“వెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లుంది” విద్యా హక్కు చట్టం ఉపాధ్యాయ పదోన్నతులకు టెట్ తప్పనిసరి చేయటం.
విద్యా హక్కు చట్టం,జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్ సి టి ఈ)నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులు పదోన్నతి పొందాలంటే టెట్ లో ఉత్తీర్ణత తప్పని. ఈ విషయంపై టెట్లో అర్హత సాధించిన కొంత మంది ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించడంతో పదోన్నతుల ప్రక్రియ ఆగిపోయింది.ప్రస్తుతం పదోన్నతి పొందాలంటే టెట్ ఉత్తీర్ణత సాధించాలని విద్యాశాఖ నిర్ణయించడంతో వేలాది మంది ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. ఎప్పుడో 20,25 సంవత్సరాల క్రితం పాఠశాల ఉపాధ్యాయులుగా నియమించబడ్డ వారు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందాలంటే ఈ వయసులో టెట్ రాసి ఉత్తీర్ణత సాధించడం సాధ్యమౌతుందా?
ప్రభుత్వ పాఠశాలల పై తీవ్ర ప్రభావం:
ఉపాధ్యాయులు పదోన్నతి పొందాలంటే టెట్ లో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలనే విద్యా శాఖ నిర్ణయం ప్రభుత్వ పాఠశాలలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సుమారు 19వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేవలం 2012 డి ఎస్ సి,2017 టి ఆర్ టి ద్వారా నియామకమైన సుమారు 20వేల మంది ఉపాధ్యాయులకు మాత్రమే టెట్ అర్హత ఉంది.ఇప్పటికే సుమారు పదివేల మంది ఉపాధ్యాయులు టెట్ పాసై ఉండవచ్చు.మొత్తంగా 30 వేల మంది ఉపాధ్యాయులు మాత్రమే టెట్ లో అర్హత కలిగి ఉన్నారు.సుమారు ఒక లక్ష మంది ఉపాధ్యాయులు టెట్ పరీక్ష రాయ లేదు.టెట్ అర్హత నేపథ్యంలో పదోన్నతుల ప్రక్రియ వాయిదా వేయడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రమౌతుంది. దానివల్ల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులు నష్టపోతారు.అలా అని టెట్ అర్హత గల వారితోనే పదోన్నతుల ప్రక్రియ నిర్వహిస్తే సీనియర్ ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయి,సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తూ పదోన్నతులు లేకుండానే రిటైర్డ్ అవుతారు.
విద్యా శాఖ తాసర్యం.
ప్రధానోపాధ్యాయుల మరియు ఇతర శాఖలలో పదోన్నతుల కోసం
జీ ఓ టి, ఈ ఓ టి లాంటి శాఖాపరమైన పరీక్షలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు.అదే మాదిరి విద్యా హక్కు చట్టం అమలు లోకి వచ్చినప్పటి(2010) నుంచే ఉపాధ్యాయ పదోన్నతులకు కూడా టెట్ తప్పనీసరి చేస్తూ అమలు చేసి ఉంటే ప్రారంభంలోనే ఉపాధ్యాయులు దానిపై దృష్టి పెట్టి పరీక్షలు రాసి పాస్ అయ్యి ఉండేవారు. 2010లోనే ఎన్ సి టి ఇ ఈ నిబంధనలు అమలులోకి తెచ్చింది. 2012,2017 ఉపాధ్యాయ నియామకాల్లో ఈ నిబంధనలు అమలు చేసిన విద్యాశాఖ పదోన్నతిలో కూడా ఎందుకు అమలు చేయలేదు?.విద్యా హక్కు చట్టం ప్రకారం పదోన్నతిలో టెట్ తప్పనిసరి కావడంతో 2015 లోపు ఉత్తీర్ణులు కావాలని కేంద్రం గడువు ఇచ్చింది. అయినా ఆ దిశగా విద్యాశాఖ చర్యలు ఎందుకు తీసుకోలేదు?. కేంద్రం మరొక మారు ఐదు సంవత్సరాల గడువు పెంచుతూ 2019 వరకు ఉత్తీర్ణులు కావాలని ఉత్తర్వులు జారీ చేసింది.అయిన అప్పుడెందుకు విద్యా శాఖ అమలు చేయలేదు?. ఎన్ సి టి ఇ గెజిట్ నోటిఫికేషన్ 23-8-2010 ఫేరా 4 ప్రకారం అప్పటికే ఇన్ సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అనుమతితో మినహాయింపు ఇవ్వవచ్చు.GO MS no 36 dt23-12-2015 ప్రకారం ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వబడింది.కానీ ఇప్పుడు టెట్ ఉంటేనే పదోన్నతులకు అర్హులు అని నిర్ణయించడం ఎంతవరకు సమంజసం.గత తొమ్మిది సంవత్సరాలుగా పదోన్నతులు లేక నిరాశతో ఉన్న ఉపాధ్యాయులకు పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమైన ఈ సందర్భంగా టెట్ తప్పనిసరి అని నిర్ణయిస్తే వెంటనే వారు ఎలా అర్హత సాధిస్తారు?.ఈ చర్య వల్ల సుమారు దశాబ్ద కాలంగా పదోన్నతులకోసం ఎదురు చూస్తున్న వేలాది మంది ఉపాధ్యాయుల ఆశల్లో నీళ్లు చల్లినట్లు కాదా?.
45 సం”రాలు దాటిన ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలి.
44 సంవత్సరాలు దాటిన వారికి టెట్ వ్రాసే అర్హత లేదు.కాబట్టి సుమారు 20,25 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులకు వారి బోధన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని,ఈ వయసులో వారికి ఉన్న బరువు,బాధ్యతలను దృష్టిలో ఉంచుకొని 45 సంవత్సరాలు దాటిన ఉపాధ్యాయ లకు పదోన్నతిలో టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలి.
ప్రత్యేక టెట్ అవసరం.
ప్రస్తుతం బిఈడి అభ్యర్థులు వ్రాస్తున్న
టెట్ లో ఉపాధ్యాయులు అర్హత సాధించడం కొంత కష్టం.ఎందుకంటే ఉపాధ్యాయులు పదోన్నతి పొందే సబ్జెక్టులో తప్పనిసరిగా డిగ్రీ లేదా తత్సంబంధ అర్హత సాధించి ఉంటారు. కొందరైతే పీజీ అర్హత సాధించి ఉంటారు.టెట్ లో ఆ సబ్జెక్టులో ఎంత కఠినమైన ప్రశ్నలు అడిగిన సమాధానాలు వ్రాయగలరు.కాబట్టి సులభంగానే టెట్ పాస్ కాగలరు.
కానీ బీఈడీ అభ్యర్థులు వ్రాస్తున్న టెట్ లో అడుగుతున్న ప్రశ్నలు విచిత్రంగా ఉన్నాయి.సాంఘిక శాస్త్ర పదోన్నతి కోసం అర్హత ఉన్న ఉపాధ్యాయులకు టెట్ లో తెలుగు పరిజ్ఞానాన్ని పరీక్షించే ప్రశ్నలు ఉంటాయి. జీవశాస్త్ర పదోన్నతి కోసం అర్హత ఉన్న ఉపాధ్యాయులు టెట్లో గణిత సంబంధ ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది.గణిత శాస్త్ర పదోన్నతి కోసం అర్హత ఉన్న ఉపాధ్యాయుడు టెట్లో జీవశాస్త్ర సంబంధ ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది.20,25 సంవత్సరాల సర్వీస్ ఉన్న సీనియర్ ఉపాధ్యాయులు ఇప్పుడు తమ సబ్జెక్ట్ కాకుండా ఇతర సబ్జెక్టను ఎలా ప్రిపేర్ కాగలరు.
టెట్ అర్హత లేకుండా పదోన్నతి ఇవ్వని పక్షంలో ఇన్ సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు పదోన్నతి కోసం ప్రత్యేక టెట్ నిర్వహించాలి. సాధారణంగా నిర్వహించే టెట్లా కాకుండా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు వారు బోధించబోయే సబ్జెక్టునీ,బోధన అనుభవాన్ని,బోధన మెలకువలను పరీక్షించే విధంగా సులభతరంగా ఉండేటట్లు ప్రత్యేక టెట్ నిర్వహించాలి.ఇంకా అవసరమైతే జీ ఓ టి,ఈ ఓ టి మాదిరి చూసి రాసే పద్ధతిలో టెట్ నిర్వహించాలి.
పదోన్నతుల ప్రక్రియ కొనసాగించాలి. పదోన్నతులకు టెట్ తప్పనిసరి అని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునర్ సమీక్షించాలి. కోర్టు తీర్పుల వలన మధ్యలో నిలిచిపోయిన పదోన్నతుల ప్రక్రియను కోర్టు ప్రత్యేక అనుమతితో నిర్వహించుటకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.కోర్టు అనుమతి ఇవ్వని పక్షంలో కనీసం పదోన్నతులు పొందిన తరువాత మూడు సంవత్సరాల లోపు టెట్ పాస్ కావాలనే షరతుపై పదోన్నతుల ప్రక్రియ కొనసాగించాలి. ఇప్పటికే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్ర రూపంలో ఉన్నందున పదోన్నతుల తర్వాతనే కొత్త డీఎస్సీ నిర్వహిస్తే మెగా డీఎస్సీకి సాధ్యం అవుతుంది. కాబట్టి 2010 కాన్న ముందు ఉపాధ్యాయులుగా నియామకం అయిన వారికి టెట్ నిబంధన లేనందున ఉపాధ్యాయల పదోన్నతుల్లో కూడా టెట్ నిబంధన వర్తింపకుండా చట్టంలో ఉన్న మినహావింపులను ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అభ్యర్థనతో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు పదోన్నతిలో టెట్ అర్హత మినహాయింపుకు అనుమతి తీసుకోవాలి.లేదా టెట్ వ్రాయడానికి అర్హత కూడా 44 సంవత్సరాలే కాబట్టి ప్రభుత్వం ఇన్ సర్వీస్ లో ఉండి 45 సం”రాలు దాటిన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి.లేదా పదోన్నతుల ప్రక్రియను కొనసాగిస్తూ మూడు సంవత్సరాల్లో అర్హత సాధించాలనే నిబంధన మేరకు పదోన్నతులు చేపట్టాలి. ప్రభుత్వం ఏదో ఒక పరిష్కారం ద్వారా ఇటు ఉపాధ్యాయులకు,అటు నిరుద్యోగులకు న్యాయం చేయాలి.
-జుర్రు నారాయణ యాదవ్
తెలంగాణ టీచర్స్ యూనియన్
మహబూబ్ నగర్
9494019270.





