హిజ్రా ఆత్మ ఘోష

ఏ పూజా క్రతువుకు
పనికి రాని పువ్వులం

ఏ విలువల సేద్యానికి
అక్కర్లేని అంకురాలం

ఏ సంఘానికి పట్టని
నిరర్థక నిష్ఠూరులం

ఏ చరిత్ర పుటలకెక్కని
అనామక దీన గాధలం..

దుఃఖం మా నిషానా
చీకటి మా చిరునామా

మేమే.. నపుంసకులం
థర్డ్ ‌జెండర్‌.. ‌కొజ్జాలం

ఈ విశాల దేశంలో
అడుగడుగునా…

వేదింపు వలపోత తప్పా
ఆత్మీయ పిలుపు దూరం

వివక్ష ఉక్కపోత తప్పా
సమైక్య స్పర్శ అదృశ్యం

వెరసి హిజ్రాల బతుకు
గడియ గడియ గండం
ఆసాంతం అగ్ని గుండం

ఓ సభ్య సమాజమా !
కరుణించకున్న పర్లేదు
విద్వేష విషం చిమ్మొద్దు

ఆదరించకున్నా మానే
వివక్ష గునపం దించొద్దు

గౌరవించుకున్నా సరే
బతుక్కు చితి పేర్చొద్దు

జనగణమా ఇకనైనా
మనోనేత్రంతో వీక్షించి
ఈ అభాగ్య జీవులను
మనుషులుగా గుర్తించు

థర్డ్ ‌జెండర్‌ ఆత్మ ఘోష ఆవిష్కరిస్తూ…)
– కోడిగూటి తిరుపతి, 9573929493

Comments (0)
Add Comment