంఘటనలు నిత్యం ఎక్కడో దగ్గర వెలుగుచూస్తూనే ఉన్నాయి. పారిశ్రామికవేత్తలు ఫ్యాక్టరీల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శక సూత్రాలు పాటించకపోవడంవల్లే ఇలాంటి ప్రమాదాలకు తావేర్పడుతున్నది. ఇవ్వాళ తోటి తెలుగు రాష్ట్రంలోని విశాఖపట్టణంలోని ఎల్‌జి పాలిమర్స్ ‌ఫ్యాక్టరీనుండి వెలువడిన అతి ప్రమాదమన స్టైరిన్‌ ‌గ్యాస్‌ ‌లీక్‌ ‌వల్ల పన్నెండు మంది ప్రాణాలు బలవడంతో పాటు, సుమారు అయిదు కిలోమీటర్ల దూరం ఈ విషవాయువు గాలిలో కలవడంతో చుట్టుపక్కలున్న నాలుగైదు గ్రామాల ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురైనారు. అనేక మందికి శ్వాస అడక రోడ్లమీదనే పడిపోయారు. గ్యాస్‌ ‌వాసనకు వాహనాల మీద దూరం వెళ్ళాలనుకున్నవారి ప్రయత్నాలు కూడా విఫలమై వాహనాలను నడిరోడ్డుపైన పారేసి అక్కడే సొమ్మసిల్లి పడిపోయారు. కాలువ, రోడ్డు, చెట్టుచేమ అనకుండా ఎక్కపడితే అక్కడ ఉన్నవాళ్ళు ఉన్నట్లు విరుచుకుపడ్డారు. పచ్చని చెట్లు నల్లగా మాడిపోయాయి. పండ్లు మసిబారిపోయాయి. ఇది సరిగ్గా ముప్ప్తై ఆరేళ్ళ కింద జరిగిన భోపాల్‌ ‌విషవాయువు దుర్ఘటను తలపించేదిగా మారింది. ఆ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారు పోగా, బతికున్నవారు నేటికీ శారీరక బాధలను అనుభవిస్తూనే ఉన్నారు.

మరో విషయమేమంటే ఇవ్వాళ ప్రపంచాన్ని వణికిస్తున్న కొరోనా శారీరకంగా దుర్భలంగా ఉన్నవారిపైన ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుందంటున్నారు. అది నిజమే అనడానికి భోపాల్‌ ‌దుర్ఘటన ప్రమాదానికి గురైన కొందరికి కొరోనా వైరస్‌ ‌త్వరగా సోకిందన్నది. భోపాల్‌ ఎరువుల ఫ్యాక్టరీనుండి ఆనాడు వెలువడిన విషవాయుల్లో 5వేల 200 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు పన్నెండు కిలోమీటర్లమేర వ్యాపించిన ఈ విషవాయువు కారణంగా సుమారు ఎనభై వేలమంది నిరాశ్రయులైనారు. అంతకు ముందు 1975లో బీహార్‌లోని దన్‌బాద్‌ ‌బొగ్గుగని నుండి మిథేన్‌ ‌గ్యాస్‌ ‌విడుదల కావడంతో సుమారు 372 మంది మృత్యువాతపడ్డారు. ఛత్తీస్‌ఘడ్‌ ‌దుర్గ్ ‌జిల్లాలోని బిలాయ్‌ ‌స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌నుంచి కూడా మిథేన్‌ ‌గ్యాస్‌ ‌లీకవడం వల్ల ఆరుగురు మరణించిన సంఘటన జరిగింది. 2014లో జరిగిన ఈ ఘటనలో అనేక మంది అనారోగ్యానికి గురైనారు. ఇక పేలుళ్ళ విషయానికొస్తే నిత్యం ఎక్కడో దగ్గర బాయిలర్‌లు పేలడంవల్లనో, విషవాయువులను పంపించే పైప్‌లైన్‌లు పేలడం వల్లనో మంటలు చెలరేగి అనేక మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు, చట్టుపక్కల ఇళ్ళు దగ్ధమైన సంఘటనలనేకం వెలుగుచూస్తూనే ఉన్నాయి. నెలన్నర రోజులుగా లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా మూతపడిన ఫ్యాక్టరీలు ఒక్కొక్కటే తెరుచుకుంటున్న నేపథ్యంలో చాలారోజులుగా మూసివేసిన ఈ ఫ్యాక్టరీలను పునరుద్ధరించే క్రమంలో కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల విశాఖ తరహాలో మరికొన్ని పరిశ్రమల్లో కూడా ఇదేసమయంలో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఛత్తీస్‌ఘడ్‌ ‌లోని పేపర్‌ ‌మిల్లులో కూడా గ్యాస్‌ ‌లీక్‌ అవడంతో ఏడుగురు అస్వస్థతకు గురె•య్యారు. అలాగే తమిళనాడులోని కడలూరు కోల్‌ ‌మైనింగ్‌ ‌కంపెనీలో బాయిలర్‌పేలి ఏడుగురికి గాయాలయ్యాయి. దీంతో  ప్రమాదకర పరిశ్రమల పరిశీలనపై రాష్ట్ర ప్రభుత్వాలిప్పుడు  శ్రద్ధ చూపుతున్నాయి. విశాఖ ప్రమాదంతో ఆ రాష్ట్రంలో ఇలాంటి పరిశ్రమలు మరో 86 వరకున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇవ్వన్నీ పారిశ్రామిక చట్టానికి లోబడి పనిచేస్తున్నాయా లేదా అని పరిశీలిస్తున్నాయి. తెలంగాణలో కూడా ఇలాంటి ప్రమాదకర పరిశ్రమలు లేకపోలేదు. అయితే ఇలాంటి పరిశ్రమలను నగరం వెలుపలకు మార్చాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్ణయం తీసుకోవడంతో కొన్నికొన్ని ఫ్యాక్టరీలు మారుతున్నా, ఇంకా మారాల్సినవి చాలా ఉన్నాయి.

జీడిమెట్ల పారిశ్రామికవాడ, దూలపల్లి, పటాన్‌చెరువు, సమీపంలోని పారిశ్రామిక వాడ, నాచారం మందుల ఫ్యాక్టరీల్లో సంభవించిన ప్రమాదాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. విషవాయువులను వెలువరించే పరిశ్రమలకు నగరం వెలుపల స్థలాలను కేటాయించినా, నిబంధనలకు విరుద్ధంగా జనావాసాలకు నగరపాలకులు అనుమతులివ్వడంతో ఆ ఫ్యాక్టరీలు జనవాసాల మధ్యలోకి చేరుపోవడంతో ప్రమాదాలు జరిగినప్పుడు అనేక మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణంగా మారుతున్నాయి. ఇవ్వాళ విశాఖలో జరిగింది కూడా అదే. సుమారు అర్ధశతాబ్ధం క్రితం నెలకొల్పబడినప్పుడు ఈ ఫ్యాక్టరీ ఊరికి దూరంగానే ఉండింది. ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక వాడగా గుర్తించడంతో అనేక చిన్నపెద్ద పరిశ్రమలొచ్చాయి. వాటితోపాటు వాటిల్లో పనిచేసే కార్మికులు, వారికుటుంబాలతో పాటు ఇతరులు అక్కడ నివాసాలు ఏర్పరుచుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తున్నా  ప్రభుత్వం, పరిశ్రమల శాఖ నిమ్మకు నీరెత్తినట్లు ఉండడమే ఇలాంటి ప్రమాదాలకు కారణంగా మారుతున్నది.

మండువ రవీందర్‌ ‌రావు
గెస్ట్ ఎడిటర్‌

Comments (0)
Add Comment