- పోడు భూముల్లో పట్టాలివ్వడంపై ప్రధాన దృష్టి
- ఈ నెల 21న వైఎస్సార్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం
వైఎస్ షర్మిల తెలంగాణలో తొలిపోరుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు ఖమ్మం జిల్లా వేదిక కాబోతోంది. ఈ నెల 21న ఖమ్మంలో వైఎస్సార్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. పోడు భూముల్లో పట్టాలివ్వడమే తొలిపోరుగా షర్మిల కసరత్తు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి 21న ఉదయం లోటస్ పాండ్ నుంచి భారీ కాన్వాయ్‌తో ర్యాలీగా షర్మిల ఖమ్మం వెళ్లనున్నారు. పార్టీకి పునాది వేయడానికి లోటస్‌పాండ్‌లోని బ్రదర్ అనిల్ కార్యాలయంలో షర్మిల కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముందు హైదరాబాద్‌లోని శివారులో ఓ హోటల్లో ఆమె కీలక సమావేశం నిర్వహించారు. అయితే ఈ భేటీకి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మాజీ ఎంపీ హాజరయ్యారనే ప్రచారం జరుగుతోంది.
అక్కడే ఖమ్మం జిల్లాలకు సంబంధించిన పలు అంశాలను ఆ నేత షర్మిల దృష్టికి తీసుకువచ్చారు. ఆయన ప్రస్తావించిన పలు అంశాల్లో.. పోడు భూముల సమస్యపై చర్చించినట్లు చెబుతున్నారు. అందుకే ఈ కార్యక్రమంతోనే షర్మిల రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాలని అనుకుంటు న్నారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో టీఆర్ఎస్ హవాలో కూడా ఖమ్మం జిల్లా నుంచి వైసీపీ తరపున పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలుపొందారు. అదే ఎన్నికల్లో పినపాక నియోజకవర్గం నుంచి పాయం వెంకటేశ్వర్లు వైసీపీ తరపున గెలుపొందారు. అందుకే ఆమె మొదటి ప్రాధాన్యత ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత సీఎం జగన్ ఏపీపైనే ఫోకస్ పెట్టారు. దీంతో ఖమ్మం జిల్లా నేతలు ఇతర పార్టీల్లో చేరారు. అయితే తిరిగి ఆ నేతలను షర్మిల తన పార్టీలో చేర్చుకు నేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని జిల్లా నేతలు చెబుతున్నారు. దీంతో అక్కడ తమ ఓటు బ్యాంక్ పధిలంగా ఉందనే అంచనాకు షర్మిల వచ్చినట్లు సమాచారం.
అలాగే జిల్లాలో రాజశేఖర్‌రెడ్డికి బలమైన కేడర్ ఉంది. ఆ కేడర్‌ను షర్మిల తన బలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు షర్మిల తెలంగాణలో పార్టీని స్థాపించేందుకు కసరత్తు ప్రారంభించారు. పార్టీ నిర్మాణం కోసం వివిధ జిల్లాలో నేతలతో సమావేశమవుతున్నారు. నేతల నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు. పార్టీ ప్రకటన కంటే ముందుగా ఆమె ప్రజా సమస్యపై దృష్టి సారించాలని భావిస్తున్నారు. ముందుగా క్షేత్రస్థాయిలో పనిచేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అటు రాజకీయ నేతలతో పాటు దివంగత మాజీ సీఎం రాజశేఖర్‌రెడ్డి అభిమానుల సలహాలను కూడా తీసుకుంటున్నారు. రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రజల్లో ప్రాచుర్యం పొందిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. పార్టీ ఎజెండాలో కూడా చేర్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.