తెలంగాణలో రానున్న ఎన్నికల విషయానికొస్తే ప్రధానంగా ముప్పై శాసనసభ స్థానాలపై ఇటీవల రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో 119 శాసనసభ స్థానాలుండగా కేవలం ముప్పై స్థానాలగురించే రాజకీయ పార్టీలు ఎందుకు ప్రస్తావిస్తున్నాయన్న ప్రశ్న ఉద్భవించకపోదు. ఈసారి వంద స్థానాలను గెలుచుకుని హ్యాట్రిక్ సాధిస్తామని అధికార భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) ప్రకటిస్తున్నది. అందుకు కావల్సిన ప్రణాళికలను సిద్ధం చేసుకుని ఇప్పటికే పార్టీ శ్రేణులను పరుగులు పెట్టిస్తున్నది. శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ఒకదాని వెనుక ఒకటిగా సంక్షేమ ప పథకాల ను అమలు చేస్తూ చాలా బిజీబిజీగా ఉంటోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ సాధించిన పార్టీగా బిఆర్‌ఎస్ (టిఆర్‌ఎస్)కు రెండు దఫాలుగా ప్రజలు అధికారాన్ని అందించారు. 2014లో అరవై మూడు స్థానాలనే నెగ్గినప్పటికీ బిఆర్‌ఎస్సే అధికారాన్ని చేపట్టింది. అలాగే 2018 ఎన్నికలు వొచ్చేసరికి బిఆర్‌ఎస్ సర్కార్ చేపట్టిన పథకాలైతేనేమీ, ప్రభుత్వ పనితీరు వల్లనైతేనేమీ 2014 కన్నా ఎక్కువ స్థానాలనిచ్చి మరోసారి ఆ పార్టీకే పట్టం కట్టారు. ఈసారి 88 స్థానాలను గెలుచుకున్న బిఆర్‌ఎస్‌కు తిరుగులేకుండా పోయింది. అయితే అంతటితో ఆగలేదు. 2018లో ఇతర పార్టీలనుండి గెలిచిన ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మొత్తం మరో పదహారు మంది అదనంగా ఆ పార్టీలో చేరిపోయారు.
దీంతో గులాబీ కారు 104 మంది ఎమ్మెల్యేల తో కిక్కిరిసి పోయింది. బహుషా ఆ సంఖ్యను చూసే రానున్న ఎన్నికల్లో తాము వంద స్థానాలను గెలిచి తీరుతామని ఆ పార్టీ అధినేత కెసిఆర్ పలు సందర్భాల్లో ప్రకటిస్తూ ఉండవొచ్చు. అంతే కాదు సిట్టింగ్ ఎమ్మెల్యేల కే తిరిగి టికట్ కేటాయిస్తామని కూడా వాగ్ధానం చేశారు. దీంతో ఎంతో కొంత అనుమానాలున్న ఎమ్మెల్యేలు కూడా హమ్మయ్య అని శ్వాస తీసుకున్నంత సేపు పట్టలేదు వారి ఆనందం. ఎట్టి పరిస్థితిలో వొచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బిఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికే పలు సర్వేలు చేయించింది. నాయకుల పట్ల ప్రజల స్పందన ఎలా ఉంది. వొచ్చే ఎన్నికల్లో టికట్ ఇస్తే గెలిచే అవకాశాలున్నాయా లాంటి పలు విషయాలపై ఈ సర్వే జరిగినట్లు ఆ వర్గాల ద్వారా తెలుస్తున్నది. నాయకుల పనితీరుపైన చేసిన సర్వేల్లో సిట్టింగ్‌లపై పలు ఆరోపణలు వొచ్చినట్లు వార్తలు వొస్తున్నాయి. అంతేగాక ప్రతీ నియోజకవర్గంలో అధికార పార్టీలోనే అంతర్ఘత విభేదాలు బహిరంగంగానే ప్రకటితమవుతున్న విషయాన్ని అధిష్టానం అర్థం చేసుకుంటోంది. ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టపోయినట్లు అతి స్వల్ప మెజార్టీతో గెలిచిన వారి వివరాలను కూడా అధిష్టానం ప్రత్యేకంగా సేకరించినట్లు తెలుస్తున్నది. ఇందులో కూడా క్యాటగిరీలు చేసినట్లు తెలుస్తున్నది. అయిదు వేల లోపు మెజార్టీ వొచ్చినవారు, పదివేల లోపు మెజార్టీ వొచ్చినవారెవరన్న జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది. ఇందులో కేవలం ఎంఎల్యేలే ఎమ్మేల్యే లే కాకుండా మంత్రులుకూడా ఉండడం గమనార్హం. అలాగే ఇతర పార్టీలనుండి వొచ్చిన వారుకూడా అతిస్వల్ప మెజార్టీ పొందిన వారున్నారు. ఇప్పటికే అధిష్టానం వీరందరికి క్లాస్ తీసుకుంటున్నట్లు కూడా సమాచారం. వీరిలో 170, 300, 440 మెజార్టీ వొచ్చిన వారున్నారు.
మరి వొచ్చే ఎన్నికల్లో వీరికి టికట్ ఇస్తే గెలుస్తారా? పరువు తీస్తారా? అన్న మీమాంసలో పడింది పార్టీ అధిష్టానం. వందలనుండి పదివేల లోపు మెజార్టీ తెచ్చుకున్నవారు దాదాపు ముప్పై నుండి ముప్పై అయిదు మంది వరకుంటారన్నది ఒక అంచనా. దీన్ని దృష్టిలో పెట్టుకునే కాబోలు ఈసారి ఎన్నికల్లో ముప్పై మంది బిఆర్‌ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతవుతాయని కరాఖండీగా చెబుతున్నాడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. ఓడిపోతానన్న భయంతోనే ముప్పై స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు డబ్బులిచ్చి బలపర్చేందుకు బిఆర్‌ఎస్ ప్రణాళిక రచిస్తోందంటూ ఆయన ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే బిఆర్‌ఎస్ ఎమ్మేల్యేలు 25 మంది తనతో టచ్‌లో ఉన్నారంటూ ఇటీవలనే ఆయన చేసిన ప్రకటన బిఆర్‌ఎస్‌లో ప్రకంపనలు పుట్టిస్తోంది.కాగా ఆ ఇరవై అయిదుగురు ఎవరన్న విషయమై తర్జనభర్జనలు జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే బిఆర్‌ఎస్‌కు వంద సీట్లు కాదు అసలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యే రాదని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అంటున్నారు. గతంలో బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ప్రకటించినట్లు 104 మంది సిట్టింగ్ లకు టికట్ కేటాయించి తన మాట నిలబెట్టుకోవాలని సవాలు చేస్తున్నాడు రేవంత్‌రెడ్డి. ఈ తొమ్యిదేళ్ళ కాలంలో తెలంగాణ బాగా అభివృద్ధి జరిగిందని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రికి నిజంగానే తాను చేసిన అభివృద్ధిపైన నమ్మకం ఉంటే సిట్టింగ్‌లకే టికట్లు కేటాయించాలంటారాయన. అప్పుడే బిఆర్‌ఎస్ ప్రభుత్వం పాలన, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరేమిటన్నది ప్రజలే తీర్పు చెబుతారంటున్నారాయన. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 16వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్‌తో పాలన ప్రారంభం అయిందని, దాన్ని ఇప్పుడు బిఆర్‌ఎస్ సర్కార్ అయిదు లక్షల కోట్ల రూపాయల అప్పుతో ప్రజలపై పెను భారాన్ని మోపిందని రేవంత్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా వొచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు డెబ్బై నుండి 75 స్థానాలకు మించి రాకపోవవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద ఈసారి ఎన్నికల్లో 30 స్థానాల మిస్టరీ హిస్టరీ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.




