Take a fresh look at your lifestyle.

జబర్దస్తీ ‌వసూల్‌…

  • మహిళా సంఘాలపై ఆర్పీల రుబాబు
  • రూ.1 లక్షకు వేయి కమీషన్‌…‌రుణం మంజూర్‌కు ఇవ్వాలని బెదిరింపులు
  • సీఓల సహకారంతో ఆర్పీల వసూళ్ల దందా
  • కమీషన్‌ ఇవ్వకుంటే ఇబ్బందులు తప్పవంటూ హెచ్చరికలు 

డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు చేయూతనివ్వాల్సిన ఆర్పీలు కమీషన్‌ల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మహిళా సంఘాలకు తక్కువ వడ్డీతో బ్యాంకులు రుణాలు మంజూర్‌ ‌చేస్తున్న తరుణంలో రూ.1లక్షకు కమీషన్‌గా రూ.1,000 చొప్పున ఇవ్వాలంటూ డిమాండ్‌ ‌చేస్తున్నారు. ఆర్పీలను ప్రభుత్వం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఉద్యోగులుగా గుర్తించి నెలకు రూ.4వేలు, మహిళా సమాఖ్య నుంచి రూ.2వేలు గౌరవ వేతనంగా అందిస్తున్నారు. మొత్తం నెలకు రూ.6వేలు వేతనం పొందుతున్న ఆర్పీలు మహిళా సంఘాలకు బ్యాంకులు రుణాలు ఇస్తున్నప్పుడు కమీషన్‌ల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాల్సిన పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో రీసోర్స్ ‌పర్సన్‌ (ఆర్పీ)లు మహిళా సంఘాల నుంచి జబర్దస్త్‌గా వసూళ్లకు దిగుతున్నారు.

మహిళా పొదుపు సంఘాల సక్రమ నిర్వాహణకు తోడ్పాటును అందించాల్సిన ఆర్పీలు అందినంత వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. వీరిపై నిరంతర నిఘా పెట్టాల్సిన సీఓలు వసూళ్ల దందాకు ప్రోత్సాహం అందిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఓ వైపు మహిళా పొదుపు సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం ప్రభుత్వాలు బ్యాంకు రుణాలను సత్వరమే మంజూర్‌ ‌చేయాలని బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహిస్తుంటే మరో వైపు ఆర్పీలు బ్యాంకు రుణంలో రూ.1లక్షకు రూ.1,000 చొప్పున వసూలు చేస్తున్నారు. మహిళా సంఘాలకు రుణం మంజూరైందంటూ చాలూ ఆర్పీలు కమీషన్‌ల కోసం రుబాబు చేస్తున్నారు. బ్యాంకు లోన్‌ ‌వచ్చిందంటే చాలూ పర్సంటేజీ కోసం మహిళా సంఘాలను వేధిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. బ్యాంకు రుణాల్లో దళారులు ఉండకూడదని బ్యాంకు రుణం డబ్బులను నేరుగా సభ్యుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. అయినా ఆర్పీలు మాత్రం మహిళా సంఘాల అధ్యక్షుల ఇళ్లకు వెళ్లి సభ్యుల నుంచి డబ్బులు వసూలు చేసి ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు.

-తెరవెనక సీఓలు…
ఆర్పీల వసూలు దందా వెనక సీఓలు సూత్రధారులుగా వ్యవహరిస్తున్నట్లు మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆర్పీలు చేసిందేమి లేదు…తాము సక్రమంగా బ్యాంకు రుణం చెల్లిస్తే బ్యాంకు అధికారులు రుణాలు ఇస్తున్నారు…మధ్యలో ఆర్పీలు బ్యాంకు రుణాలు తామే ఇప్పించినట్లు కమీషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ ‌చేస్తున్నారని వికారాబాద్‌ ‌జిల్లా కొడంగల్‌ ‌పట్టణంతో పాటు నియోజకవర్గంలోని పలు మహిళా సంఘాల సభ్యులు వాపోయారు. తాము ఒక్కరమే తీసుకోవడం లేదు..సీఓలకు, ఆపై అధికారులకు ఇవ్వాల్సి ఉంటుందని చెబుతూ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. అయినా వారి తీరు మారడం లేదు. క్షేత్రస్థాయిలో వారి దూడుకుడను నియంత్రించాల్సిన అధికారులు వారికి సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -కమీషన్‌ ‌డిమాండ్‌…

‌మహిళా సంఘాలకు బ్యాంకు రుణాల్లో రూ.1లక్షకు రూ.1,000 ఆర్పీలు వసూలు చేస్తున్నారు. తాము బ్యాంకర్ల చుట్టూ తిరిగి రుణాలు మంజూర్‌ ‌చేయించామంటూ రుబాబుగా వసూలు చేస్తున్నారని పలువురు మహిళా సంఘాల సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మెప్మా జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని మహిళా సంఘాల సభ్యులు కోరుతున్నారు.

Leave a Reply