Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో మారోబోతున్న రాజకీయ సమీకరణలు

“ఒకవైపు రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ఆవిష్కరణ జరుగబోతుండగా, మరో పక్క పాతపార్టీకి కొత్త రథసారధి బాధ్యతలను స్వీకరించబోతుండడంతో ఇక్కడ రాజకీయాలు ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. వైఎస్‌ ‌రాజశేఖర్‌రెడ్డి కూతురు వైఎస్‌ ‌షర్మిల తాను తెలంగాణ ఇంటి కోడలునని, తనకూ రాజకీయాల్లోకి వొచ్చే హక్కు ఉందని గత రెండు మూడు నెలలుగా రాష్ట్రమంతా తిరుగుతూ తాను స్థాపించబోయే పార్టీకి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుంది. తన పార్టీ పేరు, జండా, ఎజండా అంతా వైఎస్‌ ‌పుట్టిన రోజును పురస్కరించుకుని జూలై 8న ప్రకటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నది. అలాగే గత సంవత్సరకాలంగా కాంగ్రెస్‌ ‌రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో కొనసాగుతున్న గందరగోళ వాతావరణానికి శనివారంతో బ్రేక్‌ ‌పడింది. ఆ పార్టీ కేంద్ర అధిష్టానవర్గం అనుముల రేవంత్‌రెడ్డి పేరును ప్రకటించి ఆ విషయంలో గత కొంతకాలంగా జరుగుతున్న చర్చోపచర్చలకు ఫుల్‌స్టాప్‌ ‌పెట్టింది.”

రాష్ట్రంలో వొచ్చేనెల నుంచి రాజకీయ సమీకరణలు మరింత ఆసక్తిగా మారబోతున్నాయి. ఒకవైపు రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ఆవిష్కరణ జరుగబోతుండగా, మరో పక్క పాతపార్టీకి కొత్త రథసారధి బాధ్యతలను స్వీకరించబోతుండడంతో ఇక్కడ రాజకీయాలు ఆసక్తికరంగా ఉండ•బోతున్నాయి. వైఎస్‌ ‌రాజశేఖర్‌రెడ్డి కూతురు వైఎస్‌ ‌షర్మిల తాను తెలంగాణ ఇంటి కోడలునని, తనకూ రాజకీయాల్లోకి వొచ్చే హక్కు ఉందని గత రెండు మూడు నెలలుగా రాష్ట్రమంతా తిరుగుతూ తాను స్థాపించబోయే పార్టీకి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుంది. తన పార్టీ పేరు, జండా, ఎజండా అంతా వైఎస్‌ ‌పుట్టిన రోజును పురస్కరించుకుని జూలై 8న ప్రకటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నది. అలాగే గత సంవత్సరకాలంగా కాంగ్రెస్‌ ‌రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో కొనసాగుతున్న గందరగోళ వాతావరణానికి శనివారంతో బ్రేక్‌ ‌పడింది. ఆ పార్టీ కేంద్ర అధిష్టానవర్గం అనుముల రేవంత్‌రెడ్డి పేరును ప్రకటించి ఆ విషయంలో గత కొంతకాలంగా జరుగుతున్న చర్చోపచర్చలకు ఫుల్‌స్టాప్‌ ‌పెట్టింది. అయితే రేవంత్‌రెడ్డికి పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇచ్చే విషయంలో మొదటినుంచి ఇక్కడ ఆ పార్టీ సీనియర్‌లు వ్యతిరేకిస్తూనే ఉన్నారు.

దశాబ్దాలుగా ఆ పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న తమను కాదని, వేరే పార్టీ నుంచి వొచ్చినవారికి ప్రాధాన్యమివ్వడాన్ని వారు తీవ్రంగా ఆక్షేపిస్తూ వొచ్చారు. ఆ పదవిని ఆశించిన సీనియర్ల సంఖ్య కూడా తక్కువేమీకాదు. వీరంతా హైదరాబాద్‌ ‌టు ఢిల్లీ చక్కర్లు కొడుతూ, తమ గాడ్‌ ‌ఫాదర్స్ ‌ద్వారా చేయాల్సినంత ప్రయత్నాలు చేశారు. కాగా ఈ పోటీలో చివరకు మిగిలిన ఇద్దరిలో ఆ పదవి రేవంత్‌రెడ్డిని వరించింది. ఆయన జూలై ఏడవ తేదీన పదవీ బాధ్యతలను చేపట్టబోతున్నారు. ఈ రెండు పార్టీలు కూడా అధికార పార్టీ టిఆర్‌ఎస్‌ను సంపూర్ణంగా ఎదుర్కునేందుకు సిద్ధమవుతున్నాయి. టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అధికారంలోకి వొచ్చినప్పటి నుండీ రెడ్లు అసంతృప్తిగా ఉన్నారన్న వార్తలు వొచ్చాయి. వారికి షర్మిల పెట్టబోయే పార్టీ పట్ల వారు ఆసక్తి చూపించే అవకాశాలున్నాయన్న వార్తలు కూడా అడపాతడపా వొస్తున్నాయి. కాగా రెడ్లందరిని ఒకతాటిపైకి తీసుకొచ్చే ఆలోచన ఉన్నట్లు వోటుకు నోటు సందర్భంగా రేవంత్‌ ‌పేర్కొన్నట్లు అప్పట్లో సంచలనవార్తలు వొచ్చాయి. ఇప్పుడు కొత్తపార్టీ ఆవిర్భావం, కొత్త సారథి పగ్గాలు చేపటుతుండడంతో రాష్ట్రంలో జరుగబోయే సమీకరణలపై ఆసక్తికరంగా చర్చ జరుగుతుంది.

ఇదిలా ఉంటే ఇంకా బాధ్యతలు పూర్తిస్థాయిలో చేపట్టకముందే రేవంత్‌రెడ్డికి అనేక సవాళ్ళు ఎదురవుతున్నాయి. అన్నిటికన్నా ముందు పార్టీలో ఐక్యతను తీసుకురావడం ఇప్పుడాయనకు పెద్ద భారంగా మారనుంది. అధ్యక్ష పదవికోసం చివరివరకు పోటీపడిన ఆ పార్టీ పార్లమెంట్‌ ‌సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇప్పుడు అలిగి కూర్చున్నాడు. తానిక కాంగ్రెస్‌ ‌భవన్‌ ‌మెట్లు ఎక్కేదేలేదని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. తనను కలవడానికి ఎవరూ రావొద్దంటూనే, రేవంత్‌రెడ్డికి ఆ పదవి ఎలా వొచ్చిందన్న విషయంలో తీవ్ర విమర్శలు చేశాడు. ఇక తన రాజకీయ భవిష్యత్‌ను కార్యకర్తలే నిర్ణయిస్తారంటూ మీడియా ముందు చెప్పడంతో ఆయన కాంగ్రెస్‌లో కొనసాగడమన్నది ప్రశ్నార్థకంగా మారింది. అప్పటికే రేవంత్‌రెడ్డి నియామకాన్ని వ్యతిరేకిస్తూ సీనియర్‌ ‌నేత కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు కూడా. అలాగే మరో సీనియర్‌ ‌సభ్యుడు మర్రి శశిధర్‌రెడ్డి కూడా తన పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆయన రేవంత్‌రెడ్డిని విమర్శించకుండా ఆయన నాయకత్వంలో కొత్తవారికి అవకాశాలు రావాలన్న ఉద్దేశ్యంగానే తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.

కాగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ అనేక పరాభవాలను ఎదుర్కుంటుంది. గత కొంతకాలంగా రాష్ట్రంలో జరిగిన వివిధ ఎన్నికల్లో వోటమిపాలే ఎక్కువ. ఒక్కో ఎన్నిక జరిగినప్పుడల్లా ఆ పార్టీ పరిస్థితి దిగజారుతూ వొస్త్తుంది. ఇప్పుడా పార్టీలో ఉన్నది కేవలం నలుగురు ఎంపిలు మాత్రమే. కోమటిరెడ్డి కార్యకర్తల సలహాతో పార్టీ మారితే ఆ పార్టీకి మరో మైనస్‌ ‌పాయింట్‌ అవుతుంది. గతంలోనే పద్దెనిమిది మంది ఎంఎల్‌ఏలున్న ఆ పార్టీలో ఇప్పుడు కేవలం ఆరుగురు మాత్రమే మిగిలారు. ఈ పరిస్థితిలో కొట్టుకుపోతున్న ఆ పార్టీని ఒడ్డుకు చేర్చే బాధ్యతను ఇప్పుడు అధిష్టానం రేవంత్‌రెడ్డికి అప్పగించింది. ఆయన్ను అధ్యక్షుడిగా నియమిస్తూ ఏర్పాటు చేసిన పార్టీ కమిటిలో కూడా కొంతమంది సీనియర్ల పేర్లే చొటుచేసుకున్నాయి. దీంతో సీనియర్లంతా ఏంచేయబోతున్నారన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. కాగా ఇతర పార్టీ నుండి వొచ్చి, సీనియర్‌లను కాదని, టిపిసిసి పగ్గాలు చేపట్టిన రేవంత్‌రెడ్డి త్వరలోనే తన ప్రయోజకత్వాన్ని నిరూపించుకోవాల్సిన పరీక్ష ఎదురుకానుంది. ఇటీవల ఈటల రాజేందర్‌ ‌రాజీనామాతో ఖాలీ అయిన హుజూరాబాద్‌ ‌శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతున్నది.

నిన్నటి వరకు ఆ స్థానంలో పోటీ ప్రధానంగా అధికార టిఆర్‌ఎస్‌, ‌బిజెపికా మాత్రమే ఉంటుందన్న చర్చ జరుగుతూ వొచ్చింది. ఇప్పుడు కొత్తగా రేవంత్‌రెడ్డి పగ్గాలు పట్టిన తర్వాత అక్కడ సీన్‌ ‌మారుతుందన్న అభిప్రాయపడుతున్నారు. మొదటిసారిగా ఎదురవుతున్న పరీక్షలో ఆయన ఉత్తీర్ణుడైతే పార్టీలో ఆయన నాయకత్వానికి ఇక తిరుగుండదు. వాస్తవానికి హుజూరాబాద్‌ ‌కాంగ్రెస్‌ ‌స్థానం కాకపోయినప్పటికీ ఇక్కడి గెలుపు మరో రెండేళ్ళలో రాబోయే శాసనసభ ఎన్నికల్లో అధికారం తమదేనంటున్న రేవంత్‌రెడ్డి మాటకు మార్గమవుతుంది. అయితే ఆయనకు సీనియర్‌లు ఎంతవరకు సహకరిస్తారన్నదే ఎదురవుతున్న ప్రశ్న. కాగా సీనియర్‌లను ప్రసన్నం చేసుకునే పనిని ఇప్పటికే ఆయన చేపట్టారు. మొదటి నుండి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వి. హనుమంతరావు అస్వస్థతగా హాస్పిటల్‌లో చేరితే ఆయన వద్దకు వెళ్ళి, కలిసి పనిచేద్దామని ఆయనతో అనిపించుకోగలిగాడు. అలాగే కుందూరు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య ఇండ్లకు వెళ్ళి కలిసిన రేవంత్‌రెడ్డి త్వరలోనే అందరి మద్దతును కూడగట్టుకోగలనన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాడు.

( మండువ రవీందర్‌రావు )

Leave a Reply