నవ్వుల జాడ కనిపించక ఎన్నాళ్ళయిందో ?
మోమున చెరిగిపోని అందాల్ని
పులిమే నవ్వులు లేక మనుషులంతా
జీవం కోల్పోయిన మరబొమ్మలై
చుట్టూ తిరుగుతున్నారు !

గతాన తెలిసిన వారెవరైనా
తెలియనివారెవరైనా ఎదురైతే
ఒక చిరునవ్వుతో యెదలను మీటి
జీవన సంగీతాన్ని వినిపించే వారు!
హసముఖుల ఆనవాళ్లు కరువై అందరూ
రోగ ప్రళయ భయ పీడితులై
నవ్వుల వెలుగుల వెన్నెల
రాకకోసం ఎదిరి చూస్తున్నారు !

తమ చిర్నవ్వులే చిరునామాగా
అందరి బ్రతుకులలో నవ్వులు పూయింప
అక్షరాన్ని ఆయుధంగా
గళాలను శంఖారావం చేసి
పోరాడే యోధుల నవ్వుల్ని
నిర్భంధ చట్రాలతో
పాశవికంగా అణచాలనుకున్నా
నవ్వులు ఉదయించక మానవు!
శత్రువు గుండెల్లో ‘నిజాయితీ నవ్వు‘
సుతిమెత్తని సూదులుగా దిగక మానవు !

చీకటి తెరలు తొలగి
వెలుగు రేఖలు విచ్చుకుని
నిఖిల లోకాన
సకల జనులు
ఆనంద పర్వాన్ని నవ్వులతో
ఉత్సవంగా జరుపుకోవాలి !

వెలుతురును, వెన్నెలను
చెరపట్ట లేనట్టే మనిషి నవ్వులను మాయం
చేయ లేరెవరు
నవ్వులు పూయటం మనిషికి
సృష్టి అందించిన సహజ వరం !
(సుప్రీం కోర్టులో వి వి బెయిల్‌ ‌సందర్భంగా ప్రాసిక్యూషన్‌ ‌వారు వి వి చెరగని నవ్వును, మానసికంగా కృంగిపోని తత్వాన్ని చూపి బెయిల్‌ అవసరం లేదని అజ్ఞానంగా అన్న సందర్భంగా)
   – డా. కె. దివాకరా చారి, 9391018972

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *