నేడు సిద్ధిపేట పర్యటనకు సిఎం కేసీఆర్‌

  • ‌పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
  • సిద్ధిపేట డిగ్రీ కళాశాల మైదానంలో బహిరంగ సభ
  • ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీష్‌రావు
  • పర్యటన సజావుగా జరిగేందుకు అధికారులకు హరీష్‌రావు దిశానిర్దేశం
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సిఎం కేసీఆర్‌ ఈ ‌పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు మరికొన్నింటిని ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రాక సందర్భంగా సిద్ధిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సభలో 8వేల మంది కూర్చునే విధంగా మరో 5వేల మంది నిలబడే విధంగా ఏర్పాట్లను చేశారు. సిఎం కేసీఆర్‌ ‌నియోజకవర్గ పర్యటనకు సంబంధించి గత నాలుగు రోజులుగా మంత్రి హరీష్‌రావు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బుధవారం కూడా మంత్రి హరీష్‌రావు సిఎం కేసీఆర్‌ ‌పర్యటించే ప్రాంతాలన్నింటిని సందర్శించారు.
ఏర్పాట్లకు సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా, సిఎం కేసీఆర్‌ ‌పర్యటన సజావుగా జరిగే విధంగా సంబంధిత అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. సిఎం కేసీఆర్‌ ఈ ‌పర్యటనలో అత్యంత ముఖ్యమైంది ఐటి టవర్ల నిర్మాణానికి శంకుస్థాపన. వీటితో పాటు అనేక కార్యక్రమాలున్నాయి. సిద్ధిపేట శివారులోని నాగులబండ వద్ద నూతనంగా కొత్తగా నిర్మించిన కలెక్టరేట్‌ ‌భవన సముదాయం, పోలీస్‌ ‌కమిషనరేట్‌ ‌కార్యాలయాలను ప్రారంభించడంతో పాటు వీటి సమీపంలోనే నిర్మించిన హరిత హోటల్‌ ‌ప్రారంభించడంతో పాటు సుమారు 45కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఐటి టవర్‌ ‌నిర్మాణానికి సిఎం కేసీఆర్‌ ‌శంకుస్థాపన చేయనున్నారు. దేశంలోనే తొలిసారిగా నర్సాపూర్‌లో 163కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 2460 డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇండ్ల గేటెడ్‌ ‌కమ్యూనిటీని ప్రారంభించనున్నారు. 135 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్‌ ‌కళాశాలకు ప్రారంభోత్సవంతో, 225 కోట్లతో నిర్మించనున్న 960 పడకల హాస్పిటల్‌కు శంకుస్థాపన చేస్తారు. 278 కోట్లతో సిద్దిపేట చింతల్‌ ‌చెరువు యూజిడిని ప్రారంభిస్తారు.
8కోట్ల రూపాయల వ్యయంతో రంగనాయకసాగర్‌ ‌జలాశయం మధ్యలో నిర్మించిన రంగనాయకసాగర్‌ అతిథి గృహంను సిఎం కేసీఆర్‌ ‌ప్రారంభించి అక్కడే లంచ్‌ ‌చేస్తారు. వీటితో పాటు మిట్టపల్లి రైతు వేదిక, విపంచి ఆడిటోరియంను సిఎం కేసీఆర్‌ ‌ప్రారంభిస్తారు.  కోమటిచెరువు అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు చివరగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో పబ్లిక్‌ ‌మీటింగ్‌లో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పర్యటనకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మీటింగ్‌ను సక్సెస్‌ ‌చేసేందుకు మంత్రి హరీష్‌రావు, జిల్లా కలెక్టర్‌ ‌పరపతి వెంకట్రామరెడ్డి గత నాలుగు రోజులుగా రాత్రింబవళ్లు శ్రమించారు.
CM KCR to visit Siddipet todayDistrict Collector Parapathy VenkatramareddyKomati cheruvuminister harish rao
Comments (0)
Add Comment