Take a fresh look at your lifestyle.

జిస్‌కా లాఠీ ఉస్‌కీ బయింస్‌

దుడ్డు ఎవరిదో బర్రె వాడిదన్న నానుడిలా ఉంది ఏపి ప్రభుత్వ వైఖరి. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ఆమోదంతో పని లేకుండా తమకు ఇష్టంవచ్చిన మార్పులు చేర్పులు చేసుకోవచ్చని ఏపి ప్రభుత్వం ఇప్పుడు చెప్పకనే చెప్పింది. ప్రజల అభిమానాన్ని చూరగొన్న నాయకుడెవరైనా దివంగతులైతే వారి జ్ఞాపకార్థం కొత్త నిర్మాణాలకు, సంస్థలకు, విశ్వవిద్యాలయాలకు లేదా రహదారులకు వారి పేర్లను గౌరవ సూచకంగా పెడుతుండడం అనవాయితీగా వొస్తున్నది. అయితే తాజాగా ఏపి ప్రభుత్వం ఉన్న పేర్లను చెరిపేస్తూ తమకు నచ్చిన వారి పేర ఆయా సంస్థలకు నామకరణం చేయడం మొదలు పెట్టింది. ఇదే వైఖరి రానున్న ప్రభుత్వాలు కూడా అనుసరిస్తే కొంతకాలానికి వాస్తవంగా వాటి పేర్లేమిటని జుట్టు పీక్కునే పరిస్థితి ఏర్పడక పోదు.

పేరు మార్పుల విషయంలో ఏపి ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం కేవలం ఏపి రాష్ట్ర ప్రజలకే కాదు, ప్రపంచంలోని తెలుగువారి నందరినీ ఆశ్చర్యంలో ముంచిదనే చెప్పాలె. అదిప్పుడు ప్రధాన చర్చగా మారింది. ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో విమర్శలు, ప్రతి విమర్శలకు దారితీస్తున్నది. విజయవాడలోని నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్‌) ‌హెల్త్ ‌యూనివర్శిటీ పేరును వైఎస్‌ఆర్‌ ‌హెల్త్ ‌యూనివర్శిటీగా మారుస్తూ ఏపి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్నారు. ఈ నిర్ణయం తమ ప్రధాన ప్రత్యర్థి పార్టీ అయిన తెలుగుదేశంపై కత్తి కడుతున్న విధానంలో పరాకాష్టకు చేరిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత పాలకులు పెట్టిన పేర్లను చెరిపి వేయడమంటే వారి పాలన ఆనవాళ్ళు కూడా కనిపించవద్దన్న కసి అందులో స్సష్టమవుతున్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనవసర నిర్మాణాలు, చాలీచాలని భవనాలను కూల్చి మరింత విశాల సౌధాలు నిర్మించడమన్నది అభివృద్దికి చెందిన విషయం. కాని, దశాబ్దాల కాంగ్రెస్‌ ‌పాలనకు ఎదురొడ్డి, కొత్త పార్టీ నిర్మాణం చేసి, కేవలం తొమ్మిది నెలల కాలంలోనే అధికారంలోకి వొచ్చి, నూతన సంస్కరణలను ప్రవేశపెట్టి, రాజకీయాల్లో వినూత్న అధ్యాయానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి పేరును చెరిపి, అదే స్థాయిలో ప్రజల ఆదరణ పొందిన మరోనేత పేరు పెట్టడమన్నది ఆంతకుముందు పేరున్న నాయకుడిని అవమానించడమవుతుందన్న విషయం నేటి పాలకులకు తెలియక చేస్తున్నరని అనుకోలేము.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో యూనివర్శిటీ ఆఫ్‌ ‌హెల్త్ ‌సైన్పెస్‌ను 1986లో ప్రారంభించబడింది. అయితే ఎన్టీఆర్‌ ‌మరణానంతరం 1998లో దీని పేరును ఎన్టీఆర్‌ ‌యూనివర్శిటీ ఆఫ్‌ ‌హెల్త్ ‌సైన్సెస్‌గా మారుస్తూ చట్టాన్ని సవరించారు. అప్పటి నుండి అదే పేరుతో కొనసాగుతున్నది. కాగా • ఇప్పుడు జగన్‌ ‌సర్కార్‌ ‌దాని పేరును వైఎస్‌ఆర్‌ ‌యూనివర్శిటీగా మారుస్తూ రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకుంది. కేవలం నిర్ణయమే కాదు. బుధవారం సవరణ బిల్లును శాసనసభలో ప్రవేశ పెట్టి అమోదింప జేసుకోవడం అనూహ్య పరిణామం. దీన్ని వ్యతిరేకించిన టిడిపి ఎంఎల్‌ఏలను సభ నుండి సస్పెండ్‌చేశారు. తమపార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ ‌పేరును తొలగిస్తూ శాసనసభ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం పట్ల టిడిపి సభ్యులు తీవ్ర మనస్తాపానికి గురైనారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దిల్లీలో తాకట్టు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ వారి గౌరవాన్ని ఇనుమడింప జేసిన నాయకుడు ఎన్టీఆర్‌. అలాంటి వ్యక్తి పేరును తొలగించడం తెలుగు ప్రజలకు కూడా అవమానకరమని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ ‌కుటుంబంకూడా ఈ సంఘటన పట్ల తమ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది. నందమూరి రామకృష్ణ పేరున విడుదల చేసిన ఒక ప్రకటనలో హెల్త్ ‌యూనివర్శిటీ పేరును మార్చడం దురదృ్ట••కరమని, ఒక విధంగా తెలుగుజాతిని అవమానించినట్లేనని వారందులో పేర్కొన్నారు. ఈ విషయంలో మనస్తాపానికి గురైన అధికార భాషాసంఘం, తెలుగు భాష సాధికారిత సంస్థ, హిందీ అకాడమి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఏపి అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ ‌ప్రకటించారు.

వైఎస్‌ ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన అభిమానులు చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి కుటుంబాలను పరామర్శించేందుకు నేటి ఏపి ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహనరెడ్డి నాడు దాదాపు సంవత్సరానికి పైగానే అనేక గ్రామాలు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన తన తండ్రి వైఎస్‌ ‌విగ్రహాలను నెలకొల్పుకుంటూ పోయారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వొచ్చింది. నాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో తన రాజకీయ ప్రత్యర్థి వైఎస్‌ ‌విగ్రహాలను తొలగించాలని నిర్ణయం తీసుకుని ఉంటే ఇవ్వాళ ఊరూర వైఎస్‌ ‌విగ్రహాలు ఉండేవా అని ఆ పార్టీ శాసనసభపక్ష ఉప నేత అచ్చెన్నాయుడు వేసిన ప్రశ్న కూడా ఆలోచించాల్సిన విషయమే. కాగా, వైఎస్‌ ‌పేరు మార్పు సరైనదేనని చెబుతున్న వైఎస్‌ ‌జగన్‌, ఎన్టీఆర్‌ ‌వైద్య రంగంలో ఏవైనా గొప్ప కార్యక్రమాలు చేసి ఉంటే తాను ఈ మార్పిడి చేసి ఉండేవాడిని కాదంటూ సమర్థించుకోవడంతో పాటు తన తండ్రి మూడు, తాను పదిహేడు మొత్తం ఇరవై వైద్యళాశాలలను ఏర్పాటు చేశామని అందుకు ఆయనే ఆర్హుడన్న వాదనను జగన్‌ ‌వినిపిస్తున్నాడు. నిజంగానే తనకు ఎన్టీఆర్‌పై గౌరవం లేకపోతే ఒక జిల్లాకే ఆయన పేరును ఎలా పెడుతానని ప్రశ్నిస్తున్నారు.

Manduva-Ravinder-Rao
– మండువ రవీందర్‌రావు

 

Leave a Reply