ఏకగ్రీవాల కోసం పక్కా ప్లాన్
ఏకగ్రీవాలతో అనేక సీట్లను సొంత చేసుకుంటున్న అధికార వైకాపా, జిల్లాల్లో పట్టు సాధించేందుకు యత్నిస్తోంది. అనేక జిల్లాల్లో పార్టీ పటిష్టంగా ఉండడంతో ఎన్నికల్లో ఎదురు ఉండకపోవచ్చని అంటున్నారు. రాష్ట్ర మంత్రులు అంతా కలసికట్టుగా ముందుకు సాగుతున్నారు. పంచాయితీ ఎన్నికలను ప్రతిష్టగా తీసుకుని శ్రేణులను నడిపిస్తున్నారు. స్థానిక సంస్థల్లో 90 శాతం వైసీపీయే కైవసం చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టార్గెట్ పెట్టడంతో వారు జిల్లాలో వ్యూహాత్మకంగా సాగుతున్నారు. మంత్రులు తమ పదవుల్లో వారు రెండున్నరేళ్ల పాటు .. అంటే 30 నెలలే ఉంటారని.. పనితీరు ఆధారంగానే ఆ తర్వాత కొనసాగిస్తానని జగన్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారని.. మంత్రి పదవులకు పోటీ తీవ్రంగానే ఉందన్నారు. పనితీరులో ఏమాత్రం అలసత్వం చూపినా.. పదవులు వేరేవారికి వెళ్తాయని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేల కంటే మంత్రులపైనే ఎక్కువగా పడింది. దీంతో.. మంత్రులు వైసీపీ సానుభూతిపరులను గెలిపించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ ఉన్న సమయంలో.. కర్నూలు జిల్లాలో జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి చెందడంతో.. మూలింటి మారెప్పను అప్పట్లో మంత్రి పదవి నుంచి తొలగించారు. ఇదే కారణంతో పశ్చిమగోదావరి జిల్లాలో మాగంటి బాబును కూడా తప్పించారు. ఇప్పుడు జగన్ కూడా ఇదే తరహాలో తమను తప్పిస్తారేమోనని మంత్రులకు బెంగ పట్టుకుంది. రాష్ట్రంలో గత ఏడాది మార్చిలో స్థానిక ఎన్నికలు ఏకపక్షంగా నడిచాయి.
ప్రత్యర్థులను నామినేషన్ వేయకుండా మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దాడులు, కిడ్నాపులు, బలవంతంగా నామినేషన్ల ఉపసంహరింప జేయడం వంటివన్నీ జరిగాయి. రాజకీయాలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికల పక్రియ అయినా ఎవరికి వారు తమ మద్దతుదారులను గెలిపించే పనిలో పడ్డారు. ప్రతిపక్షాల మద్దతుదారులను వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారన్న ఆరోపణలు ఉన్నా అధికార పార్టీ లెక్కచేయడం లేదు.