నిస్వార్థ సేవకుడు!

  • సిక్కు గురువులలో ప్రథములు గురునానక్‌ దేవ్‌!
  • నేడు ఆయన  జయంతి

పదిమంది సిక్కు గురువులలో ప్రథములు గురునానక్‌ దేవ్‌. నానక్‌ 1469 ఏప్రిల్‌ 15న పాకిస్తాన్‌ లోని ప్రస్తుతం లాహోర్‌ సమీపంలోని తల్వాండీ గ్రామంలో (నన్కానా సాహిబ్‌)లో (ఇది అప్పటి ఢల్లీి సుల్తానేట్‌  ప్రావిన్స్‌, ప్రస్తుతం ఈ ప్రదేశం నంకన్‌ సాహిబ్‌ అని పిలువ బడుతూ ఇప్పుడు పాకిస్థాన్‌ లో ఉంది) నానక్‌ దేవ్‌ కార్తీక పౌర్ణమి పుణ్య దినాన జన్మించారు. గురునానక్‌ తల్లిదండ్రులు కళ్యాణ్‌ చంద్‌ దాస్‌ బేడి, వీరిని కళ్యాణ్‌ దాస్‌ మెహతా మరియు మాతా త్రిప్తి అని కూడా పిలుస్తారు. హిందూ, ఇస్లామియా మత గ్రంథాలను చదివి, అవగాహన చేసుకుని, రెండు మతాలకు భిన్నమైన సిక్కు మతాన్ని స్థాపించారు. సిక్కు మతం ఏకేశ్వరోపాసక మతం. సిక్కులు ఏక్‌ ఓంకార్‌ (ఏకైక దేవుడు)ని విశ్వసిస్తారు. సిక్కుమత స్థాపకులై, ఏకేశ్వరోపాసనను ప్రబోధించి, కుల వ్యవస్థను వ్యతిరేకించారు.

నానక్‌ దేవ్‌ అనంతరం ఈ గురు పరంపర కొనసాగుతున్నది. ఐదవ గురువు అర్జున్‌, తమకు ముందు గురువులకు దైవం అనుగ్రహించిన సూక్తులను, బోధనలను సంకలనం చేసి, ‘‘గురుగ్రంథ సాహిబ్‌’’ పవిత్ర గ్రంథ రూప కల్పన గావించారు. నానక్‌ తండ్రి కళ్యాణ్‌ చంద్‌దాస్‌, కలుమెహతాగా సుపరిచితులై, ప్రభుత్వంలో భూ రెవెన్యూ వ్యవహారాల గుమాస్తాగా పని చేసే హిందూ పట్వారీ. తల్లి మాతా త్రిపుర, అక్క బీబీనాన్కీ. నానక్‌దేవ్‌ బాల్యం నుండే ప్రశ్నించే, ఆలోచించే తత్వం కలవారు. చిరుప్రాయంలోనే మతపరమైన ఉపనయనం చేసి, జంధ్యం వేయబోగా తిరస్కరించి, అంతకంటే భగవంతుని నిజ నామాన్ని హృదయంలో ధరిస్తామని, భగవన్నామం యజ్ఞోపవీతం నూలుపోగులా తెగిపోవడం, మట్టిలో కలిసి పోవడం ఉండక, అఖండంగా రక్షణ కలిగిస్తుందనీ వాదించారు.

అత్యంత చిన్న వయసునుండి అక్క బీబీనాన్కీ, తమ్మునిలో భగవంతుని జ్యోతిని చూడగా, ఈ రహస్యాన్ని ఎవరితోనూ ఆమె పంచుకోలేదు. ఆమె నానక్‌జీ తొలి శిష్యురాలిగా పేరొందారు. బాల్యంలోనే హిందూమతం లోని తాత్వికతకు ఆకర్షితులై, జీవిత రహస్యాల అన్వేషణ కోసం ఇల్లు వదలి పోయారు. ఈ క్రమంలోనే నానక్‌దేవ్‌ ముఖ్య తాత్వికులైన కబీర్‌, రవిదాస్‌లను కలుసు కున్నారు. బతాలాకు చెందిన వ్యాపారి మూల్‌చంద్‌ చోనా కూతురు సులేఖినిని వివాహ మాడారు. శ్రీచంద్‌, లక్ష్మీదాస్‌ అనే కుమారులు వారికి కలిగారు. 28ఏళ్ళ వయసులో నానక్‌ ఒక ఉదయం నది స్నానం, ధ్యానానికి వెళ్ళగా, మూడు రోజులు ఎవరికీ కన్పించలేదు. తిరిగి వచ్చి, దేవుని పవిత్రాత్మను నింపుకున్నాను అని ప్రకటించారు. అనంతరం ‘‘హిందువూ లేడు, ముస్లిమూ లేడు’’ అని మత సామరస్య బోధనలను వ్యాప్తి చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత నాలుగు ప్రధాన దిశల్లో టిబెట్‌, దక్షిణాసియాలోని పలు ప్రాంతాలు, అరేబియా, మక్కా, బాగ్ధాద్‌, ముల్తాన్‌ తదితరాలలో ఉదాసీలనే పేరున భగవంతుని సందేశాన్ని ప్రబోధిస్తూ, ప్రయాణాలు సాగించారు. గురునానక్‌ దేవ్‌ ప్రకారం సిక్కు మతానికి సంబంధించి మూడు మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి. నామ్‌ జపన (దేవున్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవడం), కిరాత్‌ కర్ణ (నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటం), వంద్‌ చకనా (మీతో ఉన్న దానిని ఇతరులతో పంచుకోవడం).

ఇతరుల సంపాదనపై ఆధారపడి జీవించకూడదు. నానక్‌ బోధనలలో… భగవంతుడే అతి ముఖ్యమైన వాడు. దేవుడు ఒక్కడే. ఆకలితో అలమటించే వారికి అన్నం యిచ్చేవారినీ, దుస్తులేని వారికి దానం చేసే వారిని దేవుడు ప్రేమిస్తాడు. అందరూ గొప్ప పుట్టుక కలవారే. అత్యాశను జయించిన వారిని భగవంతుడు ప్రేమిస్తాడు.  పవిత్రమైన హృదయంతో అతడిని ధ్యానించడం, అతడిని ప్రశంశించడం అన్నవే ముక్తి మార్గాలు అనేవి ముఖ్యమైనవి. నానక్‌ జీవిత చరమాంకంలో ఉచిత ప్రసాదం లభించిన కర్తార్‌పూర్‌లో జీవించారు. తాను తీసుకునే ఆహారాన్ని కుల, మత బేధం లేకుండా పంచుకునే వారు. పొలాలలో పని చేసి జీవితం గడిపారు. కొత్త సిక్కు గురువుగా భాయ్‌ లెహ్నాను ప్రకటించాక సెప్టెంబర్‌  అక్టోబర్‌ 22న 1539లో తన 70వ ఏట స్వర్గప్రాప్తి పొందారు.
-రామకిష్టయ్య సంగనభట్ల
9440595494

Breaking News Nowprajatantra newstelangana updatestelugu kavithaluToday Hilights
Comments (0)
Add Comment